జగన్‌.. మరీ ఇంత బరితెగింపా?

నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్‌ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది.

Published : 25 Apr 2024 05:47 IST

శిరోముండనం కేసులో శిక్షపడిన త్రిమూర్తులునే మండపేటలో కొనసాగింపు
దళితుల మనోభావాలను గాయపరిచిన త్రిమూర్తులు దర్జాగా నామినేషన్‌
ఎమ్మెల్సీ అనంతబాబుకు ఎస్టీ నియోజకవర్గ బాధ్యతలా?
దళితులపై మీకున్న ప్రేమ ఇదేనా?

ఈనాడు, అమరావతి: నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్‌ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. మాటలతో మాయచేసి, చేతలతో గొంతు కోస్తారని నిరూపితమైంది. దళితులకు శిరోముండనం చేసినట్లు కోర్టు నిర్ధారించి, శిక్ష వేసిన వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుతో మండపేట అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయించారంటే జగన్‌కు దళితులంటే ఎంత చులకన? శిక్ష ఖరారయ్యాక కూడా పార్టీ నుంచి సస్పెండ్‌ చేయకుండా, దర్జాగా పోటీ చేయ్‌ అంటూ భరోసా కల్పించారు. దళిత యువకుడి హత్య, డోర్‌ డెలివరీ చేసిన కేసులో నిందితుడైన వైకాపా ఎమ్మెల్సీని ఏదో మొక్కుబడిగా సస్పెండ్‌ చేసినా, మళ్లీ తన వెనకే తిప్పుకొంటూ జగన్‌ అందలమెక్కించారు. అపాయింట్‌మెంట్‌ లేకుండానే నేరుగా తన తాడేపల్లి ప్యాలెస్‌లోకి వచ్చేంత స్వేచ్ఛ ఇచ్చారు. అతడిని ఎస్టీ నియోజకవర్గమైన రంపచోడవరానికి సామంతరాజుగా చేసి, అక్కడి అభ్యర్థిని గెలిపించే బాధ్యత కూడా కట్టబెట్టారంటే జగన్‌ ఎంతకు బరితెగించారు? దళితులంటే మరీ ఇంత లెక్కలేనితనమా? సీఎం అండ చూసుకొని తోట త్రిమూర్తులు మండపేట అసెంబ్లీ వైకాపా అభ్యర్థిగా బుధవారం నామినేషన్‌ దాఖలు చేయడం చూసి అంతా విస్తుపోతున్నారు.

శిక్ష ఖరారైనా.. అతడే అభ్యర్థి

అమానవీయంగా దళిత యువకులకు శిరోముండనం చేయించిన ఘటనలో తోట త్రిమూర్తులును విశాఖపట్నం కోర్టు దోషిగా తేల్చింది. 18 నెలల శిక్షతో పాటు జరిమానా విధిస్తూ ఈ నెల 16న తీర్పు చెప్పింది. అయినా సరే ఆయన్నే మండపేట అభ్యర్థిగా జగన్‌ కొనసాగించారు. దళితుల మనోభావాలను దెబ్బతీయడాన్ని తన విజయంగా భావిస్తున్నారో.. మరేమోగానీ.. కనీస పశ్చాత్తాపం లేకుండా త్రిమూర్తులు మండపేటలో నామినేషన్‌ సమర్పించారు.

విశాఖపట్నం కోర్టు శిక్ష విధించాక, ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ‘ఇక్కడి నుంచి నేరుగా మండపేటలో ప్రచారానికి వెళ్తున్నా’ అని చెప్పడం గమనార్హం. ఆయన అనుచరులు సైతం జై తోట అంటూ నినాదాలు చేయడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో దళిత జనాభా ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి అగ్రస్థానంలో ఉంటుంది. అలాంటి జిల్లాలోనే ఎమ్మెల్సీలు త్రిమూర్తులు, అనంతబాబు దళితులను వంచించారు.

కప్పం కట్టాల్సిందే!

త్రిమూర్తులు వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమే. పార్టీలు మారుతూ గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా లీజుకు తీసుకుని, అదే బస్టాండ్‌కు దారి లేకుండా చేసి భవనం నిర్మించారనే ఆరోపణలున్నాయి. మండపేటలో ఓ వ్యక్తి షెడ్డు వేసుకుంటే దాన్ని కూల్చివేయించారు. అనంతరం కప్పం కట్టాక అనుమతులిచ్చారనేది బహిరంగ రహస్యం. అంతేగాక త్రిమూర్తులు మండపేట వైకాపా బాధ్యుడిగా వెళ్లినప్పటి నుంచి అక్కడ ఎవరు ఇల్లు నిర్మించాలన్నా.. తనకు కప్పం కట్టేలా బెదిరించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

కేశవరంలో గ్రావెల్‌ కొట్టేసి..

మండపేట మండలం కేశవరం కొండ సర్వే నంబరు 678లº అక్రమంగా గ్రావెల్‌ తవ్వేశారు. ఇందులో త్రిమూర్తులు హస్తముందని, రూ.50 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ మండపేట తెదేపా ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఆరోపించారు. ఈ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని ఆయన, జనసేన నేతలు ఇటీవల పరిశీలించేందుకు సిద్ధమవ్వగా పోలీసులు అడ్డుకున్నారు. క్వారీ ప్రాంతంలో ప్రైవేటు సైన్యాన్ని కాపలా ఉంచడం, అనుమతికి మించి తవ్వకాలు జరపడం వివాదాస్పదమైంది.

సీలింగ్‌ భూమిని సొంతం చేసుకొని..

కాజులూరు మండలం పల్లిపాలెంలో త్రిమూర్తులు 34 ఎకరాల ల్యాండ్‌ సీలింగ్‌ భూమిని తప్పుడు పత్రాలతో ఆయన కుటుంబ సభ్యుల పేరిట మార్చుకున్నారని ఫిర్యాదులున్నాయి. ఈ భూమిపై బ్యాంకులో రూ.కోట్ల రుణం తీసుకున్నారని మండపేట జనసేన నాయకుడు వేగుళ్ల లీలాకృష్ణ గతంలోనే కాకినాడ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

అనంతుడికి రంపచోడవరాన్ని రాసిచ్చేసిన జగన్‌

తన వద్ద కారు డ్రైవరుగా పనిచేసిన దళిత యువకుడిని హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన కేసులో నిందితుడుగా జైలుకెళ్లి.. బెయిల్‌పై బయట ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు (అనంత సత్య ఉదయభాస్కర్‌) విషయంలోనూ జగన్‌ అమితమైన ప్రేమాభిమానాలు చాటుకున్నారు. ఎస్టీ నియోజకవర్గమైన రంపచోడవరానికి ఆయన్ను సామంతుడిగా ప్రకటించేశారు. విస్తృత అధికారాలు కట్టబెట్టారు. ఆయన ఎవరి పేరు చెబితే వాళ్లే అక్కడి అభ్యర్థి. దళిత యువకుడి హత్య జరిగిన వెంటనే అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్‌ చేయలేదు. దళిత, ప్రజా సంఘాలు ఆందోళన చేయడంతో నాలుగైదు రోజుల తర్వాత సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకొచ్చిన అనంతబాబు తన ఉనికిని చాటుకునేందుకు రంపచోడవరంలో సభ నిర్వహిస్తే.. ‘బాస్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ వైకాపా నేతలే ఫ్లెక్సీలు పెట్టి, ఆ సభను దగ్గరుండి నిర్వహించారు. వైకాపా ఎమ్మెల్యేలు, నేతలూ అతనితోపాటు సభావేదిక పంచుకున్నారు. రంపచోడవరంలో వరద బాధిత ప్రాంతాలను ముఖ్యమంత్రి జగన్‌ పరిశీలించేందుకు వెళ్లినప్పుడూ ఆయనతో పాటు అనంతబాబు తిరిగారు.


త్రిమూర్తులుపై ఉన్న కేసులివి..

  • తాజాగా శిక్ష పడిన శిరోముండనం కేసు.
  • తెలంగాణలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని నాగర్‌కర్నూలు పోలీసుస్టేషన్‌లో 2005లో ఒక కేసు నమోదైంది. ఇప్పటికీ ఈ కేసులో కోర్టు వాయిదాలకు ఆయన హాజరుకావడం లేదు.
  • కాకినాడ జిల్లా సర్పవరం పోలీసుస్టేషన్‌లో 2006లో ఒక కేసు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని