మేనమామ కాదు.. మేకవన్నె పులి

ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్‌లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం!

Updated : 28 Apr 2024 09:51 IST

ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్‌లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం!


జీవకణాల్లో డీఎన్‌ఏ పనితీరును అస్తవ్యస్తం చేసే క్యాన్సర్‌- లోపల్లోపలే ముదిరిపోతుంది. మనిషిని మరణం అంచులకు ఈడ్చుకుపోతుంది. అలాంటి క్యాన్సర్‌- జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలో సర్కారీ విద్యకు సోకింది. పేదలూ బడుగు బలహీనవర్గాల పిల్లలెక్కువగా చదువుకునే ప్రభుత్వ బడులకు అది ప్రాణాంతకమైంది. ప్రపంచ స్థాయి విద్య, టోఫెల్‌, బైజూస్‌ అంటూ రంగుల సినిమాలెన్నో చూపించిన జగన్‌- చిన్నారులకు అక్షరమ్ముక్క ఒంటబట్టకుండా చేసి ఒక తరం భవితకు కాలయముడయ్యారు. పాఠశాలల రూపురేఖలను మార్చేస్తున్నాననే మెహర్బానీ మాటల మత్తుమందును చల్లుతూ- సర్కారీ చదువులను చెట్లకిందకు తీసుకొచ్చారు. అతీగతీ లేని ‘నాడు-నేడు’ పనులతో సొంత పార్టీ ప్రబుద్ధుల జేబులు నింపారు. పిల్లలకు మేనమామగా ఉంటానన్న జగన్‌ నిజానికొక మేకవన్నెపులి. అన్నం పెట్టే చదువులకు చెదలు పట్టించిన గూడుపుఠాణీ రాజకీయాలు ఆయనవి!

నాడు-నేడు.. ఒక జగన్మోసపు రెడ్డి!

ధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల దశ, దిశ మార్చేస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో మంగయ్య శపథం చేశారు జగన్‌. ‘‘నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలు సమూలంగా మారుస్తున్నాం’’ అని సీఎం అయిన కొత్తలో ఆయన కోతలు కోశారు. ‘‘నాడు-నేడు, ఇంగ్లిష్‌ మీడియంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయంటే కారణం మీ జగన్‌’’ అంటూ ఇటీవల తనకుతానే వీరతాడు వేసేసుకున్నారు. ఇదంతా పచ్చి బూటకం! జనాన్ని వెర్రోళ్లుగా జమకట్టి జగన్‌ ఆడుతున్న కుటిల నాటకం! దాదాపు 45వేల స్కూళ్లలో ‘నాడు-నేడు’ పనులు చేపట్టామని జగన్‌ మోతెక్కించారు. కానీ, మొన్న ఫిబ్రవరి నాటికి 32వేల పాఠశాలల్లో ఆ పనులేవీ పూర్తికాలేదు. 12 వేలకు పైగా బడుల్లోనైతే అసలు పనులే చేపట్టలేదు. నిధులు విడుదల చేయకుండా వట్టిగా ‘అబ్రకదబ్ర’ అంటే- పాఠశాలల తలరాత మారుతుందా? తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.38 లక్షలు అవసరం. మొన్న ఫిబ్రవరి నాటికి సర్కారు విదిల్చింది రూ.3 లక్షలే! ఎక్కడిదాకో ఎందుకు- జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలోని వేంపల్లె జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో చేపట్టిన అదనపు తరగతి గదులు నిర్మాణ పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. జమ్మలమడుగు, బద్వేలు, శ్రీసత్యసాయి జిల్లా బత్తులపల్లి, విజయనగరం జిల్లా మక్కువ, శ్రీకాకుళం జిల్లా కవిటి.. ఇలా చాలాచోట్ల ‘నాడు-నేడు’ పడకేసింది. దాంతో చెట్ల కింద, కటిక నేల మీద చదువుకోవాల్సిన దుస్థితి పిల్లలకు పట్టింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఉర్రడ బొడ్డాపుట్టు బడిలో నాడు-నేడు తెమలక పిల్లలను ఆరుబయట కూర్చో బెట్టారు. అప్పుడే విద్యుత్‌ స్తంభం విరిగిపడి ఆరేళ్ల ధ్వనిత అన్యాయంగా బలైపోయింది. జగన్మోసపు రెడ్డి చేతల్లో నేలబారుతనమే ఆ చిట్టితల్లి చావుకు కారణమైంది!


జగన్‌ తుగ్లక్‌ రాజ్యం!

పిచ్చోడి చేతిలోని రాయికంటే ప్రమాదకరమైనది జగన్‌ చేతిలోని అధికారం. రాష్ట్రంలో ప్రతి రంగాన్నీ అది ఛిద్రంచేసింది. పునాది స్థాయి చదువులనైతే మొత్తం భ్రష్టు పట్టించింది. బడి పిల్లలకు ఒకేసారి పరభాషలో పాఠాలు చెప్పడం అనర్థదాయకమని నిపుణులు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. యునెస్కో, బ్రిటీష్‌ కౌన్సిల్‌ వంటివీ చిన్నారులకు తొలుత మాతృభాషలో బోధించాలని సిఫార్సు చేస్తున్నాయి. వాటిని కాలదన్ని ఇంగ్లీష్‌ పాటపాడిన జగన్‌- పిల్లలకు అటు ఆంగ్లం, ఇటు తెలుగు ఏదీ రాకుండా చేశారు. అమ్మభాష నుంచి పరభాషా మాధ్యమంలోకి పిల్లలను తీసుకెళ్లడం శాస్త్రీయ పద్ధతిలో జరగాలి. అదేమీ లేకుండా, ఇంగ్లీష్‌లో బోధించగలిగిన ఉపాధ్యాయులు అంతగా లేరని తెలిసీ జగన్‌ చేసిన ఘోరాపరాధం మూలంగా విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మాధ్యమంలో బోధన వల్ల టీచర్లు, విద్యార్థుల నడుమ భాషా సమస్య తలెత్తుతోందని జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) హెచ్చరించింది. పాఠాలను పిల్లలు అర్థం చేసుకోలేక పోతున్నారని ఆందోళన వ్యక్తంచేసింది. దాన్ని పట్టించుకోని జగన్‌ మూలంగా పేదలూ దళిత బలహీనవర్గాల చిన్నారులే ఎక్కువగా నష్టపోయారు. అది చాలదన్నట్లు-  సీబీఎస్‌ఈ, ఐబీ సిలబస్‌లంటూ జగన్‌ సర్కారు పిచ్చి ప్రయోగాలెన్నో చేసింది. టీచర్ల అభిప్రాయాలు తెలుసుకోకుండా, మంచేదో చెడేదో చూడకుండా పిల్లల నెత్తిన మోయలేని బరువు పెట్టడం జగన్‌కు బాగా అలవాటైంది. ఒక పద్ధతీపాడూ లేకుండా చితికిపోయిన చిన్నమెదడులో ఏది తోస్తే అది చేయడానికేనా జగన్‌ సీఎం అయ్యింది?


జగన్‌ ఓట్లయావకు చిన్నారుల బలి

రాష్ట్రంలోని మూడో తరగతి ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థుల్లో దాదాపు పాతిక శాతం మంది ‘క్యాట్‌, బస్‌, న్యూ..’ వంటి వాటినీ చదవలేకపోతున్నారు. ‘అసర్‌’ సర్వేలోనే ఆ విషయం వెలుగులోకి వచ్చింది. జగన్‌కు నిజంగా తెలివి, పిల్లలపై ప్రేమ ఉంటే- చిన్నారులు చదువుల్లో ఎందుకు వెనకపడుతున్నారో చూడాలి కదా! కానీ, జగన్‌కు ఆ ఆలోచనే రాలేదు. సరికదా- ఏదో గొప్పపని చేసేస్తున్నట్లు జనాన్ని మాయ చేయడానికి మూడో తరగతి నుంచి ‘టోఫెల్‌’ పాఠాలంటూ మొదలుపెట్టారు. వాటిని బోధించగలిగిన టీచర్లు, బోధనా వనరులు లేకపోయినా సరే, జగన్‌ జగమొండిపట్టు వీడలేదు. చెప్పాల్సిన సబ్జెక్టులను సరిగ్గా బోధించకుండా, పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో పరిశీలించకుండా ‘టోఫెల్‌’ భజన చేయడంవల్ల ఎవరికి ఉపయోగం? అన్నప్రాసన నాడే ఆవకాయ పెడతారా ఎవరైనా? టోఫెల్‌, జర్మన్‌, స్పానిష్‌ భాషల బోధనంటూ జగన్‌ సర్కారు ఆ బుద్ధిలేని పనులే చేసింది. ఆన్‌లైన్‌ చదువుల వల్ల పిల్లలకు లాభం లేదని యునెస్కో స్పష్టంగా చెప్పింది. అయినాసరే, ‘బైజూస్‌’తో అంటకాగిన జగన్‌- పిల్లలకు ట్యాబులు అంటగట్టారు. వాటివల్ల చిన్నారులకు మేలేమీ జరగలేదు. ముందు అన్నం చక్కగా వండితే దాంట్లో ఏ కూరైనా కలుపుకోవచ్చు. ముక్కిపోయి పురుగులు పట్టిన బియ్యంతో అన్నం వండినట్లు తరగతి గది బోధనను జగన్‌ పాడుచేశారు. ఆపై వెర్రిమొర్రి నిర్ణయాలతో పేదింటి పిల్లల బంగారు భవిష్యత్తును తన ఓట్ల యావకు బలిచేశారు.


పిల్లల ప్రాణాలతో చెలగాటం

ఎండమావులు దప్పిక తీర్చవు. అట్లాగే జగన్‌ మాటలేవీ వాస్తవాలు కావు. ‘‘నాడు-నేడు పనుల్లో నాణ్యత ముఖ్యం. ఈ విషయంలో ఎక్కడా రాజీపడవద్దు’’ అన్నది జగన్‌మోహన్‌ రెడ్డి దొరగారి ఆదేశం! అయ్యవారు నిజంగా అదే కోరుకుని ఉంటే-  కాస్త బాగా చేసేవారికి పనులు అప్పగించాలి కదా. కానీ, చాలాచోట్ల జగన్‌ పార్టీ నేతలే నాడు-నేడు పనులను చేజిక్కించుకున్నారు. పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట! జగన్‌ పార్టీ ప్రబుద్ధగణాల పనులూ అలాగే అఘోరించాయి. నంద్యాల జిల్లా మంచాలకట్ట బడిలో పైకప్పులకు పైపైన మరమ్మతులు చేశారు. దాంతో హెడ్మాస్టారు గదిలో పైకప్పు కూలింది. విశాఖపట్నం జిల్లా అర్చకునిపాలెం ప్రాథమిక పాఠశాలలో శ్లాబు పెచ్చులూడి ముగ్గురు పసిపిల్లలకు గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా కోసిగి మండల పరిషత్తు జేబీఎం పాఠశాల పైకప్పు విరిగి పిల్లలపై పడింది. ఇద్దరు బాలికలను గాయాల పాల్జేసింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట బడిలో సిమెంట్‌ పలక మీద పడి పాపం నాలుగో తరగతి పిల్లాడు సిద్ధు మరణించాడు. ‘నాడు-నేడు’ పనులు పూర్తయ్యి ఉంటే ఆ చిన్నారి తల్లికి కడుపుకోత తప్పేది. ఫ్లోరింగులు కుంగిపోవడం, మరుగు దొడ్ల తలుపులు ఊడిపోవడం, గోడలు పగుళ్లు తేలడం.. ఇలా నాడు-నేడు పనుల్లో లోపాలు అన్నీఇన్నీ కావు. జనం డబ్బును కాజేయడానికి జగన్‌ అనుచరులు చేసిన నాసిరకం పనులిప్పుడు పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడొంతుల బడుల్లో ‘నాడు-నేడు’ను పూర్తి చేయించని జగన్‌- పనుల్లో నాణ్యతకూ సమాధి కట్టించారు. ఇల్లు పీకి పందిరేసినట్లు తరగతి గదుల్లో, ఆవరణల్లో నిర్మాణ సామగ్రిని కుప్పలు పోయించి బడి వాతావరణాన్ని ధ్వంసం చేశారు. పాఠశాలల్లో తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్న జగన్‌- చాలాచోట్ల కనీసం మంచినీళ్లకూ గతి లేకుండా చేశారు. అలాంటి మనిషి ఇప్పుడొచ్చి సర్కారీ స్కూళ్లను ఉద్ధరించిన ఘనుణ్ని నేనంటూ నిర్లజ్జగా టముకేసుకుంటున్నారు.


అమ్మఒడి.. జగన్‌ బురిడీ!

చెరుకు తోటలో ఏనుగు పడినట్లు- రాష్ట్రం మీద పడ్డారు జగన్‌. అందినకాడికి అందినంత నాశనం చేసిపారేశారు. దానిపై పెల్లుబుకుతున్న జనాగ్రహం నుంచి తప్పించుకోవడానికి జగన్‌ ఇప్పుడు అబద్ధాల కోటలో దాక్కుంటున్నారు. అమ్మఒడి, గోరుముద్ద వంటివాటితో చదువుల విప్లవం తెచ్చానన్న వైకాపా అధినేత ఆత్మస్తుతులన్నీ వట్టి బొంకులే. ‘‘తల్లులు తమ పిల్లలను బడికి పంపిస్తే ఏడాదికి రూ.15,000 ఇస్తాం’’ అని ప్రతిపక్షనేతగా జగన్‌ నమ్మబలికారు. అధికారంలోకి వచ్చాకేమో ‘అమ్మఒడి’కి నానా కోతలు పెట్టారు. విద్యార్థికి 75శాతం హాజరు లేకపోతే డబ్బులేసేది లేదంటూ భీష్మించారు. విద్యుత్తు వాడకం 300 యూనిట్లు దాటితే- ‘అమ్మఒడి’ వర్తించదని ఇంకో కొర్రీ వేశారు. వీటిని అడ్డుపెట్టుకుని మూడేళ్లలో 1.86 లక్షల మంది తల్లులను ‘అమ్మఒడి’కి అనర్హులను చేశారు. రూ.15వేల జీతంతో బతుకులీడ్చే పొరుగుసేవల సిబ్బంది లక్ష మందికీ అలాగే మొండిచెయ్యి చూపించారు. ఇచ్చేవాళ్లకైనా మొత్తం డబ్బులిస్తున్నారా అంటే- అందులోనూ పిదపబుద్ధులు చూపించారు జగన్‌. పాఠశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ పేరిట రూ.2వేలు కోసేస్తున్నారు. ఆ సొమ్ములను స్కూళ్లకు ఇవ్వకుండా వైకాపా సర్కారే పొట్టలో వేసుకుంటోంది. ఇక మధ్యాహ్న భోజనానికి ‘గోరుముద్ద’గా పేరుమార్చిన జగన్‌- దాని నాణ్యతను గాలికొదిలేశారు. చాలామంది పిల్లలు ఆ అధ్వాన తిండిని తినలేక పారేస్తున్నారు. జగన్‌ ఇలాఖా పులివెందుల నియోజకవర్గంలోని బురుజుపల్లె ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన పిల్లలకు వాంతులు, విరోచనాలయ్యాయి. మరికొన్ని జిల్లాల్లోనూ చిన్నారులు అలాగే అనారోగ్యం పాలయ్యారు. ఇదీ జగన్‌మోహన్‌ రెడ్డి ఏలుబడి. చదువుల చెట్టు మొదట్లో విషం గుమ్మరించిన జగన్‌ కర్కశత్వానికి ప్రాయశ్చిత్తమే లేదు!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని