రోగుల సమాచారం మీకెందుకు?

వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్‌వీ.అశోకన్‌ ప్రశ్నించారు.

Published : 29 Apr 2024 05:16 IST

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు

ఈనాడు, విజయనగరం: వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్‌వీ.అశోకన్‌ ప్రశ్నించారు. ఆదివారం ఆయన విజయనగరంలో మాట్లాడారు. ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ పేరుతో రోగుల సమాచారం సేకరించాలని ప్రభుత్వం అన్ని ఆసుపత్రులనూ బలవంతం చేయడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. బీమా, ఔషధ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే వివరాలు సేకరిస్తున్నారని, దేశంలో ఎక్కడా ఈ ప్రక్రియ అమలు కావడం లేదని ఆరోపించారు. రోగికి సంబంధించిన కొన్ని వివరాలను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పారు.

న్యాయస్థానంలో కేసు వేస్తాం..

‘కేంద్రం రూపొందించిన ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ విధానం అమలుకు దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకపోయినా ఏపీ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ నిర్ణయం, తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేయాలని నిర్ణయించాం. దేశంలో అయిదేళ్లకోసారి ఎన్నికలొస్తున్నాయి. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజారోగ్యానికి సంబంధించి ఆరోగ్య మ్యానిఫెస్టో ప్రకటించడం లేదు. ఆ దిశగా ఆలోచించడం లేదు. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ బడ్జెట్‌ కేటాయింపులు కూడా తక్కువే. అందుకే మౌలిక వసతుల కల్పనలో వెనుకబడ్డాం. ఇంతవరకు క్షయను పూర్తిగా నిర్మూలించలేకపోయాం’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని