తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్‌

తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది.

Published : 29 Apr 2024 09:29 IST

వైకాపా నేతల తీరును నిరసిస్తూ రోడ్డెక్కిన బాధితులు

వెల్దుర్తి, న్యూస్‌టుడే: తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఉప్పలపాడు గ్రామ ఎస్టీ కాలనీలో వందకుపైగా కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 70 శాతంపైగా తెదేపా సానుభూతిపరులు ఉన్నారు. కొన్నేళ్లుగా గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటాయి. పంచాయతీ బోర్లు నిరుపయోగంగా మారాయి. నీరున్న ప్రాంతంలో బోర్లు వేసి, పైపులైన్‌ ద్వారా నీరందించాలన్న ఆలోచన వైకాపా ప్రభుత్వం చేయలేదు. నాలుగేళ్లుగా కాలనీ వాసులంతా ఓ రైతు పొలంలోని బోరు నుంచి నీరు కొనుగోలు చేస్తున్నారు. ఏడాదికి ఇంటికి రూ.6 వేల చొప్పున చెల్లిస్తున్నారు. రైతు తన బోరు నుంచి కాలనీకి పైపులైన్‌ ఏర్పాటు చేశారు. అక్కడ్నుంచి ఇళ్లకు సొంతంగా పైపులు వేసి నీటిని వాడుకుంటున్నారు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో కాలనీవాసులంతా కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డికి మద్దతుగా నిలిచారు.

దీన్ని జీర్ణించుకోలేని వైకాపా నాయకులు విద్యుత్తుశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి రైతు బోరు నుంచి నీటి సరఫరాను అడ్డుకున్నారు. అయిదురోజులుగా ఇబ్బందిపడుతున్న కాలనీవాసులు ఆదివారం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపైకి చేరుకుని ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా గుక్కెడు నీరివ్వలేని దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. తామంతా తెదేపాకు మద్దతుగా ఉన్నామన్న కక్షతో వైకాపా నాయకులు నీటి సరఫరాను అడ్డుకున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో సారా దొరికినంత సులువుగా తాగడానికి నీరు దొరకట్లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బలవంతంగా మహిళలను రోడ్డుపై నుంచి పక్కకు పంపించేశారు. ఈక్రమంలో ఎస్సై శ్రీహరి నిరసన వ్యక్తం చేసిన మహిళలపై కేసులు నమోదు చేస్తామని, పేర్లు చెప్పండంటూ బెదిరించడం వివాదాస్పదమైంది.

ట్యాంకర్లతో నీరందిస్తాం: కూటమి అభ్యర్థి బ్రహ్మారెడ్డి

మాచర్ల కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అక్కడికి చేరుకుని ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని చెప్పడంతో కాలనీవాసులు శాంతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగడానికి నీళ్లు అడిగితే పోలీసులు కేసులు పెట్టే పరిస్థితి దాపురించిందన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలోనూ పోలీసుల తీరు మారలేదని తప్పుపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని