సంక్షిప్త వార్తలు (6)

జీతాలు ఎప్పుడు పడతాయో తెలియట్లేదని చెప్పినందుకు నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కరణం హరికృష్ణను సస్పెండ్‌ చేయడం సరికాదని రిజిస్టర్డ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకాల కొండయ్య మండిపడ్డారు.

Updated : 30 Apr 2024 05:35 IST

సమయానికి జీతాలు రావట్లేదన్నందుకు సస్పెన్షనా..!
రిజిస్టర్డ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య మండిపాటు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జీతాలు ఎప్పుడు పడతాయో తెలియట్లేదని చెప్పినందుకు నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కరణం హరికృష్ణను సస్పెండ్‌ చేయడం సరికాదని రిజిస్టర్డ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకాల కొండయ్య మండిపడ్డారు. ఆయన మాటల్లో ఏ పార్టీకి వ్యతిరేకంగా గాని అనుకూలంగా కానీ మాట్లాడలేదని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘హరికృష్ణను సస్పెండ్‌ చేయడం సరికాదు. అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు.


ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ వెల్లడించారు. మార్కుల జాబితా కోసం https://cse.ap.gov.in/ వైబ్‌సైట్‌ని సూచించారు.


‘టెయిల్‌పాండ్‌’ నీటి తరలింపుపై వివరణ ఇవ్వండి

ఏపీ నీటిపారుదల శాఖకు కృష్ణా బోర్డు లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: తమ అనుమతి లేకుండా నాగార్జునసాగర్‌ దిగువన ఉన్న టెయిల్‌పాండ్‌ నుంచి నీటిని తరలించడంపై వివరణ ఇవ్వాలంటూ కృష్ణా బోర్డు ఏపీ నీటి పారుదల శాఖకు తాజాగా లేఖ రాసింది. ఈ నెల 13న తూములు తెరిచి నీటిని ఎందుకు మళ్లించారో తెలియజేయాలని లేఖలో కోరింది. ఏపీ ప్రభుత్వం మూడు టీఎంసీల నీటిని టెయిల్‌పాండ్‌ నుంచి తరలించిందంటూ ఇటీవల తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఈ అంశంపై చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ కృష్ణా బోర్డుకు లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలో బోర్డు స్పందించింది.


రూ.119కోట్ల.. మద్యం, మాదకద్రవ్యాల స్వాధీనం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గత సార్వత్రిక ఎన్నికల్లో రూ.13.11 కోట్ల విలువైన మద్యం, మాదకద్రవ్యాలు పట్టుబడితే.. ఈసారి ఎన్నికలకు ముందే రూ.119కోట్ల విలువైన సరకు పట్టుబడినట్లు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ), ఎక్సైజ్‌ శాఖ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. మద్యం, మాదకద్రవ్యాల అక్రమ తయారీ, రవాణాకు పాల్పడిన 343 మందిపై పీడీ యాక్ట్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిపాయి. ఈ వ్యవహారంలో మొత్తం 68,312 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నాయి. మద్యం, మాదకద్రవ్యాలకు సంబంధించి ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు కంటపడితే ఎస్‌ఈబీ: 94910 30853, అబ్కారీ శాఖ: 91541 06528, 81219 09444 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించాయి.


అప్పారావు మృతి ఉపాధ్యాయ లోకానికి తీరని లోటు

తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి : నోబుల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఉపాధ్యాయుడు అప్పారావు మృతి ఉపాధ్యాయ లోకానికి తీరని లోటని తెదేపా అధినేత చంద్రబాబు పేర్నొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఆయన తోడ్పడ్డారని సోమవారం ఓ ప్రకటనలో కొనియాడారు. అప్పారావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు.


‘పర్యాటక హోటళ్లు, రిసార్ట్‌ల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలి’

ఈనాడు-అమరావతి: పర్యాటక హోటళ్లు, రిసార్ట్‌ల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్‌ చేసింది. వివిధ సమస్యలపై ఐకాసగా ఏర్పడిన వీరు సోమవారం ఏపీటీడీసీ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ పద్మావతిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. మైపాడ్‌ రిసార్ట్‌ నిర్వహణను ప్రైవేట్‌ సంస్థకు అప్పగిస్తూ చేసిన ఒప్పందం రద్దు చేయాలని ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. బొర్రా గుహలను ప్రైవేట్‌ ఆపరేటర్లకు ఇచ్చే నిర్ణయాన్ని రద్దు చేయాలని ఐకాస ఛైర్మన్‌ ఏఎస్‌ శివారెడ్డి, సహాయ ఛైర్మన్‌ పి.గంగరాజు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని