5G Services: భారత్‌లో 5జీకి డిమాండ్.. ఏడాది చివరికల్లా 3 కోట్లకు యూజర్లు

భారత్‌లో 5జీ సర్వీసులకు క్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది. తాజాగా నిర్వహించిన సర్వేలో ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ యూజర్లు రెండు గంటలు ఎక్కువగా 5జీ సర్వీస్‌లను ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. 

Published : 03 Oct 2023 18:46 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ (5G Network)ను ప్రధాన నగరాలతోపాటు, పట్టణాలకు టెలికాం సంస్థలు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 లక్షల నుంచి కోటి మంది 5జీ ఫోన్లను (5G Handsets) ఉపయోగిస్తున్నట్లు ఎరిక్‌సన్‌ (Ericson) సంస్థ అంచనా వేసింది. 2023 చివరికల్లా ఈ సంఖ్య మూడు కోట్లకు చేరుతుందని ఒక నివేదికలో పేర్కొంది. ఈ మేరకు 5జీ సర్వీస్‌ల (5G Services) వినియోగంపై ఎరిక్‌సన్‌ అంతర్జాతీయ సర్వే నిర్వహించి నివేదిక రూపొందించింది. 

భారత్‌లో ఎక్కువ మంది యూజర్లు 5జీ డేటాను హై క్వాలిటీ వీడియో స్ట్రీమింగ్‌, వీడియో కాలింగ్, మొబైల్‌ గేమ్‌లు ఆడేందుకు, అగ్‌మెంటెడ్‌ రియాలిటీ సర్వీస్‌ల కోసం ఉపయోగిస్తున్నారని నివేదికలో పేర్కొంది. అమెరికా, బ్రిటన్‌, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలతో పోలిస్తే భారతీయ యూజర్లు వారంలో రెండు గంటలు ఎక్కువగా 5జీ సర్వీస్‌లను వాడుకుంటున్నారట. అలాగే, భారతీయ యూజర్లలో 15 శాతం మంది యాప్‌ వినియోగం, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్‌, మ్యూజిక్‌ వంటి సర్వీస్‌లతో కూడిన 5జీ డేటా ప్లాన్లకు ప్రస్తుత ధర కంటే 14 శాతం ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని సర్వేలో వెల్లడైంది. 

వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌ కొనేటప్పుడు ఏమేం చూడాలి? ఇంతకీ ఏమిటీ నాయిస్‌ క్యాన్సిలేషన్‌?

భారత్‌లో గతేడాది అక్టోబరులో 5జీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ మధ్యే 5జీ సర్వీసులకు సంబంధించి ప్రధాన పోటీ నెలకొంది. ఈ కంపెనీలు ప్రత్యేక ఆఫర్లతో యూజర్లకు 5జీ డేటాను అందిస్తున్నాయి. ఇదే క్రమంలో భారత్‌లో 5జీ నెట్‌వర్క్ వేగం కూడా గణనీయంగా పెరిగినట్లు ఇంటర్నెట్‌ టెస్టింగ్‌ కంపెనీ ఊక్లా వెల్లడించింది. తాజాగా నిర్వహించిన 5జీ ఇంటర్నెట్‌ స్పీడ్ టెస్ట్‌లో జపాన్‌ (58వ స్థానం), బ్రిటన్‌ (62వ స్థానం), బ్రెజిల్‌ (50వ స్థానం)లను దాటుకుని భారత్‌ 47వ స్థానంలో (గతంలో 72వ స్థానం) నిలిచింది. భవిష్యత్తులో భారత్‌లో మరింత వేగవంతమైన 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని, 5జీ ఫోన్లకు డిమాండ్ పెరుగుతుందని ఎరిక్‌సన్ అభిప్రాయపడింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు