Air Cooler Buying Guide: సరైన ఎయిర్‌ కూలర్‌ ఎంపిక ఎలా?.. కొనే ముందు ఇవి తెలుసుకోండి

ఈ వేసవిలో కూలర్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే కొనే ముందు ఏమేం చూడాలి?

Updated : 10 Apr 2024 10:08 IST

Air Cooler Buying Guide | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎండలు మండిపోతున్నాయి. బయటేమో వడగాలులు.. ఇంట్లోనేమో ఉక్కపోత. దీన్ని అధిగమించాలంటే ఏసీనో, కూలరో ఉండాల్సిందే. ముఖ్యంగా కూలర్‌ను కొనుగోలు చేసేటప్పుడు చాలామంది ఏది సరిపోతుందో తెలియక ఏదో ఒకటి కొనుగోలు చేసేస్తూ ఉంటారు. తర్వాత అవసరాలు తీరక ఇబ్బంది పడుతుంటారు. ఒకవేళ మీరూ కూలర్‌ కొనుగోలు చేయాలనుకుంటుంటే సరైనది ఎలా ఎంపిక చేసుకోవాలి? కొనేముందు ఏమేం చూడాలో ఇప్పుడు చూద్దాం.

కూలర్‌ రకం

కూలర్లలో చాలా రకాలు ఉన్నాయి. మీ అవసరాలకు సరిపోయినది ఎంచుకోవడం ఇక్కడ ముఖ్యం. చిన్న చిన్న గదులు ఉండి.. ఒక చోటు నుంచి మరో చోటుకు సులువుగా తీసుకెళ్లేందుకు వీలుగా ఉండాలంటే పర్సనల్‌/ టవర్‌ కూలర్లు బాగుంటాయి. ఇవి ఒకరిద్దరికి మాత్రమే. స్థిరంగా గదిలో ఒకచోట పెట్టాలనుకుంటే విండో కూలర్లు బెటర్‌. బాడీ భాగం బయట ఉండి కేవలం ఫ్యాన్‌ భాగం మాత్రమే లోపల ఉంటుంది. అదే పెద్ద పెద్ద గదులు, ఇంట్లో నలుగురైదుగురు ఉంటే మాత్రం డిజర్ట్‌ కూలర్లు తీసుకోవడం మంచిది.

AC Buying Guide: ఏసీ కొంటున్నారా? ఇవి తెలుసుకోండి..!

కెపాసిటీ

కూలర్‌ కొనేటప్పుడు నీటి సామర్థ్యం కూడా చూసుకోవడం ముఖ్యం. అప్పుడే ప్రతిసారీ నీటిని నింపే ఇబ్బంది తప్పుతుంది. చిన్న గదులు ఉండి చిన్నపాటి కూలర్‌ ఎంచుకునే వాళ్లకు 20 లీటర్ల కెపాసిటీ ఉన్న కూలర్‌ సరిపోతుంది. అదే పెద్ద గదులు ఉంటే 30-40 లీటర్ల కెపాసిటీ ఉన్న కూలర్లు తీసుకోవడం ఉత్తమం.

కూలర్‌ ప్యాడ్‌ 

మార్కెట్లో రెండు రకాల కూలింగ్‌ ప్యాడ్‌లతో కూలర్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధర కలిగిన కూలర్లలో గడ్డి తరహాలో ఉండే యాస్పెన్‌ ప్యాడ్‌ ఉంటుంది. దీని ధర కాస్త తక్కువ. మన్నిక కూడా తక్కువే. తేనె తుట్టెను పోలిన మరో రకం హనీ ప్యాడ్‌. దీని ధర కాస్త అధికం. గదిని చల్లబర్చడంలోనూ మెరుగ్గా పని చేస్తుంది. కాస్త అధిక ధర పెట్టగలిగే వారు దీన్ని ఎంచుకోవడం మంచిది.

ఈ ఫీచర్లూ ముఖ్యమే..

  • కూలర్‌ కొనుగోలు చేసేటప్పుడు రిమోట్‌ కంట్రోల్‌ ఆప్షన్‌ ఉండేది తీసుకోవడం మంచిది. రాత్రి వేళ్లలో స్వింగ్‌, కూల్‌, స్లీప్‌ టైమర్‌ వంటి ఆప్షన్లు ఎంచుకోవడంలో రిమోట్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • మార్కెట్లలో దొరికే సాధారణ ఎయిర్‌ కూలర్లలో డస్ట్‌ ఫిల్టర్‌ వంటి ఆప్షన్లు ఉండకపోవచ్చు. ఒకవేళ కాస్త అధిక ధర పెట్టి కొనుగోలు చేసేవి అయితే తప్పకుండా డస్ట్‌ ఫిల్టర్‌ ఉండేలా చూసుకోవాలి.
  • నీటిని నింపుకోవడంతో పాటు ఐస్‌ ఛాంబర్‌ ఉన్న కూలర్‌ ఎంచుకుంటే ఇంటిని ఇంకా త్వరగా చల్లబర్చొచ్చు. రిఫ్రిజిరేటర్‌ ఉన్న వాళ్లకిది ఉపయోగం.
  • మీ అవసరాలకు ఒక చోటు నుంచి ఒక చోటుకు తీసుకెళ్లేందుకు వీలుగా వీల్స్‌ ఉన్న కూలర్లు తీసుకోవడం మంచిది. లేదంటే వేరేగా స్టాండ్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
  • ఒక్కోసారి రోజులతరబడి కూలర్‌ను వాడకుండా అందులో నీటిని అలానే వదిలేస్తుంటాం. దీంతో ఆ నీరు దోమలకు ఆవాసంగా మారుతుంటుంది. కాబట్టి దోమలు చొరబడకుండా అడ్డుకునే వ్యవస్థ ఉందేమో చూసుకోవడం మంచిది.
  • కూలర్‌ కొనే ముందు చప్పుడు తక్కువగా ఉండేలా చూసుకోవడం ఉత్తమం. చప్పుడు ఎక్కువగా ఉంటే రాత్రి వేళల్లో నిద్రాభంగం కలుగుతుంది. కాబట్టి కొనే ముందే చెక్‌ చేసుకోవాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని