Airtel: ఏడాది వ్యాలిడిటీతో ఎయిర్‌టెల్‌ ప్లాన్లు ఇవే..

Airtel: ఎయిర్‌టెల్‌ త్వరలో టారిఫ్‌లను పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాది వ్యాలిడిటీతో ఈ టెలికాం సంస్థ అందిస్తున్న ప్లాన్లు ఏంటో చూద్దాం. ప్లాన్ల ధరలు పెరగక ముందే వీటితో రీఛార్జ్‌ చేసుకుంటే ఎంతో కొంత ఆదా అయ్యే అవకాశం ఉంది.

Published : 26 Mar 2024 15:33 IST

దిల్లీ: ఒక వినియోగదారు నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడంలో భాగంగా ఎయిర్‌టెల్‌ టారిఫ్‌లను పెంచే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ మేరకు ప్రకటన రావొచ్చని పరిశ్రమ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిఛార్జ్‌ మరింత భారం కాకముందే ఏడాది వ్యాలిడిటీ ప్లాన్లను ఎంచుకుంటే మేలు. తద్వారా ఒకే తరహా ప్రయోజనాల కోసం ఎక్కువ మొత్తం చెల్లించకుండా ఆదా చేసుకునే అవకాశం ఉంది. 

ఏడాది గడువుతో ఎయిర్‌టెల్‌ మూడు ప్రీపెయిడ్‌ ప్లాన్లను అందిస్తోంది. వాటి ధరలు రూ.3,359, రూ.2,999, రూ.1,799. ఒక్కో దాంట్లోని ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..

రూ.3,359 ప్లాన్‌..

ఎయిర్‌టెల్‌లో అధిక ప్రయోజనాలు ఉన్న ప్లాన్‌ ఇదే. అలాగే కంపెనీ అందిస్తున్న వాటిల్లో ఇదే అత్యంత ఖరీదైనది. దీంట్లో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకు 2.5జీబీ డేటా, 100 ఎసెమ్మెస్‌లు లభిస్తాయి. ఏడాది వ్యవధితో డిస్నీ+ హాట్‌స్టార్‌ సభ్యత్వం కూడా ఉంటుంది. వీటితో పాటు అపరిమిత 5జీ డేటా, అపోలో 24/7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్లు, వింక్‌ మ్యూజిక్‌ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 365 రోజులు.

రూ.2,999 ప్లాన్‌..

ఎయిర్‌టెల్‌ అందిస్తున్న రూ.2,999 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా, 100 ఎసెమ్మెస్‌లు లభిస్తాయి. అన్‌లిమిటెడ్‌ 5జీ డేటా, అపోలో 24/7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్లు, వింక్‌ మ్యూజిక్‌ వంటి ప్రయోజనాలూ ఉన్నాయి. ఈ ప్లాన్‌ గడువు కూడా 365 రోజులు.

రూ.1,799 ప్లాన్‌..

ఏడాది కాలపరిమితితో వస్తున్న ప్లాన్లలో తక్కువ ధర ఉన్నది ఇదే. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, 5జీ డేటా, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు, వింక్‌ మ్యూజిక్‌, ఉచిత హలోట్యూన్లు, అపోలో 24/7 సర్కిల్‌ వంటివి ఉన్నాయి. దీంట్లో 24జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. కేవలం దీర్ఘకాల వ్యాలిడిటీ మాత్రమే కావాలనుకునే వారికి ఇది సరిపోతుంది. డేటా ఎక్కువగా అవసరమయ్యే వారికి పెద్దగా ప్రయోజనం ఉండదు.

ఎయిర్‌టెల్‌ వచ్చే జులై-అక్టోబరు మధ్య టారిఫ్‌లను 15% వరకు పెంచొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ ఆర్పు రూ.208గా ఉంది. మార్కెట్‌ వాటా పరంగా జియో అగ్రగామిగా ఉండగా.. ఎయిర్‌టెల్‌ ద్వితీయ స్థానంలో ఉంది. వొడాఫోన్‌ ఐడియా మూడో స్థానంలో కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని