Cyber Attacks: ఫోన్‌, పీసీ వాడుతున్నారా? ప్రభుత్వం అందిస్తున్న ఈ టూల్స్‌ గురించి తెలుసా?

సైబర్‌ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టెలికాం విభాగం (DoT) ఎస్సెమ్మెస్స్‌ల ద్వారా సైబర్‌ స్వచ్ఛ కేంద్ర (Cyber Swachhta Kendra - CSK) వెబ్‌సైట్‌ లింక్‌లను మొబైల్‌ వినియోగదారులకు పంపుతోంది. మొబైల్‌ వాడే వారందరికీ ఇప్పటికే ఈ లింక్‌లు వచ్చే ఉంటాయి.

Updated : 22 Feb 2024 17:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాంకేతికత ఎంత వేగంగా వృద్ధి చెందుతుందో.. దాని మాటున మోసాలూ అదే స్థాయిలో జరుగుతున్నాయి. బ్యాంకింగ్‌ సహా ఇతర సేవలన్నీ ఇప్పుడు ఆన్‌లైన్ అందుబాటులోకి రావడంతో సైబర్‌ నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. మాల్‌వేర్‌ దాడులు, స్కామ్స్‌తో వ్యక్తులను దోచేస్తున్నారు. ప్రజల సొమ్ములతో పాటు వ్యక్తిగత డేటానూ కొల్లగొడుతున్నారు. ఈక్రమంలో సైబర్‌ నేరగాళ్ల నుంచి పౌరులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని ఫ్రీ టూల్స్‌ను అందిస్తోంది. 

సైబర్‌ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టెలికాం విభాగం (DoT) ఎస్సెమ్మెస్స్‌ల ద్వారా సైబర్‌ స్వచ్ఛ కేంద్ర (Cyber Swachhta Kendra - CSK) వెబ్‌సైట్‌ లింక్‌లను మొబైల్‌ వినియోగదారులకు పంపుతోంది. మొబైల్‌ వాడే వారందరికీ ఇప్పటికే ఈ లింక్‌లు వచ్చే ఉంటాయి. ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌, యాంటీ వైరస్‌ కంపెనీలతో కలిసి ఈ స్వచ్ఛ కేంద్ర పనిచేస్తుంది. బాట్‌నెట్‌ క్లీనింగ్‌ అండ్‌ మాల్‌వేర్‌ అనాలసిస్‌ సెంటర్‌గానూ దీన్ని పిలుస్తారు. ఇంతకీ అసలు బాట్‌నెట్‌ అంటే ఏంటి? ఉచిత యాంటీ వైరస్‌లను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి?

ఐకూ నుంచి నియో 9ప్రో.. 4 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌

బాట్‌నెట్‌ అనేది ఒక నెట్‌వర్క్‌. సైబర్‌ దాడుల/మోసాలకు పాల్పడే వ్యక్తులు బాట్‌ అనే మాల్‌వేర్‌ను యూజర్ల స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్లలోకి ప్రవేశపెడతారు. దాంతో ఆయా డివైజ్‌లు బాట్‌నెట్‌ నెట్‌వర్క్‌ పరిధిలోకి వస్తాయి. హ్యాకర్లు వీటిని పూర్తిస్థాయిలో కంట్రోల్‌ చేయగలుగుతారు. యూజర్ల డేటా సేకరించడంతోపాటు, యూజర్‌ అనుమతి లేకుండా స్పామ్‌ కాల్స్‌ చేయడం, ఇతరులకు మెసేజ్‌లు పంపించడం వంటివి చేయొచ్చు. బ్యాంకింగ్‌ వివరాలతో పాటు యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లు తెలుసుకునే అవకాశం ఉంటుంది. బాట్‌ మాల్‌వేర్‌ ఉన్న మెయిల్‌, వెబ్‌సైట్‌, డాక్యుమెంట్‌ను యూజర్లు తమ డివైజ్‌లలో ఓపెన్‌ చేస్తే అది ఫోన్‌/ కంప్యూటర్‌లోకి ప్రవేశిస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో అందుబాటులో ఉండే భద్రత లేని వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది. 

టూల్స్‌ ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి..?

ఉచితంగా యాంటీ వైరస్‌లను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు www.csk.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి సెక్యూరిటీ టూల్స్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ కంప్యూటర్లతో పాటు ఆండ్రాయిడ్‌ ఫోన్లకు సీఎస్‌కే అందిస్తున్న వివిధ కంపెనీల యాంటీ వైరస్‌ డౌన్‌లోడ్ లింక్‌లు కనిపిస్తాయి. మైక్రోసాఫ్ట్ విండోస్‌ ఓఎస్‌తో పనిచేసే కంప్యూటర్ల కోసం క్విక్ హీల్ (Quick Heal), ఇ-స్కాన్‌ (eScan Antivirus), కే7 సెక్యూరిటీ (K7 Secuirty) కంపెనీలు ఉచిత బాట్ రిమూవల్ టూల్స్‌ను అందిస్తున్నాయి. ఆయా టూల్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని డివైజ్‌లో రన్‌ చేయాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ఈ స్కాన్‌ కంపెనీ (eScan Antivirus), సీడాక్‌ హైదరాబాద్‌ (C-DAC Hyderabad) బాట్ రిమూవల్ యాప్స్‌ను అందిస్తున్నాయి. వీటిని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని