Anant Ambani: ‘అన్న సేవ’తో అనంత్‌ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకలు ప్రారంభం

Anant Ambani: ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్‌ ముందస్తు పెళ్లి వేడుకలకు సర్వం సిద్ధమైంది.

Updated : 29 Feb 2024 22:17 IST

జామ్‌నగర్‌: భారత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ (Anant Ambani) ముందస్తు పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు సమీపంలో ఉన్న జోగ్వాడ్‌ గ్రామంలో ‘అన్న సేవ’తో బుధవారం రాత్రి వీటికి శ్రీకారం చుట్టారు. ముకేశ్‌ అంబానీ, అనంత్‌ అంబానీ సహా వారి కుటుంబ సభ్యులు, కాబోయే పెళ్లికుమార్తె రాధికా మర్చంట్‌ (Radhika Merchant)తో పాటు ఆమె కుటుంబ సభ్యులు స్వయంగా భోజనం వడ్డించారు. సంప్రదాయ గుజరాతీ వంటకాలను గ్రామస్థులకు రుచి చూపించారు. దాదాపు 51 వేల మందికి రాబోయే కొన్ని రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

అనంత్‌, రాధిక ముందస్తు పెళ్లి వేడుకలకు (Anant Radhika pre wedding) స్థానికుల ఆశీర్వాదం కోసం అంబానీ కుటుంబం ఈ ‘అన్న సేవ’ను నిర్వహించింది. భోజనానంతరం ఆహ్వానితులు సంప్రదాయ జానపద సంగీతాన్ని ఆస్వాదించారు. ప్రముఖ గుజరాతీ గాయకుడు కీర్తిదాన్ గాధ్వి తన గానంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇలా ‘అన్న సేవ’ కార్యక్రమాలను నిర్వహించడం అంబానీ కుటుంబంలో సంప్రదాయంగా వస్తోంది. యావత్‌ దేశం కరోనా మహమ్మారితో పోరాడుతున్నప్పుడు ముకేశ్‌ సతీమణి నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ భారీ ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది.

అనంత్‌-రాధిక ప్రీ వెడ్డింగ్‌.. 2500 రకాల వంటకాలు..!

ఈ ప్రీవెడ్డింగ్‌ సంప్రదాయబద్ధంగా, అట్టహాసంగా జరగనుంది. గుజరాత్‌లోని కచ్‌, లాల్‌పుర్‌కు చెందిన మహిళా కళాకారులు తయారు చేసిన సంప్రదాయ కండువాలను అతిథులకు అందించనున్నారు. ఇటీవల రిలయన్స్ ఫౌండేషన్ తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. దీనిలో గుజరాత్‌కు చెందిన మహిళలు ‘బంధని స్కార్ఫ్‌’లకు క్యూరింగ్ చేయడం కన్పించింది. క్లిప్‌లో, నీతా అంబానీ, చేతివృత్తుల కళాకారులను కలుసుకుని వారి కృషిని ప్రశంసించడం గమనించొచ్చు. మరోవైపు జామ్‌నగర్‌లో విశాలమైన ఆలయ సముదాయంలో కొత్త మందిరాల నిర్మాణాన్నీ అంబానీ కుటుంబం చేపట్టింది.

అనంత్‌, రాధిక నిశ్చితార్థం 2023 జనవరిలో ముంబయిలోని అంబానీ నివాసం యాంటిలియాలో జరిగింది. ముకేశ్‌-నీతా అంబానీలకు ముగ్గురు పిల్లలు ఈశా, ఆకాశ్‌, అనంత్. వీరు గత కొన్నేళ్లుగా రిటైల్, డిజిటల్ సేవలు, నూతన ఇంధనం సహా రిలయన్స్‌ కీలక వ్యాపారాలకు నాయకత్వం వహిస్తున్నారు. అనుబంధ సంస్థల బోర్డుల్లోనూ సేవలందిస్తున్నారు.

‘అందుకే జామ్‌నగర్ ఎంచుకున్నాం’: ప్రీవెడ్డింగ్ వేదికపై అనంత్ స్పందన

రిలయన్స్ రిటైల్ విస్తరణకు ఈశా నేతృత్వం వహిస్తున్నారు. ఆకాశ్‌ అంబానీ జూన్ 2022 నుండి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అనంత్‌ నూతన ఇంధనం, మెటీరియల్ వ్యాపారాల విస్తరణను పర్యవేక్షిస్తున్నారు. ఈశాకు 2018లో, ఆకాశ్‌కు 2019లో వివాహం జరిగింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని