iPhone 15: ఐఫోన్‌ 15లో భారత్‌ ముద్ర.. ఆ మోడల్స్‌లో నావిక్‌

iPhone 15: జీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తయారు చేసిన నావిక్‌ నేవిగేషన్‌కు కొత్తగా మార్కెట్‌లో లాంచ్‌ చేసిన ఐఫోన్‌ 15 ఫోన్లలో ఉపయోగించారు.

Published : 14 Sep 2023 19:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యాపిల్‌ ఇటీవల ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్లను విడుదల చేసింది. కొత్తగా టైప్‌-సితో ఈ ఫోన్లను తీసుకొచ్చింది. ఈ ఫోన్లలో తొలిసారి భారత మార్కు కనిపించింది. ఇందులో అమర్చిన నావిగేషన్‌ వ్యవస్థే దీనికి కారణం. జీపీఎస్‌ (GPS) స్థానంలో భారతదేశం అభివృద్ధి చేసిన నావిగేషన్‌ వ్యవస్థ నావిక్‌ (Navic)ను ఉంచారు. జీపీఎస్ స్థానంలో నావిక్‌ను అమర్చిన మొదటి ఐఫోన్‌ ఇదే. అయితే, ఐఫోన్ 15 సిరీస్‌లో విడుదలైన అన్ని ఫోన్లలోనూ ఈ సదుపాయం ఉండదు. కేవలం ఐఫోన్‌ 15 ప్రో (iPhone 15), ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ (iPhone 15 Pro Max) మొబైల్స్‌లో మాత్రమే ఉంటుంది.

అసలేంటీ నావిక్‌ (Navic)

ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (GPS)కు ప్రత్యామ్నాయంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తయారు చేసిన కొత్త నేవిగేషన్‌ వ్యవస్థ ఈ నావిక్‌. ఇది ఏడు ఉపగ్రహాల ఆధారంగా పనిచేస్తుంది. దీంతో కచ్చితమైన స్థాన సమాచారాన్ని అందిస్తుంది. ఇంతకు ముందు ఐఫోన్లు కేవలం జీపీఎస్‌, గ్లోనాస్‌ (GLONASS), గెలీలియో వంటి గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్‌లపై మాత్రమే ఆధారపడేవి. జీపీఎస్‌కు పోటీ దాదాపు అన్ని దేశాలు సొంత నావిగేషన్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నాయి. చైనా (China), యూరోపియన్‌ యూనియన్ (European Union), జపాన్‌ (Japan), రష్యా (Russia) దేశాలు సొంత నేవిగేషన్‌ వ్యవస్థలను తయారు చేశాయి.

టైప్‌-సి పోర్ట్‌.. యాక్షన్‌ బటన్.. ఐఫోన్‌ 15 సిరీస్‌లో కొత్త మార్పులివే!

ఈ నేపథ్యంలో నావిక్‌ను 2018 నుంచి వినియోగంలోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది జనవరి నుంచి దేశంలో విక్రయించే ఫోన్లలో నావిక్‌ను వినియోగించాలని భారత ప్రభుత్వం సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ఐఫోన్‌ నావిక్‌ను తీసుకురావడం గమనార్హం. ఒక్క ఐఫోన్ 15 ప్రో మోడల్స్ మాత్రమే కాకుండా అనేక ఇతర స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఇస్రో నావిక్ నావిగేషన్ సిస్టమ్‌ను అనుసరిస్తున్నాయి. వీటిలో రెడ్‌మీ 11 ఎక్స్‌ (RedMi 11X), రెడ్‌మీ 11 టీ ప్రో (RedMi 11T Pro), వన్‌ప్లస్‌ నార్డ్‌ 2టీ (OnePlus Nord 2T), రియల్‌మీ 9 ప్రో (Realme 9 Pro) వంటి ఫోన్లు ఉన్నాయి. ఇక సెప్టెంబర్‌ 15 నుంచి ఐఫోన్‌ లేటెస్ట్‌ మోడల్స్‌కు ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానుండగా.. 22 నుంచి విక్రయాలు మొదలు కానున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని