iPhone 15 Series: టైప్‌-సి పోర్ట్‌.. యాక్షన్‌ బటన్‌.. ఐఫోన్‌ 15 సిరీస్‌లో కొత్త మార్పులివే!

iPhone 15 Series: యాపిల్‌ ఈవెంట్‌ సెప్టెంబరు 12న కాలిఫోర్నియాలో అట్టహాసంగా జరిగింది. ఐఫోన్‌ 15 సిరీస్‌ను కంపెనీ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. గత సిరీస్‌లతో పోలిస్తే వీటిలో చాలా మార్పులున్నాయి. అవేంటో చూద్దాం..!

Updated : 13 Sep 2023 12:37 IST

iPhone 15 Series | ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త ఉత్పత్తుల విడుదల కోసం టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఏటా నిర్వహించే కార్యక్రమం మంగళవారం రాత్రి వండర్‌లస్ట్‌ పేరిట కాలిఫోర్నియాలో అట్టహాసంగా జరిగింది. దీంట్లో ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్ల (iPhone 15 Series)తో పాటు వాచ్‌ సిరీస్‌ 9, వాచ్‌ అల్ట్రా 2లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. అంతా ఊహించినట్లుగానే ఈసారి ఫోన్లలో యాపిల్‌ కీలక మార్పులు చేసింది. గత సిరీస్‌లలో ప్రో మోడళ్లకు మాత్రమే పరిమితం చేసిన కొన్ని కీలక ఫీచర్లను ఈసారి యాపిల్‌ బేస్‌ మోడళ్లకు తీసుకురావడం విశేషం. మరి గత ఐఫోన్లతో పోలిస్తే 15 సిరీస్‌ (iPhone 15 Series)లో చేసిన ప్రధాన మార్పులేంటో చూద్దాం..

డైనమిక్‌ ఐలాండ్‌..

గత ఏడాది ఐఫోన్‌ డైనమిక్‌ ఐలాండ్‌ అనే ఫీచర్‌ను 14 ప్రో మోడల్స్‌లో మాత్రమే ఇచ్చింది. వాస్తవానికి ఇది చాలా మంది టెక్‌ ప్రియులను ఆకట్టుకున్న ఫీచర్‌. దీంతో ఈసారి 15 సిరీస్‌ (iPhone 15 Series)లో బేస్‌ మోడల్స్ అయిన ఐఫోన్‌ 15 (iPhone 15), ఐఫోన్‌ 15 ప్లస్‌ (iPhone 15 Plus)లో కూడా దీన్ని జత చేసింది. భవిష్యత్‌లో రాబోయే అన్ని ఐఫోన్లలో దీన్ని ప్రామాణికం చేయనున్నట్లు తెలుస్తోంది.

డైనమిక్‌ ఐలాండ్‌ అంటే.. ఇది ఫోన్‌ తెర పైభాగంలో ఒక పిల్‌ ఆకారంలో ఉండే కటౌట్‌. దీంట్లో కెమెరా, ఫేస్‌ ఐడీ వంటి సెన్సర్లను పొందుపరుస్తారు. అయితే, దీని వల్ల లుక్‌పరంగా డిజైన్‌ అంతగా ఆకట్టుకోదు. అందుకే యాపిల్‌ ఈ పిల్‌కు వివిధ రకాల ఫంక్షన్స్‌ను జోడించింది. అందుకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ యూఐను మార్చింది. దీంతో ఈ కటౌట్‌ కేవలం స్క్రీన్‌పై ఒక ఖాళీ స్థలంలా కాకుండా ఒక ఫీచర్‌గా పనిచేస్తోంది. ఇన్‌కమింగ్‌ కాల్స్‌, నోటిఫికేషన్లు, మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌ వంటి ఫంక్షన్లను ఇక్కడి నుంచే నియంత్రించేలా ఇది ఉపయోగపడుతుంది.

యూఎస్‌బీ టైప్‌-సి (USB- C)..

2012 నుంచి యాపిల్‌ తమ ఉత్పత్తులకు లైటెనింగ్‌ పోర్ట్‌తో ప్రత్యేక ఛార్జింగ్‌ బ్రిక్‌, కేబుల్‌ను ఇస్తూ వస్తోంది. కానీ, ఈసారి ఐరోపా సమాఖ్య నిబంధనలకు అనుగుణంగా యూఎస్‌బీ- సి పోర్ట్‌ను ఇచ్చింది. ఇకపై ఐఫోన్‌లో చార్జింగ్‌ అయిపోతే... పక్కవాళ్ల దగ్గరి నుంచి యూఎస్‌బీ-సి పోర్ట్‌ చార్జర్‌ తీసుకొని వాడుకోవచ్చు. దాదాపు ఇప్పుడు ఇతర ఎలక్ట్రానిక్స్‌ గ్యాడ్జెట్స్‌ అన్నింటికీ టైప్‌-సి పోర్టునే ఇస్తున్న విషయం తెలిసిందే.

ఐఫోన్‌ 15 వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే..

కొత్తగా యాక్షన్‌ బటన్‌ (Action Button)..

గతంలో ఫోన్‌కి పక్కభాగంలో వాల్యూమ్‌ రాకర్‌పైన మ్యూట్‌ లేదా వైబ్రేట్‌ బటన్‌ను ఇచ్చేవారు. ఐఫోన్‌ 15 ప్రో మోడల్స్‌ (iPhone 15 pro)లో దాన్ని యాక్షన్‌ బటన్‌తో రీప్లేస్‌ చేశారు. కెమెరాను యాక్టివేట్‌ చేయడం, ఫ్లాష్‌లైట్‌ ఆన్‌ చేయడం, వాయిస్‌ మెమో, నోట్‌ను ప్రారంభించడం, ఫోకస్‌ మోడ్‌లను మార్చడం వంటి ఫంక్షన్లను ఈ బటన్‌ ద్వారా చేయొచ్చు. గతంలో మాదిరిగా రింగ్‌, వైబ్రేట్‌ ఆప్షన్స్‌ను కూడా ఈ బటన్‌ ద్వారా మార్చుకునేందుకు వీలుంటుంది. పైగా మనం ప్రత్యేకంగా కొన్ని ఫంక్షన్లను కూడా ఈ బటన్‌కు అసైన్‌ చేసుకునే వీలుంటుంది.

కెమెరా అప్‌గ్రేడ్‌..

కెమెరా విషయంలోనూ ఐఫోన్‌ 15 బేస్‌ మోడల్స్‌ను గత సిరీస్‌లతో పోలిస్తే ప్రత్యేకంగా నిలిపారు. ఇప్పటి వరకు 12MP మెయిన్‌ సెన్సర్‌ కెమెరాను ఇస్తూ వచ్చారు. ఈసారి ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌లో 48MP కెమెరాను ఇవ్వడం విశేషం.

పవర్‌ఫుల్‌ ప్రాసెసర్‌..

ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌ మోడల్స్‌లో ఏ16 బయోనిక్‌ ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఇది కొత్తదేమీ కాకపోయినప్పటికీ.. గతంలో దీన్ని ప్రో మోడల్స్‌కు మాత్రమే పరిమితం చేశారు. ఈసారి 15 సిరీస్‌లోని ప్రో మోడల్స్‌కు ఏ17 ప్రాసెసర్‌ను రిజర్వ్‌ చేశారు. ఐఫోన్‌ 14 బేస్‌ మోడల్స్‌తో పోలిస్తే ఐఫోన్‌ 15 బేస్‌ మోడల్స్‌ 7 రెట్లు వేగంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఫ్రాస్టెడ్‌ గ్లాస్‌ బ్యాక్‌ ప్యానెల్‌

గతంలో ప్రో మోడల్స్‌కు మాత్రమే పరిమితమైన ఫ్రాస్టెడ్‌ గ్లాస్‌ బ్యాక్‌ ప్యానెల్‌ను ఈసారి ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌లోనూ ఇస్తున్నారు. దీంతో ఫింగర్‌ప్రింట్లు సహా ఇతరత్రా మరకల నుంచి కెమెరా లెన్సెస్‌ను దూరంగా ఉంచొచ్చు. పైగా లుక్‌ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది.

టైటానియం డిజైన్‌..

ఐఫోన్‌ 15లో ప్రో (iPhone 15 pro) మోడల్స్‌ను టైటానియం డిజైన్‌తో తీసుకొచ్చారు. దీనివల్ల ఫోన్‌ బరువు చాలా వరకు తగ్గుతుంది.

ఎప్పటి నుంచి అందుబాటులోకి...

భారత్‌లో ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్లు సెప్టెంబరు 15 నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 22 నుంచి ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని యాపిల్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. 

భారత్‌లో ధరలు (iPhone 15 Series Indian Prices)..

  • ఐఫోన్‌ 15- రూ.79,900
  • ఐఫోన్‌ 15 ప్లస్‌- రూ.89,900
  • ఐఫోన్‌ 15 ప్రో- రూ.1,34,900
  • ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌- రూ.1,59,900
  • యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9- రూ.41,900
  • యాపిల్‌ వాచ్‌ అల్ట్రా 2- రూ.89,900

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని