iOS 17.2: 3డీ వీడియో షూట్‌.. జర్నల్‌ యాప్‌తో iOS కొత్త అప్‌డేట్‌

iOS 17.2: ఐఫోన్‌ యూజర్ల కోసం యాపిల్‌ మరో కొత్త iOS అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఎప్పటిలా సెక్యూరిటీ ప్యాచ్‌లు, బగ్‌ ఫిక్స్‌లతో పాటు కొత్త ఫీచర్లను జత చేసింది.

Updated : 12 Dec 2023 13:36 IST

iOS 17.2 | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐఓఎస్‌ 17.1.2ను అప్‌డేట్‌ చేసుకొని కనీసం రెండు వారాలు గడవలేదు. అప్పుడే యాపిల్‌ (Apple) iOS 17.2ను విడుదల చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా దీన్ని తీసుకురావడం గమనార్హం. అయితే, ఈ అప్‌డేట్‌ మాత్రం సర్‌ప్రైజ్‌ ఏమీ కాదు. గత కొన్ని రోజులుగా బీటా రిలీజ్‌లు వస్తూనే ఉన్నాయి. కానీ, అనుకున్న దాని కంటే ముందు తీసుకురావడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఏయే ఫోన్లకు..

సెప్టెంబర్‌లో ఐఓఎస్‌ 17 అప్‌డేట్‌ విడుదలైంది. దీని తరహాలోనే తాజాగా తీసుకొచ్చిన iOS 17.2 సైతం 2018, ఆ తర్వాత విడుదలైన ఐఫోన్లన్నింటికీ (Iphone) వర్తిస్తుంది. అంటే ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌, ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 15 సిరీస్‌లన్నింటిలోనూ కొత్త అప్‌డేట్‌ పనిచేస్తుంది. ఐఫోన్‌ ఎస్‌ఈ సెకండ్‌, థర్డ్‌ జనరేషన్‌ మోడల్స్‌లోనూ iOS 17.2ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

ఎలా చేసుకోవాలి..

ఐఫోన్‌ సెట్టింగ్స్‌ యాప్‌లోకి వెళ్లి జనరల్‌పై క్లిక్‌ చేయాలి. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను ఎంచుకోవాలి. ఆటోమేటిక్‌ అప్‌డేట్స్‌ను ఆన్‌ చేస్తే కొత్త అప్‌డేట్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. పూర్తయిన తర్వాత ఇన్‌స్టాల్‌పై క్లిక్‌ చేస్తే మీ ఐఫోన్‌ కొత్త ఓఎస్‌తో సిద్ధమైపోతుంది.

యూట్యూబ్‌లో ఇక కామెంట్లను పాజ్‌ చేయొచ్చు!

కీలక మార్పులివే..

బగ్‌ ఫిక్స్‌లు, సెక్యూరిటీ ప్యాచ్‌లతో వచ్చిన గత కొన్ని అప్‌డేట్లతో పోలిస్తే iOS 17.2లో కొత్త ఫీచర్లు చాలా ఉన్నాయి.

  • కొత్త అప్‌డేట్లలో జర్నల్‌ యాప్‌ చెప్పుకోదగినది. ఎప్పటికప్పుడు మీకు నచ్చిన నోట్స్‌ను రాసుకొనేలా.. పైగా కేవలం యూజర్లకు మాత్రమే కనిపించేలా దీన్ని రూపొందించారు.
  • మరో ఆసక్తికరమైన ఫీచర్‌ స్పేషియల్‌ వీడియో షూటింగ్‌. ఈ ఫీచర్‌ను ఉపయోగించి షూట్‌ చేసిన వీడియోలను ‘3డీ’లో చూడొచ్చు. ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌లో మాత్రమే ఇది పనిచేస్తుంది. యాపిల్‌ తీసుకురానున్న కొత్త ప్రోడక్ట్‌ ‘విజన్‌ ప్రో హెడ్‌సెట్‌’కు అనుగుణంగా ఈ స్పేషియల్‌ వీడియో షూట్‌ ఫీచర్‌ను రూపొందించినట్లు స్పష్టమవుతోంది.
  • ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌లో ఇచ్చిన యాక్షన్‌ బటన్‌కూ కొత్త ఫీచర్‌ను జత చేశారు. ఇకపై దీన్ని ట్రాన్స్‌లేట్‌ కోసమూ వాడుకోవచ్చు. ఫలితంగా ప్రత్యేకంగా యాప్‌ తెరవకుండానే విదేశీ భాషల్లో సంభాషణలు కొనసాగించొచ్చు.
  • మెసేజెస్‌ యాప్‌లో స్టిక్కర్‌, మెమోజీ సహా కొన్ని కీలక అప్‌డేట్లను ఇచ్చారు.
  • పది రోజుల వాతావరణ పరిస్థితులు.. వర్షం వచ్చే అవకాశం ఉంటే.. ఎంత మేర కురవొచ్చు వంటి వివరాలు తెలుసుకునేలా వెదర్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేశారు.
  • వీటితో పాటు ఎయిర్‌డ్రాప్‌, యాపిల్‌ మ్యూజిక్‌, డిజిటల్‌ క్లాక్‌, కీబోర్డ్‌ వంటి వాటిలోనూ కీలక మార్పులు చేశారు. ఎప్పటిలాగే కొన్ని సెక్యూరిటీ అప్‌డేట్లను కూడా ఇచ్చారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని