Apple: యూఎస్‌బీ-సి టైప్‌ నుంచి మినహాయింపు కోరిన యాపిల్‌

యూఎస్‌బీ-సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యాపిల్‌ సంస్థ కేంద్రాన్ని కోరింది. 

Published : 07 Dec 2023 02:05 IST

దిల్లీ: ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను తగ్గించాలనే ఉద్దేశంతో దేశీయంగా తయారయ్యే ఫోన్‌, ట్యాబ్‌ మోడల్స్‌లో ఒకే విధమైన ఛార్జింగ్‌ పోర్టు ఉండేలా చూసుకోవాలని గతంలో కేంద్రం ఫోన్‌ తయారీ సంస్థలకు సూచించింది. 2025 నుంచి ఈ నిబంధనను తప్పనిసరి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం మొబైల్ తయారీ సంస్థలతో సమావేశం నిర్వహించింది. ఇందులో  కేంద్రం తన ప్రతిపాదనను మొబైల్‌ సంస్థలకు తెలియజేసింది. కేంద్రం చెప్పిన దానికి శాంసంగ్‌ (Samsung) సహా ఇతర కంపెనీలు అంగీకారం తెలుపగా.. యాపిల్‌ (Apple) మాత్రం తమకు మినహాయింపు ఇవ్వాలని కోరిందని ఐటీ మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం రాబోయే రెండేళ్లలో ఈ నిబంధన తప్పనిసరి చేస్తే.. తయారీ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని యాపిల్‌ భావిస్తోంది. అలాగే, ఇది ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహాకాలపై (PIL) ప్రభావం చూపుతుందని, దీంతో సంస్థ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేదని తెలిపింది. అందుకే తమకు యూఎస్‌బీ-సి పోర్ట్‌ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది. ఈ ఏడాది యాపిల్‌ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసిన ఐఫోన్ 15లో యూఎస్‌బీ-సి ఛార్జింగ్ పోర్ట్‌ను ఇచ్చింది. ఐరోపా సమాఖ్య నిబంధలనకు అనుగుణంగా యూనివర్శల్ ఛార్జింగ్‌ పోర్ట్ ఉండాలని ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఐఫోన్‌ 15 మోడల్స్‌లో యూఎస్‌బీ-సి పోర్ట్‌ను యాపిల్‌ సంస్థ పరిచయం చేసింది. కానీ, అంతకుముందు తయారైన ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 13, ఐఫోన్ ఎస్‌ఈ వంటి మోడల్స్‌లో ఇప్పటికీ.. పాత లైటెనింగ్ పోర్ట్‌నే ఇస్తోంది.

జనవరి 1 నుంచి సిమ్‌ కార్డుల జారీకి కొత్త రూల్‌

ఈ నేపథ్యంలో పాత ఫోన్లలో యూఎస్‌బీ-సి పోర్ట్‌ ఇవ్వాలంటే ఉత్పత్తి పరంగా కంపెనీ పెద్ద ఎత్తున మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇది ఆర్థికంగా కంపెనీకి భారం అవుతుంది. మరోవైపు భారత్‌ సహా కొన్ని ఆసియా దేశాల్లో ఐఫోన్ కొత్త మోడల్‌ విడుదలైనప్పుడు పాత వాటిపై ఈ-కామర్స్‌ సహా కొన్ని రిటైల్‌ అవుట్‌లెట్లు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. దీంతో పాత మోడల్స్‌ను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలో పాత వాటికి యూఎస్‌బీ-సి పోర్టు ఇవ్వడం కష్టమవుతుందని యాపిల్‌ తెలిపింది. అందువల్లే పాత మోడల్స్‌కు యూఎస్‌బీ-సి పోర్ట్ ఇవ్వడం నుంచి తమను మినహాయించాలని యాపిల్ కోరుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని