Netflix పాస్‌వర్డ్‌ షేర్‌ చేస్తున్నారా? అయితే మీకో బ్యాడ్‌ న్యూస్‌!

Netflix Password Sharing: ఇకపై ఫ్రెండ్స్‌తో పాస్‌వర్డ్‌ షేర్‌ చేసుకోవడం కుదరదని నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే ఆ అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.

Published : 24 May 2023 11:37 IST

Netflix Password Sharing | ఇంటర్నెట్‌ డెస్క్‌: పాస్‌వర్డ్ షేరింగ్‌పై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం సమీప కుటుంబ సభ్యులతో మాత్రమే పాస్‌వర్డ్‌ను పంచుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. అలా కాకుండా ఇతరులతో పాస్‌వర్డ్‌ షేర్‌ చేసుకుంటే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన భారత్‌లో ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

ఇప్పటికే ఈ విధానాన్ని కొన్ని ఎంపిక చేసిన మార్కెట్లలో ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) తెలిపింది. అది సత్ఫలితాలివ్వడంతో తాజాగా అమెరికా సహా మొత్తం వందకు పైగా దేశాల్లో అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి నెట్‌ఫ్లిక్స్‌ మొదటి నుంచి పాస్‌వర్డ్‌ షేరింగ్‌కు వ్యతిరేకం కాదు. 2017లో స్వయంగా కంపెనీయే పాస్‌వర్డ్‌ను ఇతరులతో పంచుకోవాలని ప్రచారం చేసింది. ‘లవ్‌ ఈజ్‌ షేరింగ్ పాస్‌వర్డ్‌’ అని ప్రచారం కూడా నిర్వహించింది. నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడంలో భాగంగా నెట్‌ఫ్లిక్స్‌ ఈ వ్యూహాన్ని అనుసరించింది.

కానీ, కరోనా సంక్షోభం సద్దుమణిగిన తర్వాత పరిస్థితులు మారాయి. కొత్త యూజర్లలో వృద్ధి నెమ్మదించగా.. ఉన్న యూజర్లు కూడా ఇతర ఓటీటీలవైపు చూస్తున్నారు. నెట్‌వర్క్‌ను మరింత విస్తరించుకునేందుకు ఉన్న అవకాశాలు సన్నగిల్లినట్లు నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) పసిగట్టింది! ఈ క్రమంలో కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే పాస్‌వర్డ్‌ షేరింగ్‌కు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది.

పాస్‌వర్డ్‌ షేరింగ్‌కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) తమ యూజర్లకు ఈ-మెయిళ్లు పంపుతోంది. ఇంట్లోవారు కాకుండా బయటి వాళ్లను చేర్చుకోవాలంటే ఇకపై అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అమెరికాలో ఈ ఫీజును నెలకు 7.99 డాలర్లుగా నిర్ణయించింది. యూకేలో 4.99 యూరోలుగా తెలిపింది.

ఎలా పనిచేస్తుంది..

అదనపు సభ్యులకు కూడా ప్రత్యేకంగా పాస్‌వర్డ్‌, ప్రొఫైల్‌ ఉంటుంది. వారిని ఎవరైతే ఇన్వైట్‌ చేస్తారో వాళ్లే ఫీజు చెల్లించాలి. అదనంగా వచ్చిన వారికి కూడా ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. పైగా ప్రధాన యూజర్‌కు ఏ దేశంలోనైతే ఖాతా ఉందో.. అదనపు సభ్యుడికి కూడా అక్కడే ఖాతా యాక్టివేట్‌ అయి ఉండాలి. ఒకసారి ఒక డివైజ్‌లో మాత్రమే కంటెంట్‌ను వీక్షించడం, డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. అదనపు ప్రొఫైల్స్‌, కిడ్స్‌ ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేసుకునే అవకాశం ఉండదు.

ఎలా తెలుస్తుంది?

అసలు పాస్‌వర్డ్‌ కుటుంబ సభ్యులతోనే షేర్‌ చేస్తున్నామా? లేక ఇతరులతో కూడా పంచుకుంటున్నామా? అనే విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ఎలా నిర్ధారిస్తుందని చాలా మందికి సందేహం కలుగుతోంది. ఐపీ అడ్రస్‌లు, డివైజ్‌ ఐడీలు, అకౌంట్‌ యాక్టివిటీ ఆధారంగా దీన్ని నిర్ధారిస్తామని కంపెనీ తెలిపింది. అయితే, యూజర్ల జీపీఎస్‌ డేటాను మాత్రం సేకరించబోమని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని