Green Economy: 36 కోట్ల పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు.. స్వస్తి పలకడం సాధ్యమే!

36 కోట్ల పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల నుంచి దేశానికి విముక్తి కలిగించాలని కోరుకుంటున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు.

Updated : 01 Apr 2024 16:42 IST

నాగ్‌పుర్‌: భారత్‌ను ‘గ్రీన్‌ ఎకానమీ’ (Green Economy)గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా హైబ్రిడ్‌ వాహనాలపై జీఎస్టీ (GST) తగ్గించడంతోపాటు 36 కోట్ల పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల నుంచి దేశానికి విముక్తి కలిగించాలని కోరుకుంటున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలను వదిలించుకోవడం సాధ్యమేనా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘100 శాతం సాధ్యమే’ అని ధీమా వ్యక్తం చేశారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి ఈ విధంగా మాట్లాడారు.

ఇంధన దిగుమతికి ముగింపు..

‘ఇంధనం దిగుమతికి భారత్‌ రూ.16 లక్షల కోట్లు ఖర్చు పెడుతోంది. ఈ డబ్బును రైతుల జీవితాలను మెరుగుపరిచేందుకు ఉపయోగించుకోవచ్చు. తద్వారా గ్రామాలు వృద్ధి చెందడంతోపాటు యువతకు ఉపాధి కూడా లభిస్తుంది. హైబ్రిడ్‌ వాహనాలపై జీఎస్టీని ఐదు శాతానికి, ఫ్లెక్స్‌ ఇంజిన్లపై 12 శాతానికి తగ్గించే ప్రతిపాదనను ఆర్థికశాఖ ఆమోదం కోసం పంపించాం. ప్రస్తుతం అది పరిశీలనలో ఉంది’ అని గడ్కరీ తెలిపారు. జీవ ఇంధనం వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఇంధన దిగుమతికి ముగింపు పలకవచ్చని దృఢంగా విశ్వసిస్తున్నానని అన్నారు.

కొత్త ఆదాయపు పన్ను విధానంపై తప్పుడు సమాచారం.. కేంద్రం క్లారిటీ!

ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం 2004 నుంచి ప్రయత్నాలు చేస్తున్నానని, ఐదారేళ్లలో పరిస్థితులు మారతాయని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది కష్టమే కానీ, అసాధ్యం కాదన్నారు. ఇదే తన దార్శనికత అని చెప్పారు. ఈ లక్ష్యాన్ని చేరేందుకు ఎంతకాలం పడుతుందనే విషయంపై స్పష్టత లేనప్పటికీ.. ప్రస్తుతం విద్యుత్‌ వాహనాలు మార్కెట్‌లోకి వస్తున్న తీరును చూస్తే భవిష్యత్తు కాలం జీవ ఇంధనానిదేనని తెలిపారు.

హైడ్రోజన్‌ కారులో తిరుగుతున్నా..

‘హైడ్రోజన్‌తో నడిచే కారులో తిరుగుతున్నాను. చాలా మంది ఇళ్లలోనూ ఎలక్ట్రిక్‌ కార్లు చూస్తున్నాం. గతంలో ఇది అసాధ్యమని చెప్పినవాళ్లే.. ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. 20 ఏళ్లుగా నేను చెబుతున్న మాటలను నమ్మడం మొదలుపెట్టారు. టాటా, అశోక్‌ లేలాండ్‌లు కూడా హైడ్రోజన్‌తో నడిచే ట్రక్కులను ప్రవేశపెట్టాయి. ఎల్‌ఎన్‌జీ/సీఎన్‌జీతో నడిచే ట్రక్కులూ ఉన్నాయి. దేశంలో 350 బయో-సీఎన్‌జీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. రానున్న రోజుల్లో భారీ మార్పు వస్తుంది. బజాజ్‌, టీవీఎస్‌, హీరో వంటి సంస్థలు ఫ్లెక్స్‌ ఇంజిన్లతో కూడిన బైకులు తయారు చేసేందుకు యత్నిస్తున్నాయి. ఆటోరిక్షాలు ఇదే తరహా సాంకేతికతతో రానున్నాయి’ అని  నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో దేశంలో ఇంధన దిగుమతికి తెరపడుతుందని.. స్వావలంబన దేశంగా మారుతుందనే విశ్వాసం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని