Google Pay: ఈ యాప్స్‌ వాడొద్దు.. యూజర్లకు గూగుల్‌ పే అలర్ట్‌

సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో గూగుల్‌ పే యాప్‌ యూజర్లకు కీలక సూచన చేసింది. 

Updated : 22 Nov 2023 16:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో డిజిటల్‌ పేమెంట్స్ కోసం అధికంగా ఉపయోగించే యూపీఐ యాప్‌లలో గూగుల్ పే (Google Pay) కూడా ఒకటి. ఈ నేపథ్యంలో యాప్‌ యూజర్లకు గూగుల్‌ (Google) కీలక సూచన చేసింది. గూగుల్‌ పే ద్వారా లావాదేవీలు చేసే సమయంలో ఫోన్‌లో స్క్రీన్‌ షేరింగ్‌ యాప్‌ (Screen Sharing Apps)లను ఉపయోగించవద్దని, వాటిని ఓపెన్ చేసి ఉంచొద్దని సూచించింది. ఈ యాప్‌ల ద్వారా సైబర్‌ నేరగాళ్లు యూజర్ల మొబైల్‌లోని గూగుల్ పే యాప్‌ నుంచి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నట్లు గుర్తించి ఈ సూచన చేసింది.

‘‘యూజర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా.. మోసపూరిత లావాదేవీలు జరగకుండా అడ్డుకునేందుకు కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతను ఉపయోగిస్తున్నాం. గూగుల్‌ యాప్‌ ద్వారా జరిగే సైబర్‌ నేరాల కట్టడికి మా వంతు కృషి చేస్తున్నాం. యూజర్లు కూడా తమ వంతుగా కొన్ని సూచనలు పాటించాలి. యాప్‌ ద్వారా చెల్లింపులు చేసేప్పుడు ఫోన్‌లో ఉన్న స్క్రీన్‌ షేరింగ్ యాప్‌లను ఉపయోగించవద్దు. థర్డ్‌పార్టీ యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేసుకోమని గూగుల్ పే యూజర్లను కోరదు. ఒకవేళ ఎవరైనా గూగుల్ పే ప్రతినిధిగా చెబుతూ.. థర్డ్‌పార్టీ యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోమని సూచించినా.. వాటిని నమ్మొద్దు. దీనిపై వెంటనే గూగుల్‌ పేకు ఫిర్యాదు చేయాలి’’ అని గూగుల్‌ తెలిపింది.

ఓపెన్‌ఏఐలో కొత్త ట్విస్ట్‌.. సీఈఓగా తిరిగి రానున్న శామ్‌ ఆల్ట్‌మన్‌

స్క్రీన్‌ షేరింగ్ యాప్‌ల ద్వారా మరో చోటు నుంచి ఇతరులు మీ డివైజ్‌ను తమ అదుపులోకి తీసుకోవచ్చు. సాధారణంగా వీటిని రిమోట్‌ వర్కింగ్‌ కోసం లేదా ఫోన్‌, కంప్యూటర్లలో ఏదైనా సమస్య ఉంటే మరో చోటు నుంచి దాన్ని సరిచేసేందుకు ఉపయోగిస్తుంటారు. ఎనీ డెస్క్‌, టీమ్‌ వ్యూయర్‌ వంటివి ఎక్కువగా ఇందుకోసం వినియోగిస్తుంటారు. ఇటీవలి కాలంలో సైబర్‌ నేరగాళ్లు స్క్రీన్‌ షేరింగ్ యాప్‌ల ద్వారా యూజర్లు ఫోన్‌ నుంచి డిజిటల్‌ లావాదేవీలు చేయడం, ఏటీఎం, డెబిట్‌కార్డు వివరాలు దొంగిలించడంతోపాటు ఓటీపీలతో బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా నేరాలపై తరచుగా ఫిర్యాదులు వస్తుండటంతో స్క్రీన్‌ షేరింగ్ యాప్‌లు వాడొద్దని గూగుల్ పే యూజర్లకు సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని