Sam Altman: ఓపెన్‌ఏఐలో కొత్త ట్విస్ట్‌.. సీఈఓగా తిరిగి రానున్న శామ్‌ ఆల్ట్‌మన్‌

Sam Altman: ఓపెన్‌ఏఐ సీఈఓగా ఉద్వాసనకు గురైన శామ్‌ ఆల్ట్‌మన్‌ తిరిగి ఆ బాధ్యతల్లోకి రానున్నారు. ఈ మేరకు ఓ ఒప్పందం కుదిరినట్లు కంపెనీ ప్రకటించింది.

Published : 22 Nov 2023 13:26 IST

Sam Altman | శాన్‌ఫ్రాన్సిస్కో: చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్‌ ఆల్ట్‌మన్‌ (Sam Altman) తొలగింపుతో ఓపెన్‌ఏఐలో నెలకొన్న నాటకీయ పరిణామాలకు తెరపడింది. ఆల్ట్‌మన్‌ తిరిగి ఓపెన్ఏఐ (OpenAI)కి రానున్నారు. సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే కంపెనీకి కొత్త బోర్డు సైతం రానున్నట్లు ఓపెన్‌ఏఐ ప్రకటించింది. ఈ మేరకు ఓ ఒప్పందం కుదిరినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఆల్ట్‌మన్‌ (Sam Altman) సైతం ఎక్స్‌ వేదికగా ధ్రువీకరించారు.

ఆల్ట్‌మన్‌ (Sam Altman) తొలగింపు తర్వాత అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఓపెన్‌ఏఐ (OpenAI)లో అతిపెద్ద వాటాదారుగా ఉన్న మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల సైతం ఆయనకు మద్దతుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే కంపెనీలో చాలా మంది ఉద్యోగులు రాజీనామా చేస్తామని హెచ్చరించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. మరోవైపు ఇన్వెస్టర్లు సైతం ఆల్ట్‌మన్‌ (Sam Altman)ను తిరిగి తీసుకురావాలని కోరినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

సేల్స్‌ఫోర్స్‌ మాజీ కో-సీఈఓ బ్రెట్‌ టేలర్‌ అధ్యతన అమెరికా మాజీ ట్రెజరీ సెక్రటరీ లారీ సమ్మర్స్‌, కోరా సీఈఓ ఆడమ్‌ డీ-ఏంజిలోతో కూడిన కొత్త బోర్డు ఏర్పాటు కానున్నట్లు ఓపెన్‌ఏఐ (OpenAI) వెల్లడించింది. తాజా నిర్ణయంపై ఆల్ట్‌మన్‌ స్పందిస్తూ.. ఓపెన్‌ఏఐ అంటే తనకెంతో ఇష్టమన్నారు. కంపెనీ లక్ష్యాన్ని, దాని కోసం శ్రమిస్తున్న బృందాన్ని నిలిపి ఉంచడం కోసమే తాను గతకొన్ని రోజులుగా నిర్ణయాలు తీసుకున్నానని తెలిపారు. ఓపెన్‌ఏఐకి తిరిగొచ్చి మైక్రోసాఫ్ట్‌తో బలమైన బంధాన్ని నెలకొల్పడానికి ఆసక్తిగా ఉన్నానని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

ఓపెన్‌ఏఐ తొలగింపు తర్వాత ఆల్ట్‌మన్‌ (Sam Altman)ను తమ కొత్త ఏఐ పరిశోధన బృందంలోకి తీసుకుంటున్నట్లు సత్య నాదెళ్ల ప్రకటించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఓపెన్‌ఏఐ (OpenAI)తో తమ బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు ఆల్ట్‌మన్‌ తిరిగి ఓపెన్‌ఏఐకి రావడాన్ని తాను స్వాగతిస్తానని నాదెళ్ల పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు.

వివిధ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ఆల్ట్‌మన్‌ (Sam Altman)ను తిరిగి తీసుకురావడానికి తొలుత ఓపెన్‌ఏఐ (OpenAI) చేసిన యత్నాలు విఫలమైన విషయం తెలిసిందే. బోర్డు తొలగింపు సహా తనపై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని ఆల్ట్‌మన్‌ షరతులు విధించినట్లు వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఆయన డిమాండ్ల మేరకు.. బోర్డు పునర్‌నిర్మాణం జరిగినట్లు తాజా పరిణామాలతో స్పష్టమైంది.

ఇది తొలి అడుగు..

ఆల్ట్‌మన్‌ పునరాగమనంపై సత్య నాదెళ్ల స్పందించారు. ఓపెన్‌ఏఐ బోర్డులో మార్పులు తమను ఉత్సాహపరిచాయన్నారు. మరింత స్థిరమైన, ప్రభావవంతమైన పాలనా విధానాలకు అవసరమైన తొలి అడుగు ఇదేనని తెలిపారు. దీనిపై ఆల్ట్‌మన్‌, బ్రాక్‌మన్‌తో చర్చించినట్లు పేర్కొన్నారు. ఓపెన్‌ఏఐ నాయకత్వంతో పాటు వారికి కంపెనీలో కీలక స్థానం ఉంటుందని తెలిపారు. తద్వారా సంస్థ లక్ష్యం నిరాటంకంగా ముందుకు సాగుతుందన్నారు. తమ భాగస్వాములు, కస్టమర్లకు విలువతో కూడిన ఏఐని అందించేందుకు ఓపెన్‌ఏఐతో మైక్రోసాఫ్ట్‌ బంధం కొనసాగుతుందని పునరుద్ఘాటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు