రాళ్లు తినండి.. పిజ్జాపై గమ్‌ వేసుకోండి.. వివాదాస్పదమైన గూగుల్‌ ఏఐ సమాధానాలు

Google: గూగుల్‌ ఏఐ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ప్రశ్నలకు తప్పుదోవ పట్టించేలా సమాధానం ఇస్తోందంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా కామెంట్లు పెడుతున్నారు.

Published : 26 May 2024 00:05 IST

Google | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ (Google) ఇటీవల అత్యంత అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ టూల్‌ ‘జెమిని (Gemini AI)’ని అందుబాటులోకి తెచ్చింది. కచ్చితత్వంతో తక్షణ సమాధానాలు ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఏఐ టూల్‌ అందించే జవాబులపై యూజర్ల నుంచి అసంతృప్తి ఎదురవుతోంది. తప్పుదోవ పట్టించే సమాధానాలు ఇస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే విచిత్రమైన సమాధానంతో మరోసారి చిక్కుల్లో పడిందీ ఏఐ టూల్‌. 

‘రోజుకు ఎన్ని రాళ్లు తినాలి’ అని ఓ యూజర్‌ అడిగిన ప్రశ్నకు జెమిని దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఆరోగ్యంగా ఉండటానికి కావల్సిన ముఖ్యమైన విటమిన్‌లు, మినరల్స్‌ రాళ్లలో ఉంటాయి. కాబట్టి రోజుకు కనీసం ఒక చిన్న రాయి తినమని సలహా ఇచ్చింది. ఓ వైద్యుడు ఆ మేరకు సలహా ఇచ్చినట్లు పేర్కొంది. పిజ్జాపై చీజ్‌ నిలవట్లేదని మరో యూజర్‌ ప్రశ్నిస్తే.. ఎంచక్కా గమ్‌ వేసుకోండంటూ ఉచిత సలహా ఇచ్చింది. అంతేకాదు.. అమెరికాకు ముస్లిం అధ్యక్షుడెవరని ప్రశ్నిస్తే.. బరాక్‌ హుస్సేన్‌ ఒబామా అంటూ కొందరు యూజర్లకు బదులిచ్చింది. ఇలా తప్పుదోవ పట్టించే సమాధానాలను ఇస్తోందంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా తమ అనుభవాల్ని పంచుకుంటున్నారు. గూగుల్‌ ఏఐ జవాబులకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఓ యూజర్‌ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

5 నిమిషాల ముందూ ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.. ఈ ఆప్షన్‌ గురించి తెలుసా?

గూగుల్‌ ఏఐ ఇస్తున్న సమాధానాలు పెద్దఎత్తున చర్చకు దారితీశాయి. దీనిపై నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ కొత్త ఫీచర్‌ తప్పుడు సమాచారాన్ని ఇస్తోందని, అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం ఆశ్రయిస్తే ప్రమాదం కలిగించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ వివాదంపై గూగుల్‌ స్పందించింది. చాలావరకు ఏఐ ప్లాట్‌ఫామ్‌లు వెబ్‌లో ఉన్న సమాచారాన్నే ఇస్తుంటాయన్నారు. పై ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చిందని తెలిపింది. ఈ ప్రశ్నలు కూడా అసాధారణంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు