Altitude: ఆన్‌లైన్‌లో ఉగ్రవాద సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు గూగుల్ కొత్త టూల్‌

చిన్న తరహా ఆన్‌లైన్‌ వేదికల ద్వారా ఉగ్రవాద సంబంధిత సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు గూగుల్‌ కొత్త టూల్‌ను పరిచయం చేసింది. 

Published : 13 Nov 2023 02:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్‌లో ఉగ్రవాద ప్రేరేపిత సమాచారం వ్యాప్తి చేయకుండా అడ్డుకునేందుకు గూగుల్ (Google) కొత్త టూల్‌ను తీసుకొచ్చింది. ఆల్టిట్యూడ్‌ (Altitude) పేరుతో గూగుల్‌ ఆధ్వర్యంలో పనిచేసే జిగ్‌సా (Jigsaw) అనే సాంకేతిక విభాగం ఈ టూల్‌ను డిజైన్‌ చేసింది. ఇది పూర్తిగా ఉచితం. ఈ టూల్‌ సాయంతో చిన్న తరహా ఆన్‌లైన్ వేదికలు (ఈ-కామర్స్‌, సాఫ్ట్‌వేర్‌, ఆన్‌లైన్ లెర్నింగ్‌, మెసేజింగ్‌ యాప్‌) ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని సులువుగా గుర్తించి తమ వెబ్‌సైట్‌ల ద్వారా వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చు. 

ఐక్యరాజ్యసమితి సాయంతో పనిచేస్తున్న ‘టెక్‌ ఎగెనెస్ట్‌ టెర్రరిజమ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఉగ్రవాదానికి సంబంధించిన సమాచారాన్ని ఈ టూల్‌ ద్వారా ఆయా సంస్థలకు అందజేస్తుంది. ఆన్‌లైన్‌లో ఉగ్రవాద సమాచార వ్యాప్తిని అడ్డుకునేందుకు 2017లో ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌, ట్విటర్‌ (ప్రస్తుతం ఎక్స్‌), యూట్యూబ్‌ సంయుక్తంగా నెలకొల్పిన సంస్థలతో కలిసి ఈ టూల్‌ పనిచేస్తుంది. ‘‘ప్రస్తుతం ఉగ్రవాద సంస్థలు తమ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు సోషల్‌ మీడియా వేదికలను ఉపయోగించడంలేదు. చిన్న తరహా ఈ-కామర్స్‌, సాఫ్ట్‌వేర్‌, ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ వెబ్‌సైట్‌లు, మెసేజింగ్ యాప్‌లు, వీడియో షేరింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నాయి. ఈ సంస్థలకు ఉగ్రవాదానికి సంబంధించిన సమాచారాన్ని గుర్తించి అడ్డుకునేందుకు ఆల్టిట్యూడ్‌ సాయపడుతుంది’’ అని జిగ్‌సా సీఈవో యాస్మిన్‌ గ్రీన్‌ తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని