AGR dues: టెల్కోలకు గుడ్‌న్యూస్‌.. ₹లక్ష కోట్ల ఊరటకు కేంద్రం యోచన!

Eenadu icon
By Business News Team Updated : 18 Jan 2025 14:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

AGR dues | ఇంటర్నెట్‌ డెస్క్: టెలికాం కంపెనీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఏజీఆర్‌ (స్థూల సర్దుబాటు ఆదాయం) బకాయిల్లో పెద్ద మొత్తంలో మాఫీ చేయాలని చూస్తోంది. తద్వారా టెలికాం కంపెనీలకు దాదాపు రూ.లక్ష కోట్ల మేర ఊరట లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో దక్కించుకున్న స్పెక్ట్రమ్‌కు గానూ బ్యాంక్‌ గ్యారెంటీలు సమర్పించాలన్న నిబంధనను ఇటీవల తొలగించిన ప్రభుత్వం.. మరోవిడత ఊరటకు సిద్ధమైనట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. తాజా నిర్ణయంతో ముఖ్యంగా వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ వంటి సంస్థలకు మేలు చేకూరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏజీఆర్‌ బకాయిలపై 2019లో టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టు బిగ్‌ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఏజీఆర్‌ విషయంలో ప్రభుత్వ నిర్వచనాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తూ తీర్పు వెలువరించడంతో ఆయా కంపెనీలపై దాదాపు రూ.1.47 లక్షల కోట్ల మేర భారం పడింది. ఇందులో దాదాపు 75 శాతం మేర వడ్డీ, పెనాల్టీ, పెనాల్టీ మీద వడ్డీనే కావడం గమనార్హం. వొడాఫోన్‌ ఐడియానే అత్యధికంగా చెల్లించాల్సిఉండగా.. ఎయిర్‌టెల్‌, టాటా టెలీ సర్వీసెస్‌ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 2025 మార్చి నాటికి వొడాఫోన్‌ ఐడియా బకాయిలు రూ.80వేల కోట్లకు, ఎయిర్‌టెల్‌ బకాయిలు రూ.42వేల కోట్లకు పెరిగే అవకాశం ఉందని టెలికాం వర్గాలు చెబుతున్నాయి.

టెలికాం కంపెనీల ప్రతినిధులతో టెలికాం విభాగం పలుమార్లు సమావేశమైంది. ఈసందర్భంగా ఆర్థికంగా తాము ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు ఆయా కంపెనీలు ప్రభుత్వం దృష్టికితెచ్చాయి. ఈనేపథ్యంలో వడ్డీపై 50శాతం, పెనాల్టీలు, పెనాల్టీలపై విధించిన వడ్డీని 100 శాతం మేర మాఫీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదన యథాతథంగా కార్యరూపం దాల్చితే దాదాపు రూ.లక్ష కోట్ల మేర టెలికాం కంపెనీలకు ఊరట లభించనుంది. ముఖ్యంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్‌ ఐడియాకు భారీ ఊరట లభించనుంది. ఈ నిర్ణయం వల్ల ఆ కంపెనీ బకాయిలు దాదాపు రూ.52 వేల కోట్ల మేర తగ్గనున్నాయి. ఎయిర్‌టెల్‌కు రూ.38వేల కోట్లు, టాటా టెలీ సర్వీసెస్‌కు రూ.14వేల కోట్ల మేర ఊరట లభించనుంది. ఈ నిర్ణయం వల్ల టెలికాం రంగంలో గుత్తాధిపత్యానికి తెరపడి.. అన్ని కంపెనీలకు సమానావకాశాలు లభిస్తాయని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags :
Published : 18 Jan 2025 13:36 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు