Honor: హానర్ వినూత్న ప్రయత్నం.. రోబోటిక్‌ కెమెరాతో కొత్త స్మార్ట్‌ఫోన్‌

Eenadu icon
By Business News Team Updated : 16 Oct 2025 17:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Honor | ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ హానర్‌ కొత్త తరహా స్మార్ట్‌ఫోన్‌ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా  ‘రోబోటిక్‌ పాప్‌-అప్‌ కెమెరా’ గల స్మార్ట్‌ఫోన్‌ను చూపిస్తూ టీజర్‌ విడుదల చేసింది. ఈ ఫోన్‌ చూడ్డానికి సాధారణ స్మార్ట్‌ఫోన్‌లా కనిపించినా.. వెనకభాగంలో అమర్చిన రోబోటిక్‌ పాప్‌-అప్‌ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను కంపెనీ విడుదల చేసింది. చాలా మంది యూజర్లు ఏఐ వీడియో అని కొట్టిపారేయగా.. హానర్‌ మాత్రం ఇది నిజమైన ఫోన్‌ అని, మరిన్ని వివరాలు వచ్చే ఏడాది జరగనున్న మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో వెల్లడిస్తామని ప్రకటించింది.

ఆసుస్‌, ఒప్పో వంటి బ్రాండ్లు ఇప్పటికే ఇటువంటి పాప్‌-అప్‌ కెమెరా రకాలతో ప్రయోగాలు చేశాయి. హానర్‌ ఇప్పుడు దాన్ని మరో స్థాయికి తీసుకెళ్తూ.. ఏఐ, రోబోటిక్స్‌ ఆధారంగా పనిచేసే కెమెరాని అభివృద్ధి చేస్తోంది. ఈ కెమెరాలు వ్యక్తుల కదలికలకు, చుట్టూ ఉన్న పరిసరాలకు ప్రతిస్పందించే విధంగా ఉండనున్నాయి. యూజర్ల భావాలను అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా మారే విధంగా ఫోన్‌ను రూపొందించడమే ఈ కొత్త కాన్సెప్ట్‌ లక్ష్యమని హానర్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతానికి ఈ ఫోన్‌ పేరును అధికారికంగా వెల్లడించలేదు.

హానర్‌ విడుదల చేసిన వీడియోను బట్టి చూస్తే.. యూజర్ వేసుకున్న డ్రెస్సులను విశ్లేషించడం, బేబీతో ఆటలాడడం వంటి సన్నివేశాలు ఉన్నాయి. అంటే ఆటోమేటిక్‌గా ఆయా దృశ్యాలను తన కెమెరాతో బంధిస్తుంది. ప్రస్తుతం యాపిల్, అమెజాన్‌ వంటి టెక్‌ దిగ్గజాలు కూడా రోబోటిక్స్‌ ఆధారిత పర్సనల్‌ డివైజ్‌లపై పరిశోధనలు చేస్తున్నాయి. యాపిల్ హోమ్‌ రోబోట్, టేబుల్‌టాప్‌ స్క్రీన్ డివైజ్‌లపై పనిచేస్తోంది. అమెజాన్‌ 2021లో విడుదల చేసి ఆస్ట్రో హోమ్‌ రోబో మార్కెట్లో విఫలమైంది. ప్రస్తుతం మొబైల్‌ కంపెనీలు వివిధ ఫీచర్లతో మొబైళ్లను తీసుకొస్తున్నాయి. మరింత కొత్తదనం అందించేందుకు హానర్‌ వంటి కంపెనీలు ఇలా వినూత్న మార్గాన్ని అనుసరిస్తున్నాయి.


Tags :
Published : 16 Oct 2025 17:03 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని