Instagram Teen Safety Update: టీనేజర్ల భద్రతకు ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త చర్యలు.. సినిమా స్థాయిలో పరిమితులు

Eenadu icon
By Business News Team Published : 15 Oct 2025 00:06 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

Instagram Teen Safety Update | ఇంటర్నెట్ డెస్క్‌: మెటాకు చెందిన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) టీనేజర్ల భద్రతను బలోపేతం చేసే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాల్లో అమలు చేసే పీజీ-13 రేటింగ్‌ మార్గదర్శకాలను ఆధారంగా చేసుకొని టీనేజ్‌ యూజర్లకు అందుబాటులో ఉండే కంటెంట్‌పై పరిమితులు విధించనుంది. 18 ఏళ్లలోపు ఉన్న యూజర్లను ఆటోమేటిక్‌గా 13+ సెట్టింగ్‌లో ఉంచుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ ప్రకటించింది. ఈ సెట్టింగ్‌ను తల్లిదండ్రుల అనుమతి లేకుండా టీనేజ్ యూజర్లు మార్చుకోలేరని తెలిపింది.

సినిమాలు, షోలు అనుసరించే పీజీ-13 రేటింగ్‌ మార్గదర్శకాల తరహాలో ఈ మార్పులు ఉంటాయని ఇన్‌స్టా తన న్యూస్‌రూమ్‌ పోస్ట్‌లో తెలిపింది. ఇందులో అతి హింసాత్మక సన్నివేశాలు, అశ్లీల కంటెంట్‌, డ్రగ్స్‌ వాడకం, అసభ్య పదజాలం వంటి అంశాలను నియంత్రించనుంది. గతేడాది నుంచి టీన్‌ అకౌంట్లపై తీసుకొస్తున్న భద్రతా చర్యల్లో ఇది అత్యంత ప్రధానమైన అప్‌డేట్‌ అని పేర్కొంది. దీని ద్వారా ఇప్పటికే ఉన్న ఆటోమేటిక్‌ ప్రొటెక్షన్‌లను బలోపేతం చేస్తూ, మరింత కఠినమైన ఫిల్టరింగ్‌ విధానాన్ని ప్రవేశపెడుతుందని ఇన్‌స్టా తెలిపింది.

తప్పు వయసు సమాచారంతో పెద్దవారిలా నటించే టీనేజర్లను గుర్తించడానికి.. ఇన్‌స్టాగ్రామ్‌ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ‘వయసు అంచనా టెక్నాలజీ’ని వినియోగిస్తోంది. అన్ని నియంత్రణలున్నప్పటికీ కొన్నిసార్లు అనుచితమైన కంటెంట్‌ కనిపించొచ్చని.. దీన్ని అధిగమించడానికి వీలైనంత త్వరగా తమ ఆల్గరిథమ్‌ను అభివృద్ధి చేస్తామని కంపెనీ తెలిపింది. టీనేజర్లకు సురక్షితమైన, వయసుకు తగిన కంటెంట్‌ అందిస్తూ.. తల్లిదండ్రులకు మరింత నియంత్రణ ఇచ్చే దిశగా తీసుకున్న ఈ నిర్ణయం కీలకమైందని కంపెనీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని