Whatsapp: వాట్సప్‌ కొత్త ఫీచర్‌.. త్వరలో టెక్ట్స్‌ రూపంలోకి వాయిస్‌ మెసేజ్‌!

Whatsapp: వాట్సప్‌ వాయిస్‌ సందేశాలను కొన్ని సందర్భాల్లో వినలేం. దీనికి పరిష్కారంగా దాన్ని టెక్ట్స్‌ రూపంలోకి మార్చుకునేలా వాట్సప్‌ కొత్త ఫీచర్‌ను సిద్ధం చేస్తోంది.

Updated : 21 Mar 2024 17:11 IST

Whatsapp | ఇంటర్నెట్‌ డెస్క్‌: స్నేహితులు, కుటుంబ సభ్యులకు సుదీర్ఘ సందేశం పంపాలనుకున్నప్పుడు వాట్సప్‌ వాయిస్‌ మెసేజ్‌ (WhatsApp voice message) ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ, దీంట్లోనూ కొన్ని పరిమితులు ఉన్నాయి. వాయిస్‌ నోట్‌ అందగానే వివిధ కారణాల వల్ల అన్ని సందర్భాల్లో దాన్ని ప్లే చేసి వినలేం. దానికి పరిష్కారంగా వాట్సప్‌ ఓ కొత్త ఫీచర్‌ను సిద్ధం చేస్తున్నట్లు వాబీటాఇన్ఫో వెల్లడించింది.

వాయిస్‌ నోట్‌ ట్రాన్‌స్క్రిప్షన్‌ పేరిట కొత్త ఫీచర్‌ను వాట్సప్‌ (WhatsApp) రూపొందిస్తోంది. దీనితో వాయిస్‌ మెసేజ్‌లను టెక్ట్స్‌ రూపంలోకి మార్చుకోవచ్చు. ఫలితంగా నోట్‌ను వినకుండానే.. మెసేజ్‌ను చదివి తిరిగి రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని వాట్సప్‌ ఇప్పటికే కొంతమంది ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో ఆండ్రాయిడ్‌ యూజర్లు కూడా పొందనున్నారు.

వాట్సప్‌ పేమెంట్స్‌ మరింత సులువుగా.. ఇక చాట్‌ లిస్ట్‌లోనే

ఈ కొత్త ఫీచర్‌ కోసం యూజర్లు అదనంగా 150ఎంబీ యాప్‌ డేటా డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వాయిస్‌ నోట్స్‌ను టెక్ట్స్‌లోకి మార్చడానికి డివైజ్‌ స్పీచ్‌ రికగ్నిషన్‌ ఫీచర్లను వాట్సప్‌ వాడుకుంటుంది. ఫలితంగా ట్రాన్‌స్క్రిప్షన్‌ డివైజ్‌లోనే జరుగుతుందని.. ప్రైవసీ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని వాబీటా తెలిపింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించేవారికి మెసేజ్‌ బబుల్స్‌లో వాయిస్‌ నోట్స్‌ టెక్ట్స్‌ రూపంలో కనిపిస్తుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్‌ త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వాట్సప్‌ స్టేటస్‌ అప్‌డేట్స్‌లో ఒక నిమిషం నిడివిగల వీడియో, పేమెంట్స్‌ను మరింత సులభం చేసేలా చాట్‌లోనే క్యూఆర్‌ కోడ్‌ ఆప్షన్‌ వంటి ఫీచర్లనూ వాట్సప్‌ అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని