Adani: కిడ్నాప్‌నకు గురై.. 26/11 దాడిలో బతికి..

Eenadu icon
By Business News Desk Updated : 22 Nov 2024 07:30 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

గౌతమ్‌ అదానీ (Gautam Adani).. 62 ఏళ్ల ఈ కుబేరుడి జీవితంలో అనూహ్య సంఘటనలు, సంక్షోభాలే కనిపిస్తాయి. కానీ సమస్యల్లో చిక్కుకున్నపుడల్లా, అనూహ్యంగా బయటపడటం ఇప్పటివరకు జరిగింది. పాఠశాల విద్యకు గుడ్‌బై చెప్పిన అదానీ దేశంలోనే అత్యంత సంపన్నుడిగా అతి తక్కువ కాలంలోనే ఎదగడం గమనార్హం. ఈనేపథ్యంలో అదానీ జీవితాన్ని గమనిస్తే..

గుజరాతీ

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక జైన్‌ కుటుంబంలో గౌతమ్‌ పుట్టారు. జౌళి వ్యాపారి శాంతీలాల్‌ అదానీ, శాంతా అదానీ దంపతుల ఎనిమిది మంది సంతానంలో ఏడో వ్యక్తి అదానీ. పాఠశాల విద్య కూడా పూర్తిచేయని ఈయన 16 ఏళ్ల వయసులో ముంబయికి వెళ్లారు. ఒక రత్నాల వ్యాపారి దగ్గర వజ్రాల సార్టర్‌గా పనిచేశారు. 1981లో మళ్లీ గుజరాత్‌కు వచ్చి తన సోదరుడు మహాసుఖ్‌భాయ్‌తో ఒక చిన్న పీవీసీ ఫిల్మ్‌ ప్యాక్టరీ నడిపారు. అదానీ ఎక్స్‌పోర్ట్స్‌ పేరిట 1988లో ఒక కమొడిటీ ట్రేడింగ్‌ సంస్థను ఏర్పాటు చేసిన అదానీ దానిని 1994లో స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేశారు. అదే ఇప్పటి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌.

గన్‌పాయింట్‌తో కిడ్నాప్‌

1990 మధ్య కల్లా ఆయన వ్యాపార విజయాలు ప్రారంభమయ్యాయి. 1998జనవరి1న అదానీ, ఆయన భాగస్వామి శాంతీలాల్‌ పటేల్‌కు గన్‌ చూపించి కొందరు కిడ్నాప్‌ చేశారు. ఒక రోజు తర్వాత వారిని విడిచేశారు. అప్పట్లోనే 1.5-2 మి. డాలర్లను అడిగారని అంటారు. ఆ మొత్తం ఇచ్చారా లేదా అన్నది తెలియదు. ఆ కిడ్నాప్‌ను కూడా గ్యాంగ్‌స్టర్లు ఫజ్లు రెహమాన్, భోగిలాల్‌ దర్జీ అలియాస్‌ మామా చేశారంటారు కానీ ఆధారాలైతే లేవు.

తాజ్‌ హోటల్‌పై దాడిలో..

2008 నవంబరు 26న ముంబయిలోని తాజ్‌ హోటల్‌లో దుబాయ్‌ పోర్ట్‌ సీఈఓ మహమ్మద్‌ షరాఫ్‌తో అదానీ భోజనం చేస్తున్నారు. తిన్న తర్వాత డబ్బులూ కట్టేశారు. బయటకు వెళ్లడమే తరువాయి అన్న సమయంలో మరోసారి కాఫీ కోసం కొంత మంది భాగస్వాములు పిలిచారు. అపుడే టెర్రరిస్టుల దాడి జరిగింది. అదానీ, ఇతర అతిథులను.. హోటల్‌లోని కిచెన్‌కు, తర్వాత బేస్‌బెంట్‌కు హోటల్‌ సిబ్బంది తరలించారు. రాత్రంతా అక్కడే ఉన్నారు. మరుసటిరోజు ఉదయం కమాండోలు ఆయన్ని రక్షించారు. ఒక వేళ డబ్బులు కట్టి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించి ఉంటే, కచ్చితంగా ఆ రోజు దాడిలో మరణించి ఉండేవాడినని ఒక సమయంలో అదానీ అన్నారు. ప్రైవేటు జెట్‌లో నవంబరు 27న అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరిన అనంతరం ‘15 అడుగుల దూరంలో మృత్యువును చూశాను’ అని వ్యాఖ్యానించారు.  

వ్యాపారంలో..

1988లో కమొడిటీస్‌ ట్రేడర్‌గా మొదలైన అదానీ వ్యాపార ప్రస్థానం.. దశాబ్దం తర్వాత గుజరాత్‌లోని ముంద్రా పోర్టును నిర్వహించే స్థాయికి చేరింది. భారత్‌లోనే అతిపెద్ద పోర్టు ఆపరేటరుగా తన సామ్రాజ్యాన్ని విస్తరించిన తర్వాత అదానీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అత్యంత వేగంగా విద్యుదుత్పత్తి, గనులు, వంట నూనెలు, గ్యాస్‌ పంపిణీ, పునరుత్పాదక ఇంధనం ఇలా.. పలు రంగాల్లో విస్తరించారు. ఆ సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు. విమానాశ్రయాలు, సిమెంటు, తాజాగా మీడియా వ్యాపారంలోకి అదానీ అడుగుపెట్టిన సమయంలో, మోదీ ప్రధానిగా ఉన్నారు. అయితే మోదీ నుంచి ముఖ్యమంత్రిగా లేదా ప్రధాన మంత్రి హోదాలో ఎటువంటి సహాయం పొందలేదని అదానీ తరచూ చెప్పుకుంటూ ఉంటారు. రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీని అధిగమించి భారత్‌లోనే అత్యంత ధనవంతుడిగా అదానీ మారారు. ఒక దశలో టెస్లా సీఈఓ మస్క్‌ను దాటి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మారినా.. ప్రస్తుతం 57.6 బి. డాలర్ల నికర విలువతో ప్రపంచంలో 25వ స్థానంలో అదానీ ఉన్నారు. 

వివాదాలు..సవాళ్లు..

ఆస్ట్రేలియాలోని కార్మిఖేల్‌ బొగ్గు ప్రాజెక్టు కర్బన ఉద్గారాలపై ఇప్పటికీ ప్రతికూల స్వరాలు వినిపిస్తుంటాయి. పర్యావరణవేత్తలు, నియంత్రణ సంస్థల నుంచి 10 ఏళ్ల పాటు నిరసనలు ఎదుర్కొని 2019లో గనిని సొంతం చేసుకున్నారు. ఇటీవల కేరళలోని విజింజామ్‌ పోర్ట్‌లో 900 మి. డాలర్ల కంటైనర్‌ ట్రాన్సిప్‌మెంట్‌ ప్రాజెక్టుకూ స్థానిక మత్స్యకార్ల నుంచి 4 నెలల పాటు ఆందోళనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. గత నెలలోనే నిరసనలు ముగిశాయి.

Tags :
Published : 22 Nov 2024 06:43 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు