iPhone Price drop: తక్కువకే ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 13.. కొత్త ధరలివే

iPhone Price drop: యాపిల్‌ కొత్త ఐఫోన్‌ సిరీస్‌ను విడుదల చేసిన నేపథ్యంలో పాత మోడల్స్‌లో కొన్నింటి ధరల్ని తగ్గించింది. కొత్త ధరలు ఇలా ఉన్నాయి...!

Updated : 13 Sep 2023 17:13 IST

iPhone 14 Price drop | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐఫోన్‌ 15 సిరీస్‌ (iPhone 15 Series) ఫోన్లను విడుదల చేసిన నేపథ్యంలో యాపిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర ఐఫోన్‌ సిరీస్‌ మోడళ్ల ధరలను తగ్గించింది. ఐఫోన్‌ 14 (iPhone 14), ఐఫోన్‌ 13 (iPhone 13), ఐఫోన్‌ 14 ప్లస్‌ (iPhone 14 Plus) వంటివి ధరలు తగ్గిన వాటిలో ఉన్నాయి.

ఏటా కొత్త సిరీస్‌ ఫోన్లను విడుదల చేసిన వెంటనే పాత మోడళ్ల ధరలను యాపిల్‌ తగ్గిస్తూ వస్తోంది. అదే పరంపరను కొనసాగిస్తూ.. తొలుత ఐఫోన్‌ 14 ప్లస్‌, ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 13 ధరలను కంపెనీ తాజాగా కుదించింది. ఇప్పుడు 128జీబీ బేస్‌ మోడల్‌ ఐఫోన్‌ 14 రూ.69,900లకు లభిస్తోంది. దీన్ని రూ.79,900కు గత ఏడాది యాపిల్‌ లాంచ్‌ చేసింది. మరోవైపు ఇదే మోడల్‌లో 256జీబీ, 512జీబీ వేరియంట్ల ధరలు వరుసగా రూ.79,900, రూ.99,900కు తగ్గాయి. వీటి పాత ధరలు రూ.89,000, రూ.109,900గా ఉండేవి.

టైప్‌-సి పోర్ట్‌.. యాక్షన్‌ బటన్‌.. ఐఫోన్‌ 15 సిరీస్‌లో కొత్త మార్పులివే!

మరోవైపు ఐఫోన్‌ 14 ప్లస్‌, ఐఫోన్‌ 13పైన కూడా రూ.10,000 తగ్గింపు లభిస్తోంది. ఐఫోన్‌ 14 ప్లస్‌ ఇప్పుడు రూ.79,900కే పొందొచ్చు. ఐఫోన్‌ 13 రూ.59,900కు అందుబాటులో ఉంది. యాపిల్‌ వెబ్‌సైట్‌లో ప్రస్తుతం కొత్త ధరలతో ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ-కామర్స్‌ వేదికలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి వాటిలో ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

ఈ ఐఫోన్ల విక్రయాలు బంద్‌..

ఐఫోన్‌ 15 సిరీస్‌ను విడుదల చేసిన నేపథ్యంలో యాపిల్‌ కొన్ని పాత మోడల్స్‌ విక్రయాలను భారత్‌లో నిలిపివేసింది. ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 13 మినీ, ఐఫోన్‌ 14 ప్రో, ఐఫోన్‌ 14 ప్రో మ్యాక్స్‌ను తమ యాపిల్‌ ఇండియా వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. దీంతో భారత మార్కెట్‌ నుంచి వీటిని ఉపసంహరించుకున్నట్లయింది. లేటెస్ట్‌ సిరీస్‌ ఫోన్లకు గిరాకీ పెంచుకునే వ్యూహంలో భాగంగా కొన్ని పాత మోడల్స్‌ విక్రయాలను యాపిల్‌ నిలిపివేస్తుంటుంది. అలాగే పాత ప్రో మోడల్స్‌లోని ఫీచర్లు తాజా బేస్‌ మోడళ్లలో ఉండడం వల్ల కూడా కొన్నింటినీ ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని