iPhone 15: ప్రపంచంతో పాటే భారత్‌లోనూ ఐఫోన్‌ 15 అన్‌బాక్స్‌?

iPhone 15: ఐఫోన్‌ 15 సెస్టెంబర్‌ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈసారి పెద్దగా జాప్యం లేకుండానే తక్కువ రోజుల్లోనే ఈ ఫోన్‌ భారత్‌లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

Updated : 05 Sep 2023 11:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐఫోన్‌ 15 (iPhone 15) విడుదల గురించి చాలా మంది ఆసక్తిగా వేచి చూస్తున్నారు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దాదాపు నెల తర్వాత ఐఫోన్‌ భారత్‌కు వస్తుంటుంది. కానీ, ఈసారి ఆ గ్యాప్‌ను దాదాపు పూర్తిగా తగ్గించే ప్రయత్నాల్లో యాపిల్‌ ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఇదే జరిగితే.. యావత్‌ ప్రపంచంతో పాటే భారత్‌ కూడా కొత్త ఐఫోన్‌ను అన్‌బాక్స్‌ చేయనుంది!

ఐఫోన్‌ 15 (iPhone 15) తయారీ కోసం ఇప్పటికే చెన్నైలోని ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌లో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు సమాచారం. సెప్టెంబరులో తయారీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సెప్టెంబరు 12న ఫోన్‌ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాంఛ్‌ తర్వాత బహుశా కొన్ని రోజుల వ్యవధిలోనే భారత్‌లోనూ ఫోన్‌ అమ్మకానికి అందుబాటులో ఉండొచ్చు. 

భారత్‌లో రియల్‌మీ సీ51 విడుదల..రూ.9,000తో 50MP కెమెరా!

గత ఏడాది చెన్నైలోని ప్లాంట్‌లో ఐఫోన్‌ 14 తయారీ గ్లోబల్‌ లాంఛ్‌ తర్వాత పదిరోజులకు ప్రారంభమైంది. మార్కెట్‌లోకి రావడానికి దాదాపు నెల రోజులు పట్టింది. ఈసారి ఈ గ్యాప్‌ కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండేలా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా తయారు చేసిన ఫోన్లను మొదట ఇక్కడే విక్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం. తర్వాతే ఎగుమతులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలుస్తోంది. పండగల సీజన్‌ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత్‌లో డిమాండ్‌ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. డిసెంబరు తర్వాతే అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతులు ప్రారంభించొచ్చని తెలుస్తోంది.

జూన్‌లోనే ఐఫోన్‌ 15 (iPhone 15) తయారీ చైనాలోని ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌లో ప్రారంభమైనట్లు సమాచారం. భారత్‌లోని తయారీ కేంద్రాలకు సైతం అదే సమయంలో పరికరాలు సరఫరా అయినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా యాపిల్‌ ఉత్పత్తుల తయారీలో భారత్‌ వాటా 7 శాతం. కేంద్రం తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని (PLI) ఉపయోగించుకొని యాపిల్‌ ఉత్పత్తుల తయారీ కేంద్రాలు ఉత్పత్తిని పెంచాయి. భారత్‌లో ఫాక్స్‌కాన్‌, విస్త్రోన్‌, పెగాట్రాన్‌ యాపిల్‌ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. ఇవన్నీ 2023- 24 నాటికి రూ.61,000 కోట్ల విలువ చేసే ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని