చైనాలో ఐఫోన్లపై యాపిల్‌ భారీ డిస్కౌంట్స్‌.. ఏడాదిలో రెండోసారి.. ఎందుకంటే?

చైనాలో ఐఫోన్లపై యాపిల్‌ సంస్థ భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ ఏడాదిలో ఇలా డిస్కౌంట్‌ ఇవ్వడం ఇది రెండోసారి.

Published : 21 May 2024 14:52 IST

iPhone price slash | ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా యాపిల్‌ ఐఫోన్‌ కొనాలంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఆ స్థాయిలో ఉంటాయి వాటి ధరలు. ఎప్పుడో కొత్త మోడల్‌ వస్తే గానీ పాత మోడళ్ల ధరలు తగ్గవు. అందుకే ఐఫోన్‌ వాడాలనుకునేవారు ఏ ఆఫర్‌లోనో తక్కువ ధరకు వచ్చినప్పుడు వీటిని కొనుగోలు చేస్తుంటారు. అలాంటిది చైనాలో యాపిల్ ఐఫోన్ల ధరలను అమాంతం తగ్గిస్తోంది. లేటెస్ట్ మోడళ్లపైనా భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది.

అమెరికా, భారత్‌ తరహాలోనే యాపిల్‌కు చైనా అతిపెద్ద మార్కెట్‌. ప్రపంచ మార్కెట్‌లో శాంసంగ్‌ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఆ సంస్థకు చైనాలో మాత్రం హువావే సవాల్‌ విసురుతోంది. తన అమ్మకాలు పెంచుకుంటూ యాపిల్‌ మార్కెట్‌ వాటాకు గండిపెడుతోంది. ఇది యాపిల్‌ను కలవరపెడుతోంది. అందుకే విక్రయాలు పెంచుకునేందుకు తంటాలు పడుతోంది. ఇందులో భాగంగా మే 28 వరకు యాపిల్‌ తన అధికారిక స్టోర్‌లో భారీ తగ్గింపు ధరకే ఐఫోన్లను విక్రయిస్తోంది. ఐఫోన్‌ లేటెస్ట్‌ మోడల్‌ అయిన ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ 1టీబీ వెర్షన్‌పై 2300 యువాన్లు (318 డాలర్లు) మేర డిస్కౌంట్ అందిస్తోంది. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.27 వేలు అన్నమాట. ఐఫోన్‌ 15 బేస్‌ వేరియంట్‌పైనా 1400 యువాన్ల (రూ.16వేలు) మేర డిస్కౌంట్‌ అందిస్తోంది. ఈ ఏడాదిలో ఇలా ధరలు తగ్గించడం ఇది రెండోసారి.

మన సమాచారం సురక్షితమేనా?

ప్రీమియం సెగ్మెంట్‌లో యాపిల్‌కు హువావే గట్టి పోటీనిస్తోంది. ఇటీవల ఆ కంపెనీ ప్యూరా 70 సిరీస్‌, మేట్‌ 60 ఫోన్లను లాంచ్‌ చేసింది. హువావే విక్రయాల వృద్ధికి ఇవి దోహదపడుతున్నాయి. దీంతో ఇటీవల వెలువడిన తొలి త్రైమాసిక ఫలితాల్లో గతేడాదితో పోలిస్తే అమ్మకాల్లో 70 శాతం వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలో యాపిల్‌ అమ్మకాలు 19 శాతం మేర క్షీణించినట్లు కౌంటర్‌ పాయింట్ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. దీంతో 2023 తొలి త్రైమాసికంలో 20 శాతంగా ఉన్న యాపిల్‌ మార్కెట్‌ వాటా.. ఈ ఏడాది 15.7 శాతానికి పడిపోయింది. హువావే మార్కెట్‌ వాటా 9.3 శాతం నుంచి 15.5 శాతానికి పెరిగింది. హువావేతో పాటు ఇతర చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీల నుంచి కూడా యాపిల్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. ప్రపంచవ్యాప్తంగా విక్రయాల సంఖ్యపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలోనే యాపిల్ భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని