Adani-Paytm: పేటీఎంలో అదానీ వాటాల కొనుగోలు? అప్పర్‌ సర్క్యూట్‌కు స్టాక్‌

Adani-Paytm: ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న పేటీఎంలో అదానీ గ్రూప్‌ వాటాలు కొనుగోలు చేయనుందన్న వార్తల మధ్య ఫిన్‌టెక్‌ కంపెనీ షేరు బుధవారం దూసుకెళ్తోంది.

Updated : 29 May 2024 12:21 IST

Adani-Paytm | ముంబయి: ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం (Paytm) షేరు విలువ బుధవారం అనూహ్యంగా పుంజుకుంది. ఆరంభంలోనే ఐదు శాతం పెరిగి రూ.359.45 దగ్గర అప్పర్‌ సర్క్యూట్‌ని తాకింది. పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌లో దేశీయ బడా వ్యాపార సంస్థ అదానీ గ్రూప్‌ (Adani Group) వాటాలు కొనుగోలు చేయనుందన్న వార్తలే స్టాక్‌ ర్యాలీకి దోహదం చేశాయి.

పేటీఎం సీఈవో (Paytm CEO) విజయ్‌ శేఖర్‌ శర్మ శుక్రవారం అహ్మదాబాద్‌లోని గౌతమ్‌ అదానీని ఆయన కార్యాలయంలో కలిసినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ కథనం ప్రచురించింది. ఒప్పందానికి సంబంధించిన తుది నిబంధనలను ఖరారు చేసే క్రమంలో వీరిద్దరూ సమావేశమైనట్లు తెలిపింది. విజయ్‌ శేఖర్‌ మాత్రం ఆయన వాటాలను వదులుకోబోరని సమాచారం. అయితే, ఈ వార్తలను రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేటీఎం (Paytm) సహా అదానీ గ్రూప్‌ సైతం కొట్టిపారేసింది.

పెరుగుతున్న వాట్సప్‌ గ్రూపు స్కామ్స్‌..లాభాలంటూ వెళితే అంతే!

ఈ వార్తలు నిజమే అయితే.. నౌకాశ్రయాల నుంచి విమానాశ్రయాల వరకు వివిధ రంగాల్లోకి విస్తరించిన అదానీ గ్రూప్ ఫిన్‌టెక్‌ రంగంలోకీ ప్రవేశించినట్లవుతుంది. గూగూల్‌ పే, ఫోన్‌ పే, జియో ఫైనాన్సియల్‌ వంటి సంస్థలతో పోటీ పడుతుంది. వన్‌97 కమ్యూనికేషన్స్‌లో విజయ్ శేఖర్‌కు 19 శాతం వాటాలున్నాయి. దీంట్లో ఆయన నేరుగా 9 శాతం, రెసిలియెంట్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా 10 శాతం పెట్టుబడులు పెట్టారు. ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ సైఫ్‌ పార్ట్‌నర్స్‌కు 15 శాతం, ‘జాక్‌ మా’కు చెందిన యాంట్‌ఫిన్‌ నెదర్లాండ్స్‌కు 10 శాతం, కంపెనీ డైరెక్టర్లకు 9 శాతం వాటాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని