Microsoft Copilot+ PCs: రీకాల్‌, కోక్రియేట్‌ ఫీచర్లతో ఏఐ తరం కోసం మైక్రోసాఫ్ట్‌ కోపైలట్‌+ పీసీలు

Microsoft Copilot+ PCs: ఏఐ ఫీచర్లతో మైక్రోసాఫ్ట్‌ కోపైలట్‌+ పేరిట కొత్త పీసీలను విడుదల చేసింది. వీటిలో రీకాల్‌, కోక్రియేట్‌ వంటి అత్యాధునిక ఏఐ ఫీచర్లు ఉన్నాయి.

Updated : 21 May 2024 18:02 IST

Microsoft Copilot+ PCs | ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేధ ఫీచర్లకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ కొత్త తరం పర్సనల్‌ కంప్యూటర్లను ఆవిష్కరించింది. కోపైలట్‌+ పీసీల (Microsoft Copilot+ PCs) పేరిట వీటిని తీసుకొచ్చింది. ఇప్పటివరకు వచ్చిన పీసీల్లో ఇవే అత్యంత శక్తిమంతమైన, వేగవంతమైనవని కంపెనీ పేర్కొంది.

కోపైలట్‌+ పీసీలను (Copilot+ PCs) స్నాప్‌డ్రాగన్‌ ఎక్స్‌ సిరీస్‌ ప్రాసెసర్లతో రూపొందించారు. సెకనుకు 40 ట్రిలియన్ల ఆపరేషన్లు పూర్తి చేస్తాయి. వీడియో ఎడిటింగ్‌, క్లిష్టమైన డేటా అనాలసిస్‌, బహుళ ప్రోగ్రామ్‌లను రన్‌ చేయడం వంటి పనుల్లో వేగంగా స్పందిస్తాయి. దీర్ఘకాల లక్ష్యమైన ఏఐ పీసీల అభివృద్ధిలో భాగంగా మైక్రోసాఫ్ట్‌ వీటిని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ల పూర్తి సామర్థ్యాన్ని వాడుకోవాలంటే సపోర్ట్‌ చేసే హార్డ్‌వేర్‌ ఉండాలి. ఏసర్‌, ఆసుస్‌, డెల్, హెచ్‌పీ, లెనొవొ, శామ్‌సంగ్‌ వంటి కంపెనీలు మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపాయి. ఈ కంపెనీలన్నీ జూన్‌ 18 నుంచి కోపైలట్‌+ పీసీలను తీసుకురానున్నాయి. మైక్రోసాఫ్ట్‌ సైతం ఈ కేటగిరీలో సర్ఫేస్‌ పేరిట డివైజ్‌లను విడుదల చేయనుంది.

మీరు డౌన్‌లోడ్‌ చేసే యాప్స్‌ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..

కోపైలట్‌+ పీసీల్లో (Microsoft Copilot+ PCs) రీకాల్‌ అనే ఏఐ ఫీచర్‌ ఉంటుంది. దీంతో పీసీలో ఏ సమాచారాన్నైనా వెంటనే పొందొచ్చు. ఫైల్‌, ఫోల్డర్‌, ఈమెయిల్‌ను గుర్తించడం సహా గతంలో మీరు పూర్తి చేసిన యాక్షన్‌లు, హిస్టరీని కళ్ల ముందుంచుతుంది. ఈ పీసీలు సమాచారాన్ని రిషేషన్‌షిప్‌, అసోసియేషన్స్‌ ఆధారంగా సేవ్‌ చేస్తాయి.

వీటిలో ఉన్న మరో ఏఐ ఫీచర్‌ కోక్రియేట్‌. ఇది పెయింట్‌, ఫొటోస్‌ వంటి యాప్‌లలో పనిని మెరుగుపరుస్తుంది. పెయింట్‌లో ఒక బొమ్మను గీస్తే ఏఐ కూడా దానికదే మరో దాన్ని గీసి చూపిస్తుంది. మనం దాన్ని టెక్ట్స్‌ కమాండ్‌లతో మెరుగుపర్చి వాడుకోవచ్చు. పెయింట్‌లోనూ ఫొటోలను ఏఐ టూల్స్‌ ఎడిట్‌ చేసే వెసులుబాటు ఉంటుంది. అడోబ్‌, క్యాప్‌కట్‌, డావిన్సీ రిసాల్వ్‌ స్టూడియో, సెఫబుల్‌, లిక్విడ్‌టెక్స్ట్‌ వంటి వాటితోనూ మైక్రోసాఫ్ట్‌ చేతులు కలిపింది. తద్వారా ఏఐ ఫీచర్లన్నింటినీ ఆయా యాప్‌లలో అనుసంధానం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని