విండోస్‌ 10 వాడుతున్నారా? సెక్యూరిటీ అప్‌డేట్స్‌ కావాలంటే చెల్లించాల్సిందే!

Windows 10 update: విండోస్‌ 10 వాడుతున్న వారు విండోస్‌ 11కు అప్‌గ్రేడ్‌ అవ్వాలి. లేదంటే భవిష్యత్‌లో సెక్యూరిటీ అప్‌డేట్స్‌కు డబ్బులు చెల్లించాలి.

Published : 06 Dec 2023 17:36 IST

Windows 10 | ఇంటర్నెట్‌ డెస్క్‌: విండోస్‌ 10 యూజర్లకు అలర్ట్‌. విండోస్‌ 10 (Windows) ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విషయంలో మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత యూజర్లు విండోస్‌ 11కు మారకుంటే వారి నుంచి ఇకపై కొంతమొత్తం వసూలు చేయనుంది. 2025 అక్టోబర్‌ 14 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్‌ తన బ్లాగ్‌లో పోస్ట్‌ చేసింది. మైక్రోసాఫ్ట్‌ తాజా నిర్ణయం లక్షలాది మంది యూజర్లపై ప్రభావం పడనుంది.

మైక్రోసాఫ్ట్‌ (Microsoft) విండోస్‌ 10ను ఇప్పటికీ చాలా మంది వినియోగిస్తున్నారు. వారంతా 11కు అప్‌గ్రేడ్‌ అవ్వాలని మైక్రోసాఫ్ట్‌ సూచిస్తోంది. ఒకవేళ విండోస్‌ 11కు అప్‌గ్రేడ్‌ అవ్వకపోతే సెక్యూరిటీ అప్‌డేట్స్‌ నిలిపివేస్తామంటోంది. ఏదైనా కారణం చేత విండోస్‌ 10లోనే కొనసాగాల్సి వస్తే.. ఎక్సెటెండెడ్‌ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ (ESU) ప్రోగ్రామ్‌ కింద సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఏడాదికి చొప్పున సబ్‌స్క్రిప్షన్‌ ఉంటుంది. మూడేళ్ల వరకు రెన్యువల్‌ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్‌ కింద నమోదైన డివైజ్‌లకు నెల నెలా సెక్యూరిటీ అప్‌డేట్స్‌ వస్తాయి. ఎవరైతే విండోస్‌ 10తోనే మున్ముందూ కొనసాగాలంటే సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను డబ్బులు చెల్లించాలన్నమాట. విండోస్‌ క్లౌడ్‌ సర్వీస్‌ విండోస్‌ 365ను కూడా సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

జనవరి 1 నుంచి సిమ్‌ కార్డుల జారీకి కొత్త రూల్‌

ఒకవేళ నిర్దేశిత గడువులోగా లేటెస్ట్‌ విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు అప్‌గ్రేడ్‌ అవ్వకపోతే బగ్స్‌ ఏవైనా ఉంటే మైక్రోసాఫ్ట్‌ ఇక ఫిక్స్‌ చేయదు. అలాగే ఏవైనా లోపాలుంటే సెక్యూరిటీ అప్‌డేట్స్‌ కూడా ఇవ్వదు. టైమ్‌ జోన్‌ అప్‌డేట్స్‌, ఏదైనా సమస్య తలెత్తితే టెక్నికల్‌ సపోర్ట్‌ను కూడా మైక్రోసాఫ్ట్‌ నిలిపివేయనుంది. అవన్నీ కావాలంటే వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే విండోస్‌ 11కు అప్‌గ్రేడ్‌ అవ్వాల్సిందే. ఈ ఈఎస్‌యూ ప్రోగ్రామ్‌లో కేవలం సెక్యూరిటీ అప్‌డేట్స్‌ మాత్రమే లభిస్తాయి. కొత్త ఫీచర్లు గానీ, డిజైన్‌ చేంజ్‌ రిక్వెస్టులు గానీ, నాన్‌ సెక్యూరిటీ రిక్వెస్టులు గానీ అందించడం జరగదని మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని