5G services: 738 జిల్లాల్లో.. 10 కోట్ల మంది వినియోగదారులు

దేశవ్యాప్తంగా 738 జిల్లాల్లో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చిందని.. సుమారు 10కోట్ల మంది వీటి సేవలను వినియోగించుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Published : 07 Dec 2023 02:09 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్ల మంది వినియోగదారులు 5జీ సేవలు (5G services) పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 738 జిల్లాల్లో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చిందని తెలిపింది. ప్రపంచంలో అత్యంత వేగంగా 5జీ సేవలు విస్తరిస్తోన్న దేశంగా భారత్‌ నిలుస్తోందని పేర్కొంది. మొబైల్‌ సేవలకు సంబంధించి లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది.

‘నవంబర్‌ 24, 2023 నాటికి దేశవ్యాప్తంగా 738 జిల్లాల్లో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం 3,94,289 బేస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా సుమారు 10 కోట్ల మంది 5జీ సేవలను వినియోగిస్తున్నారు’ అని కేంద్ర కమ్యూనికేషన్స్‌ సహాయ మంత్రి దేవుసింహ్ చౌహాన్‌ వెల్లడించారు. జులై-ఆగస్టు 2022లో రూ.1.5లక్షల కోట్ల స్పెక్ట్రమ్‌ వేలంతో సహా రూ.2లక్షల కోట్ల పెట్టుబడులకు టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు కట్టుబడి ఉన్నారని అన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్ల స్థూల ఆదాయం రూ.3లక్షల కోట్లు దాటిందని చెప్పారు.

Wikipedia: వికీపీడియాలో భారత్‌ హవా..!

ఇదిలాఉంటే, అక్టోబరు 1, 2022న దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జియో, భారతీ ఎయిర్‌టెల్‌ వంటి ఆపరేటర్లు దేశవ్యాప్తంగా ఈ సేవలను వేగంగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం 8-10 కోట్ల వరకు 5జీ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదార్లున్నట్లు ఎరిక్‌సన్‌ కూడా ఇటీవలే అంచనా వేసింది. అమెరికా, బ్రిటన్‌, దక్షిణ కొరియా, చైనా, తదితర దేశాల్లోని వినియోగదార్లతో పోలిస్తే భారత వినియోగదార్లు వారానికి రెండు గంటలు ఎక్కువగానే 5జీ సేవలను వినియోగించుకుంటున్నట్లు తన నివేదికలో వెల్లడించింది. మరోవైపు 2024 నాటికి దేశంలో 5జీ వినియోగదార్ల సంఖ్య 15 కోట్లకు చేరొచ్చని ఈ ఏడాది మార్చిలో నోకియా కూడా తన నివేదికలో అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని