NFC payment tag: ఫోన్‌కి అతికించండి.. ట్యాప్‌ చేయండి.. పిన్‌ లేకుండానే ఎంచక్కా పేమెంట్స్‌

NFC payment tag: పిన్‌ ఎంటర్‌ చేయకుండా, కార్డుతో పని లేకుండా పేమెంట్స్‌ చేసే సదపాయం వచ్చేసింది. ఎలా అనుకుంటున్నారా?

Published : 25 May 2024 00:03 IST

NFC payment tag | ఇంటర్నెట్‌డెస్క్‌: డిజిటల్‌ చెల్లింపుల్లో కొత్త పద్ధతులు పుట్టుకొస్తున్నాయి. ఒకప్పుడు లావాదేవీలు జరపాలంటే ఇంటర్నెట్‌ ఉంటేనే సాధ్యమయ్యేది. ఇప్పుడు యూపీఐ లైట్ ద్వారా డేటా సదుపాయం లేకున్నా పేమెంట్స్‌ చేసేస్తున్నాం. ఈ చెల్లింపులు జరపాలంటే కచ్చితంగా మొబైల్‌, దాంట్లో ఛార్జింగ్‌ ఉండాల్సిందే. అదే మొబైల్‌ డెడ్‌ అయిపోయిన సమయంలో పేమెంట్స్‌ జరపాలంటే? అలాంటి సందర్భంలోనూ చెల్లింపులు జరిపేందుకు వీలుగా NeoFinity కంపెనీ NeoZAPను తీసుకొచ్చింది. ప్రస్తుతం క్రెడిట్‌/ డెబిట్‌ కార్డుల్లో ఉన్న ట్యాప్‌ అండ్‌ పే ఫీచర్‌ తరహాలోనే ఇదీ పని చేస్తుంది.

కాంటాక్ట్‌ లెస్‌ చెల్లింపులు చేసేందుకు ఇటీవల ఫెడరల్‌ బ్యాంక్‌ (Federal Bank) ఫ్లాష్‌ పే (flash pay) పేరుతో రూపే స్మార్ట్‌ కీ చైన్‌ను తీసుకొచ్చింది. తాజాగా ఆ తరహా సేవల్నే ఒక బుల్లి డివైజ్‌తో ఇచ్చేందుకు సిద్ధమైంది నియోగ్రూప్‌. NeoZAP అనేది NFC ట్యాగ్‌. పిన్‌ లేకుండా పేమెంట్స్‌ జరిపేందుకు సాయపడుతుంది. ఇది చూడటానికి పెద్ద సైజ్‌ సిమ్‌ లాగా ఉంటుంది. దీన్ని ఫోన్‌ వెనక భాగంలో సులభంగా అతికించొచ్చు. ఎక్కడైనా పేమెంట్స్‌ చేయాలంటే ఫోన్‌ వెనక ఉన్న స్టిక్కర్‌ ట్యాప్‌ చేస్తే సరిపోతుంది. మెట్రో, బస్‌ ఛార్జీలు, పెట్రోల్‌ పంప్‌ పేమెంట్స్‌ ఇలా అన్నిరకాల చెల్లింపులను జరపొచ్చని కంపెనీ చెబుతోంది. యూపీఐ లైట్‌ మాదిరిగానే రూ.2 వేల వరకు పేమెంట్స్‌ చేయొచ్చు. యాప్‌ ద్వారా కంట్రోల్‌ చేసే సదుపాయం కూడా ఉంది.

16 నెలల్లో మూడింతలు.. ‘హిండెన్‌బర్గ్‌’ తర్వాత మళ్లీ ఆ స్థాయికి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌

సాధారణ యూపీఐ పేమెంట్స్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డు చెల్లింపుల కంటే సులభంగా ఎటువంటి అంతరాయం లేకుండా లావాదేవీలు జరపొచ్చంటూ కంపెనీ చెబుతోంది. కేవలం 480 మిల్లీసెకెన్లలో పేమెంట్స్ చేయొచ్చట. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని పేమెంట్స్‌ ఆప్షన్లలో ఇదే అత్యంత వేగవంతమైనదని కంపెనీ చెబుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ఫ్రాడ్‌ డిటెక్షన్‌ ప్రొటెక్షన్‌ సదుపాయం ఉంది. పీవీఆర్‌, గూగుల్‌, టైమ్స్‌ ప్రైమ్‌, కల్ట్‌ ఫిట్‌లతో పాటు 200 కంటే ఎక్కువ బ్రాండ్ల నుంచి ప్రత్యేకమైన రివార్డ్‌లు, డిస్కౌంట్‌లు పొందొచ్చని తెలిపింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్లో ప్రీ ఆర్డర్‌ బుకింగ్స్‌ మొదలయ్యాయి. రూ.33 చెల్లించి రిజర్వ్‌ చేసుకోవచ్చు. మొదట బుక్‌ చేసుకున్న 1,500 మంది కస్టమర్లకు రూ.499కే అందించనుంది. ఆ తర్వాత కొనుగోలు చేయాలంటే రూ.999 వెచ్చించాలని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని