Paytm Fastag: ప్రత్యామ్నాయం చూసుకోండి.. పేటీఎం ఫాస్టాగ్‌ యూజర్లకు NHAI సూచన

పీపీబీఎల్‌కు ఆర్‌బీఐ ఇచ్చిన గడువు మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో పేటీఎం ఫాస్టాగ్‌ యూజర్లకు ఎన్‌హెచ్‌ఏఐ కీలక సూచన చేసింది.

Published : 13 Mar 2024 19:10 IST

దిల్లీ: పేటీఎం ఫాస్టాగ్‌ (Paytm Fastag) యూజర్లకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) బుధవారం కీలక సూచన చేసింది. వినియోగదారులు వెంటనే ఇతర ఫాస్టాగ్‌ సంస్థ లకు మారిపోవాలని కోరింది. పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌ (PPBL)కి భారతీయ రిజర్వు బ్యాంక్‌ (RBI) ఇచ్చిన గడువు మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. దానివల్ల ప్రయాణ సమయంలో టోల్‌ప్లాజాల వద్ద ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవని తెలిపింది. 

పేటీఎంపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించడంతో గత నెలలో ఫాస్టాగ్ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ (IHMCL) తొలగించింది. ఇకపై ఐహెచ్‌ఎంసీఎల్‌ పేర్కొన్న జాబితాలో ఉన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగ్‌ కొనుగోలు చేయాలని యూజర్లకు సూచించింది. ఈ జాబితాలో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యెస్‌ బ్యాంక్‌ సహా మొత్తం 32 బ్యాంకులు ఉన్నాయి. 

పేటీఎం షేర్లను పూర్తిగా విక్రయించిన 6 మ్యూచువల్‌ ఫండ్లు!

పీపీబీఎల్‌పై ఆర్‌బీఐ విధించిన ఆంక్షలు మార్చి 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఒకసారి గడువు తేదీని పొడిగించారు. ఈసారి అలాంటి ఉద్దేశమేదీ లేదని ఇప్పటికే ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. దీంతో పీపీబీఎల్‌, పేటీఎం వాలెట్‌, క్యాష్‌బ్యాక్‌, రిఫండ్‌, డిపాజిట్‌, ఫాస్టాగ్‌ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం  చూసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ యూజర్లకు సూచించింది. 

పేటీఎం ఫాస్టాగ్‌ను ఎలా డియాక్టివేట్ చేయాలంటే?

  • పేటీఎం యాప్‌ సెర్చ్‌లో ఫాస్టాగ్‌ అని టైప్‌ చేయాలి. తర్వాత కిందకు స్క్రోల్‌ చేస్తే పీపీబీఎల్‌ సెక్షన్‌లో ‘మేనేజ్‌ ఫాస్టాగ్‌’ ఐకాన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి కిందకు స్క్రోల్‌ చేసి ‘హెల్ప్‌ అండ్ సపోర్ట్‌’ సెక్షన్‌లోకి వెళ్లాలి. అందులో ‘నీడ్‌ హెల్ప్‌’పై క్లిక్‌ చేస్తే చాట్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో ‘ఐ వాంట్‌ టు క్లోజ్‌ పేటీఎం ఫాస్టాగ్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి సూచనలు అనుసరించి డీయాక్టివేట్‌ చేయొచ్చు. 
  • మరో పద్ధతిలో పేటీఎం కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి మొబైల్‌ నంబర్‌, వాహన రిజిస్ట్రేషన్‌ నంబర్‌ లేదా ఫాస్టాగ్‌ ఐడీ నమోదు చేయాలి. తర్వాత పీపీబీఎల్‌ ప్రతినిధి మీకు ఫోన్‌ చేసి డియాక్టివేట్‌ ప్రక్రియను ఎలా చేయాలో మీకు వివరిస్తాడు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు