Nothing Phone 2: పెద్ద బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్‌తో నథింగ్ ఫోన్ 2.. ధర, ఫీచర్లివే!

నథింగ్‌ (Nothing) కంపెనీ కొత్తగా మరో ఫోన్‌ను మార్కెట్‌లోకి పరిచయం చేసింది. ఈ ఫోన్‌తోపాటు నథింగ్‌ ఇయర్‌ 2 (Nothing Ear 2) బడ్స్‌లో కొత్త కలర్‌ వేరియంట్‌ను తీసుకొచ్చింది. 

Published : 12 Jul 2023 09:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆకర్షణీయమైన డిజైన్‌, ఫీచర్లతో తొలి స్మార్ట్‌ఫోన్‌ను గత ఏడాది విడుదల చేసిన నథింగ్‌ కంపెనీ.. తాజాగా రెండో ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో పెద్ద బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్‌ ప్రాసెసర్‌ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. డిజైన్‌ పరంగా ఇందులో పెద్దగా మార్పులు చేయనప్పటికీ.. సిస్టమ్‌ యాప్‌లతోపాటు డెలివరీ యాప్‌ల స్టేటస్‌ను తెలుసుకునేందుకు వీలుగా ప్రొగ్రెస్‌ బార్‌ ఫీచర్‌ను పరిచయం చేశారు. ఇంకా, ఈ ఫోన్‌లో ఏమేం ఫీచర్లున్నాయో చూద్దాం. 

నథింగ్ 2 ఫీచర్లు

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత నథింగ్ ఓఎస్‌ 2.0తో పనిచేస్తుంది. ఇందులో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌టీపీవో ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. నథింగ్ ఫోన్ 2 క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో బ్యాటరీ ఛార్జింగ్‌ ఎంత ఉందనేది తెలుసుకునేందుకు ప్రొగ్రెస్ బార్‌ ఫీచర్‌ ఉంది. కొత్తగా ఉబెర్‌, జొమాటో వంటి థర్డ్‌ పార్టీ యాప్‌ల పికప్‌, డెలివరీలకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు ఫోన్‌లో ప్రొగ్రెస్‌ బార్‌లు ఇస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని థర్డ్‌ పార్టీలకు ఈ ఫీచర్‌ సపోర్ట్ చేస్తుందని నథింగ్ వ్యవస్థాపకుడు కార్ల్‌ పే తెలిపారు. 

ఈ ఫోన్‌లో మూడు కెమెరాలున్నాయి. వెనుక రెండు, ముందు ఒక కెమెరా అమర్చారు. వెనుక వైపు రెండు 50 ఎంపీ కెమెరాలు, ముందు భాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఇస్తున్నారు. ఇందులో మూడు హై-డెఫినిషన్‌ మైక్రోఫోన్‌లు, రెండు స్టీరియో స్పీకర్‌లున్నాయి. 4,700 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, 45 వాట్ పీపీఎస్‌ వైర్డ్‌, 15 వాట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వైర్డ్‌ ఛార్జింగ్‌లో 55 నిమిషాల్లో, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌లో 130 నిమిషాల్లో ఫోన్‌ బ్యాటరీ ఫుల్‌ ఛార్జ్‌ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఫోన్‌కు రెండు వైపులా గొరిల్లా గ్లాస్‌ ఇస్తున్నారు. 

నథింగ్ ఫోన్ 2ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు. 8జీబీ ర్యామ్‌/128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర ₹ 44,999 కాగా, 12జీబీ/256జీబీ వేరియంట్‌ ధర ₹49,999, 12జీబీ/512జీబీ వేరియంట్ ధర ₹ 54,999గా కంపెనీ నిర్ణయించింది. డార్క్‌ గ్రే, వైట్‌ రంగుల్లో లభిస్తుంది. జులై 21 నుంచి ఫ్లిప్‌కార్ట్ సహా ఎంపిక చేసిన రిటైల్‌ ఔట్‌లెట్‌లలో అమ్మకాలు ప్రారంభకానున్నాయి. ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. 

ఈ ఫోన్‌తోపాటు నంథిగ్‌ ఇయర్‌ 2 (Nothing Ear 2)లో మరో కొత్త కలర్‌ వేరియంట్‌ను పరిచయం చేసింది. కొత్తగా బ్లాక్‌ కలర్‌లో ఇయర్‌ 2 బడ్స్‌ లభిస్తాయని కంపెనీ తెలిపింది. వీటి ధర ₹ 9,999. ఇందులో నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ ఉంది. జులై 21 నుంచి కొత్త కలర్‌ వేరియంట్ ఇయర్‌ 2 బడ్స్‌ను ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేయొచ్చు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని