Sam Altman: ఓపెన్‌ఏఐ సీఈఓ కీలక ప్రకటన.. సగానికి పైగా సంపద దాతృత్వానికే

Sam Altman: తన సంపదలో పెద్ద మొత్తాన్ని ది గివింగ్ ప్లెడ్జ్‌కు ఇస్తున్నట్లు ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ ప్రకటించారు.

Published : 29 May 2024 15:44 IST

Sam Altman | ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI) సంస్థ ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ (OpenAI CEO Sam Altman) గొప్ప మనసును చాటుకున్నారు. తాజాగా బిలియనీర్ల ర్యాంక్‌ జాబితాలో చేరిన ఆయన.. తన సంపదలో పెద్ద మొత్తాన్ని సమాజానికి తిరిగి ఇస్తానని ప్రకటించారు. తన భాగస్వామి ఆలివర్‌ మల్హెరిన్‌ను (Oliver Mulherin) కలిసి ‘ది గివింగ్‌ ప్లెడ్జ్‌’ దాతృత్వ కార్యక్రమంపై సంతకం చేశారు.

‘‘నవీన సమాజ నిర్మాణానికి ఎంతోమంది కృషి చేశారు. ఈ ప్రపంచాన్ని మెరగుపరచడానికి వారు చేసిన కృషి, మేధస్సు, దాతృత్వం, అంకితభావం లేకుంటే మేం ఈ స్థాయిలో ఉండేవాళ్లం కాదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆల్ట్‌మన్‌ తెలిపారు. తమ ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతీ వ్యక్తికి ఆల్ట్‌మాన్, ముల్హెరిన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే, సమాజ పురోగతికి అవసరమయ్యే సాంకేతికతకు మద్దతిస్తూ తమ దాతృత్వాన్ని కొనసాగించడంపై దృష్టి కేంద్రీకరిస్తామని ఈ జంట తెలిపింది.

స్కామ్‌ కాల్స్‌కు 10 అంకెల పరిష్కారం

ఓపెన్‌ఏఐకు నాయకత్వం వహిస్తున్నప్పటికీ.. కంపెనీలో తనకు ఎలాంటి వాటా లేదని ఆల్ట్‌మన్‌ బహిరంగానే ప్రకటించారు. రెడ్డిట్, స్ట్రైప్ వంటి పలు టెక్ కంపెనీలలో వాటాలతో పాటు అణుశక్తి, బయోటెక్నాలజీ, రియల్ ఎస్టేట్‌లోని వెంచర్‌లతో సహా విభిన్న వ్యాపారాల్లో ఆయనకు పెట్టుబడులు ఉన్నాయి. ఇక ప్లెడ్జ్‌ విషయానికొస్తే.. బిల్ గేట్స్, మెలిందా ఫ్రెంచ్ గేట్స్, వారెన్ బఫెట్ కలిసి ‘ది గివింగ్ ప్లెడ్జ్ (THE GIVING PLEDGE)’ను స్థాపించారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నులు తమ సంపాదనలో ఎక్కువ భాగాన్ని స్వచ్ఛందసేవకు అందించేలా ఇది ప్రోత్సహిస్తుంది. అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత మెకెంజీ స్కాట్, ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్ట్ రీడ్ హాఫ్‌మన్, సేల్స్‌ఫోర్స్‌ సీఈఓ మార్క్ బెనియోఫ్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ఒరాకిల్‌ సీటీఓ లారీ ఎల్లిసన్, మెటా అధిపతి మార్క్ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిస్సిల్లా చాన్‌ సహా అనేకమంది ఇందులో భాగస్వాములయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు