Adani group: విదేశీ లంచాల చట్టం నిలిపివేత.. ట్రంప్‌ నిర్ణయం

Eenadu icon
By Business News Team Published : 11 Feb 2025 18:53 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Adani group | వాషింగ్టన్‌: భారత్‌లో సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు కాంట్రాక్టుల వ్యవహారంలో అదానీ గ్రూప్‌పై విచారణ కోసం ఉద్దేశించిన ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ చట్టం (ఎఫ్‌సీపీఏ) నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అక్కడి న్యాయ శాఖను ఆదేశించారు. ఈ మేరకు 50 ఏళ్ల నాటి చట్టం నిలుపుదల చేస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. దీంతో అదానీ గ్రూప్‌నకు తాత్కాలికంగా ఊరట లభించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత్‌లో భారీ సోలార్‌ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు అదానీ గ్రూప్‌ లంచాలు ఇవ్వజూపినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిధుల్లో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు ఉండడంతో ఇదే చట్టం కింద జో బైడెన్‌ సర్కారు విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇటీవల అధికారం చేపట్టిన ట్రంప్‌.. ఎఫ్‌సీపీఏ అమలును నిలిపివేయాలని అమెరికా అటార్నీ జనరల్‌ పామ్‌ బొండిని ట్రంప్‌ ఆదేశించారు. ఎఫ్‌సీపీఏ చట్టం మార్గదర్శకాలు, విధివిధానాలను 180 రోజుల్లోగా సమీక్షించాలని అటార్నీ జనరల్‌కు సూచించారు. 

ట్రంప్‌ ఆదేశాల నేపథ్యంలో ఈ ఆరు నెలల్లో కొత్తగా ఈ చట్టం కింద ఎలాంటి దర్యాప్తులూ చేపట్టకూడదు. అయితే, ఆరు నెలలో రివ్యూ పీరియడ్‌ తర్వాత డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ ఏ నిర్ణయం తీసుకుంటుందనే దాన్ని బట్టి అదానీ అంశం ఆధారపడి ఉంటుంది. ట్రంప్‌ తాజా నిర్ణయం నేపథ్యంలో అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ ఉదయం లాభపడ్డాయి. అయితే, స్టాక్‌ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో నష్టాల్లో ముగిశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 1.37 శాతం, అదానీ పవర్‌ 0.47 శాతం చొప్పున లాభపడ్డాయి.

అమెరికా చట్టాలు అత్యంత కఠినం.. నేర నిరూపణైతే తీవ్ర శిక్షలు 

అమెరికాలో ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ యాక్ట్‌ (ఎఫ్‌సీపీఏ), సెక్యూరిటీస్‌ అండ్‌ వైర్‌ ఫ్రాడ్, లంచం అభియోగాలతో అదానీపై కేసు నమోదైంది. ఆయా చట్టాల ప్రకారం శిక్షలు కఠినంగానే ఉంటాయి. అమెరికా కంపెనీలు, వ్యక్తులు, విదేశాల్లో అవినీతి వ్యవహారాల్లో భాగం కాకుండా చూడడమే ఎఫ్‌సీపీఏ చట్టం లక్ష్యం. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు