iPhone 15: యాపిల్‌పై శాంసంగ్‌ సెటైర్‌.. స్పైడర్‌మ్యాన్‌ లుక్‌తో నెటిజన్ల మీమ్స్‌!

లేటెస్ట్‌ ఐఫోన్‌పై ఎప్పటిలానే శాంసంగ్‌ తనదైన శైలిలో విమర్శలు చేసింది. ఇప్పటికైనా టైప్‌-సి పోర్టు తీసుకొచ్చారనే అర్థంలో సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టింది.

Published : 13 Sep 2023 15:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్‌ (Apple) కాలిఫోర్నియా వేదికగా ఐఫోన్‌ 15 (iPhone 15) సిరీస్‌ ఫోన్లను విడుదల చేసింది. మొత్తం నాలుగు ఫోన్లను తీసుకొచ్చింది. ఎప్పుడూ తీసుకొచ్చే లైటనింగ్‌ పోర్టు కాకుండా ఈయూ నిబంధనలకు అనుగుణంగా టైప్‌-సి పోర్టుతో వీటిని తీసుకురావడం గమనార్హం. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్‌ (Samsung) ‘ఎట్టకేలకు ఇదైనా మార్చారు’ అంటూ సెటైర్‌ వేసింది.

ఐఫోన్లలో (iPhone) కొత్తదనం ఉండదంటూ శాంసంగ్‌ గతంలో యాపిల్‌ను విమర్శించింది. శాంసంగ్‌ ఫోన్లలో 120X జూమ్‌ ఉందని, ఐఫోన్లలో ఇప్పట్లో ఈ సదుపాయం వచ్చే అవకాశం లేదని విమర్శలు చేసింది. యాపిల్‌ ఫోన్లలో కొత్తదనం కోసం ఏళ్ల పాటు యూజర్లు ఎదురుచూడాల్సి ఉంటుందని పేర్కొంది. తాజా ఈవెంట్ నేపథ్యంలో మరోసారి ఎట్టకేలకు కనీసం ఆ టైప్‌-సికి అయినా మారారనే అర్థం వచ్చేట్లుగా ఎక్కడా యాపిల్‌ పేరు ప్రస్తావించకుండా శాంసంగ్‌ యూఎస్‌.. ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

తక్కువకే ఐఫోన్‌ 14, ఐఫోన్‌ 13.. కొత్త ధరలివే

శాంసంగ్‌ చేసిన ట్వీట్‌ను కొందరు నెటిజన్లు సమర్థించారు. టైప్‌-సి శాంసంగ్‌ను ఎప్పుడో తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ‘ఏటా విమర్శించడమే పనా’ అంటూ మరో నెటిజన్‌ కామెంట్ పెట్టాడు. అందుకే తాను శాంసంగ్‌ ఉత్పత్తులు కొనబోననని పేర్కొన్నాడు. యాపిల్‌కు శాంసంగ్‌ అతిపెద్ద ఉపకరణాల సరఫరాదారు అని, రెండు కంపెనీలూ దీని వల్ల లాభం పొందుతున్నాయంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

మరోవైపు సాంకేతికంగా ఐఫోన్‌ 15 మోడల్స్‌లో యాపిల్‌ మార్పులు చేసినప్పటికీ.. లుక్‌ పరంగా పెద్దగా మార్పులు చేయకపోవడం పట్ల నెటిజన్లు ఎప్పటిలానే విమర్శలు గుప్పిస్తున్నారు. టైప్-సి తప్ప చెప్పుకోదగ్గ మార్పులేవీ లేవంటూ విమర్శిస్తున్నారు. దీంతో పలువురు నెటిజన్లు మీమ్స్‌తో నెట్టింట సందడి చేస్తున్నారు. పదేళ్ల క్రితం నాటి టైప్‌-సిని తీసుకురావడమే గొప్పన్నట్లు టిమ్‌ కుక్‌ ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారో చూడండి అంటూ ఓ నెటిజన్‌ వ్యంగ్యంగా పోస్ట్‌ పెట్టారు.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని