Samsung AI: ఏఐ ఫీచర్లతో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు.. ఆవిష్కరించిన శాంసంగ్

Samsung: ఏఐ సాంకేతికత జోడించిన రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండీషనర్, మైక్రోవేవ్, వాషింగ్ మెషీన్‌లను శాంసంగ్‌ కంపెనీ తాజాగా ఆవిష్కరించింది. విద్యుత్‌ వినియోగాన్ని, కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ సాంకేతికత సాయపడుతుందని పేర్కొంది.

Published : 03 Apr 2024 19:18 IST

Samsung AI powered home appliances | ముంబయి: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్‌ (Samsung) కొత్త అంకానికి తెర లేపింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సాంకేతికతో పనిచేసే గృహోపకరణాలను ఆవిష్కరించింది. అంతర్గత కెమెరా, బెస్పోక్ (bespoke) AI చిప్‌తో కూడిన రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, మైక్రోవేవ్‌, వాషింగ్‌ మెషీన్లను తీసుకొచ్చింది. వేగంగా వృద్ధి చెందుతున్న ప్రీమియం ఉత్పత్తుల్లో తన సత్తా చాటడానికి ఏఐ సాంకేతిక ఉపయోగపడుతుందని కంపెనీ భావిస్తోంది.

‘‘గృహోపకరణాల్లో బెస్పోక్‌ ఏఐ సాంకేతికతను జోడించాం. దీనివల్ల ఆయా వస్తువులు వినియోగదారులు కోరుకున్నట్లు పని చేస్తాయి. సులభంగా నియంత్రించే సదుపాయం కూడా ఉంది. ఏదైనా రిపేర్‌ ఉన్నా సులువుగా గుర్తించడం వీలు పడుతుంది. విద్యుత్తు వినియోగాన్ని, కాలుష్యాన్ని తగ్గించడంలో ఏఐ సాయపడుతుంది. దీనివల్ల భారత్‌లో డిజిటల్‌ ఉపకరణాల మార్కెట్‌లో మేం మరింత శక్తిమంతంగా మారుతామని విశ్వసిస్తున్నాం’’ అని శాంసంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సీఈఓ జేబీ పార్క్ తెలిపారు. 

యాపిల్‌ యూజర్లకు కేంద్రం ‘హై-రిస్క్‌’ అలర్ట్‌..

శాంసంగ్ తీసుకొచ్చిన ఏఐ ఆధారిత గృహోపకరణాల్లో ఇన్‌బిల్ట్‌ ఇంటర్నెట్ కనెక్టివిటీ, కెమెరా, ఏఐ చిప్‌ ఉంటాయి. దీంతో స్మార్ట్‌థింగ్స్ అప్లికేషన్ ద్వారా గృహోపకరణాలను నియంత్రించొచ్చు. ఏఐ అల్గారిథమ్‌ సాయంతో విద్యుత్‌ను ఆదా చేస్తాయని శాంసంగ్‌ తెలిపింది. రిఫ్రిజిరేటర్‌లో 10 శాతం, ఎయిర్‌ కండిషనర్‌ల్లో 20 శాతం, వాషింగ్‌ మెషీన్‌లో అయితే 70 శాతం వరకు విద్యుత్‌ వినియోగాన్ని తగ్గిస్తాయని కంపెనీ చెబుతోంది. పైగా ఏఐ వల్ల ఉత్పత్తులు ఎక్కువ కాలం పనిచేస్తాయని పేర్కొంది. భవిష్యత్‌లో ఓఎస్‌ అప్‌డేట్స్‌ ద్వారా మరిన్ని ఏఐ ఫీచర్లు జోడిస్తామని కంపెనీ తెలిపింది. శాంసంగ్‌ నాక్స్‌ సెక్యూరిటీ  కూడా ఉంటుందని పేర్కొంది.

ఎలా పనిచేస్తాయ్‌?

రిఫ్రిజిరేటర్లలో ఉండే ఏఐ విజన్‌ కెమెరాలు స్టోర్‌ చేసే ఆహార పదార్థాలను గుర్తిస్తాయి. అవి పాడవకుండా ఉండేందుకు ఎంత ఉష్ణోగ్రత అవసరమో అంతే ఉండేలా చూస్తాయి. పాడయ్యేందుకు అవకాశం ఉన్న ఆహార పదార్థాలు ఉంటే వెంటనే యూజర్‌కు నోటిఫికేషన్ పంపిస్తాయి. ఇంటికొచ్చేసరికి గదిని చల్లగా ఉంచాలనుకుంటే వెల్‌కమ్‌ కూలింగ్‌ ఫంక్షన్‌ ద్వారా ఏసీని ఆపరేట్‌ చేయొచ్చు. స్మాట్‌ థింగ్స్‌ అప్లికేషన్‌ సాయంతో ఏసీని ఆన్‌, ఆఫ్‌ చేయొచ్చు. లోడ్‌, దుస్తులు రకాన్ని ఏఐ కలిగిన వాషింగ్‌ మెషీన్లు వాటింతట అవే వాష్‌ ఫీచర్లను ఎంచుకుంటాయి. కావాల్సినంత నీటిని, డిటర్జెంట్‌ను తీసుకుంటాయి. ఈ గృహోపకరణాన్నీ శాంసంగ్‌ బిక్స్‌బీ ఏఐ వాయిస్‌ అసిస్టెంట్‌కు సపోర్ట్‌ చేస్తాయి. అంటే వాయిస్‌ కమాండ్స్‌తో కూడా వీటిని కంట్రోల్‌ చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని