SEBI clean chit to adani: హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు.. గౌతమ్‌ అదానీకి సెబీ క్లీన్‌చిట్‌

Eenadu icon
By Business News Team Updated : 18 Sep 2025 20:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

SEBI clean chit to adani | దిల్లీ: హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ, ఆయన కంపెనీలకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుంచి క్లీన్‌చిట్‌ లభించింది. స్టాక్‌ అవకతవకలు, అకౌంటింగ్‌ మోసాలకు పాల్పడుతోందంటూ అమెరికా షార్ట్‌ సెల్లర్‌ చేసిన ఈ ఆరోపణల్లో నిజం లేదని సెబీ స్పష్టంచేసింది. అదానీ గ్రూప్‌ తన లిస్టెడ్‌ కంపెనీల్లోకి అక్రమంగా నిధులు మళ్లించిందనడానికి ఎలాంటి ఆధారాల్లేవని పేర్కొంది. ఈ మేరకు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, మార్కెట్‌ మ్యానిపులేషన్‌, పబ్లిక్‌ షేర్‌ హోల్డింగ్‌ నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలకు సంబంధించి గురువారం రెండు వేర్వేరు ఉత్తర్వులు వెలువరించింది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు ఆ గ్రూప్‌నకు చెందిన ఇతర కంపెనీలపైనా హిండెన్‌బర్గ్‌ సంస్థ 2023 జనవరిలో తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ పవర్‌ లిమిటెడ్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ వంటి లిస్టెడ్‌ కంపెనీల్లో నిధుల మళ్లింపునకు అడికార్ప్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మైల్‌స్టోన్‌ ట్రేడ్‌లింక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రెహ్వార్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలను అదానీ గ్రూప్‌ వినియోగించిందని ఆరోపించింది. అదానీ గ్రూప్‌ కంపెనీలతో జరిగిన లావాదేవీల్లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘనా జరగలేదని సెబీ బోర్డు సభ్యుడు కమలేష్‌ సీ వార్ష్నీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మదుపర్లను తప్పుదోవ పట్టించేలా ఎలాంటి నిబంధనల ఉల్లంఘనా జరగలేదని సెబీ స్పష్టంచేసింది. అదానీ గ్రూప్‌ సంస్థలు గానీ, ఎగ్జిక్యూటివ్‌లు గానీ ఎలాంటి తప్పూ చేయలేదని, జరిమానా విధించాల్సిన అవసరం లేదని తెలిపింది.

అప్పట్లో నిపుణుల కమిటీ

హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత అదానీ గ్రూప్‌ కంపెనీల స్టాక్స్‌ భారీగా పతనమయ్యాయి. సుమారు 150 బిలియన్‌ డాలర్ల విలువను కోల్పోయాయి. అదానీ గ్రూప్‌ అవకతవకలకు పాల్పడిందనడానికి ఆధారాల్లేవని ఇప్పటికే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక స్పష్టంచేసింది. దీంతో భారీగా పతనమైన గ్రూప్‌ షేర్లు మళ్లీ కోలుకున్నాయి. తాజాగా సెబీ కూడా క్లీన్‌చిట్‌ అదానీ గ్రూప్‌నకు ఊరట కల్పించే అంశం. మరోవైపు ఇంతటి తీవ్ర ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్‌ సంస్థ.. ఈ ఏడాది జనవరిలో తన కార్యకలాపాలు మూసివేయడం గమనార్హం.

వారు దేశానికి క్షమాపణ చెప్పాలి: అదానీ

సెబీ క్లీన్‌చిట్‌ ఇచ్చిన వేళ గౌతమ్‌ అదానీ ఎక్స్‌ వేదికగా స్పందించారు. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు అవాస్తవమని మరోసారి రుజువైందన్నారు. తాము ఎప్పటినుంచో ఇదే విషయం చెప్తున్నామన్నారు. ఈ కుట్రపూరిత నివేదిక కారణంగా పెట్టుబడిదారులు నష్టపోయినందుకు బాధగా ఉందన్నారు. తప్పుడు వాదనలు ప్రచారం చేసిన వారు దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. జాతి నిర్మాణంలో తమ నిబద్ధత కొనసాగుతుందందన్నారు. తన పోస్ట్‌కు జాతీయ జెండాను జోడిస్తూ సత్యమేవ జయతే!, జైహింద్‌!! అని రాసుకొచ్చారు.

Tags :
Published : 18 Sep 2025 20:09 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు