Twitter: ట్విటర్‌లో ఆర్టికల్స్‌.. ఇకపై ట్వీట్‌లో అక్షరాల పరిమితి ఉండదు!

ట్విటర్‌ (Twitter)లో ఆర్టికల్స్‌ (Articles) పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ఎలాన్‌ మస్క్ వెల్లడించారు. ఈ ఫీచర్‌తో అక్షరాల పరిమితి లేకుండా ట్వీట్‌లు చేయొచ్చు.

Published : 19 Jul 2023 18:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌ (Twitter) త్వరలో మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఆర్టికల్స్‌ (Articles) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్లు పెద్ద పెద్ద వ్యాసాలను ట్వీట్‌ చేయొచ్చు. ఈ మేరకు ఓ యూజర్‌ ఆర్టికల్స్‌ గురించి చేసిన ట్వీట్‌కు మస్క్ రిప్లై ఇస్తూ.. ఈ విషయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం ట్విటర్‌లో ట్వీట్‌ చేసే అక్షరాలపై పరిమితి ఉంది. సాధారణ యూజర్లకు 280 అక్షరాలు, ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రైబర్లకు పదివేల అక్షరాల వరకు పరిమితి ఉంది. త్వరలో రాబోయే ఫీచర్‌తో అక్షరాల పరిమితి లేకుండా ట్వీట్‌లు చేయొచ్చు. అంటే, ఒక పుస్తకంలోని కంటెంట్‌ మొత్తాన్ని కూడా ట్వీట్ చేయొచ్చని సమాచారం. కంటెంట్ క్రియేటర్లకు ఆర్టికల్స్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ట్విటర్‌ భావిస్తోంది. అయితే, ఈ ఫీచర్‌ను ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేస్తారా? లేక సాధారణ యూజర్లకు సైతం అందుబాటులోకి తీసుకొస్తారా? అనేది తెలియాల్సివుంది. 

చాట్‌జీపీటీ, గూగుల్‌కు పోటీగా మెటా ఓపెన్‌-సోర్స్ AI..

ట్విటర్‌ తొలినాళ్లలో కేవలం 140 అక్షరాలకు మించి ట్వీట్‌ చేయడం సాధ్యపడేది కాదు. 2018లో అక్షరాల సంఖ్యను 280కి పెంచారు. ఆ తర్వాత కూడా అక్షరాల పరిమితిని పెంచాలని యూజర్లు డిమాండ్ చేశారు. ట్విటర్‌ను మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ట్విటర్‌ 2.0 పేరుతో మార్పులు చేశాడు. బ్లూ సబ్ స్క్రిప్షన్ పేరుతో కొన్ని ఫీచర్ల వినియోగంపై పరిమితులు విధించాడు. ముఖ్యంగా ఒక రోజులో చూసే పోస్టులపై పరిమితి విధించడంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ట్వీట్‌లు చూడటంపై ఎలాంటి పరిమితి ఉండేది కాదు. దీంతో చాలా మంది యూజర్లు ట్విటర్‌ను వదిలి.. మెటా కొత్తగా తీసుకొచ్చిన థ్రెడ్స్‌ యాప్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికీ ట్విటర్‌ నష్టాల నుంచి కోలుకోలేదని మస్క్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. రుణభారం ఎక్కువగా ఉండటం, ట్విటర్ ఆదాయం పడిపోవడం ప్రధాన కారణాలుగా పేర్కొన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని