Meta: చాట్‌జీపీటీ, గూగుల్‌కు పోటీగా మెటా ఓపెన్‌-సోర్స్ AI..

Meta: చాట్‌జీపీటీ, గూగుల్‌కు పోటీగా మెటా ఓపెన్‌-సోర్స్ AI మోడల్‌ను ప్రారంభించింది. దీనికోసం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

Published : 19 Jul 2023 13:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గత కొంతకాలంగా కృత్రిమ మేధపై అనేక కంపెనీలు విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్ (Facebook) మాతృసంస్థ మెటా ( Meta) కూడా ఏఐ రంగంలో సేవలను విస్తరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఓపెన్ సోర్స్ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (AI)ను ప్రారంభిస్తున్నట్లు  సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) వెల్లడించారు. ఓపెన్‌ ఏఐ చాట్‌జీపీటీ (ChatGPT), గూగుల్‌ బార్డ్‌ చాట్‌బాట్‌లకు పోటీగా మెటా దీన్ని తీసుకొచ్చింది. కాగా.. దీన్ని ఉచితంగా వినియోగదారులకు అందించనున్నట్లు జుకర్‌బర్గ్‌ తెలిపారు.

చాట్‌జీపీటీ, బార్డ్‌ చాట్‌బాట్‌లకు కీలకమైన లాంగ్వేజ్‌ మోడల్‌ను ఓపెన్‌ఏఐ, గూగుల్‌ ఇప్పటికే అభివృద్ధి చేశాయి. ఈ రెండు టెక్‌ రంగంలో విశేష ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే కొద్ది నెలల క్రితం కృత్రిమ మేధ రంగంలోకి అడుగుపెట్టిన మెటా.. Llama అనే పేరుతో సరికొత్త లాంగ్వేజ్‌ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇది నేరుగా వినియోగదారులకు కాకుండా పరిశోధకులు మాత్రమే ఉపయోగించుకునేలా రూపొందించింది. 

ఇప్పుడు ఏఐకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధకులతో పాటు, వాణిజ్య అవసరాల నిమిత్తం Llama2 పేరుతో మరో శక్తిమంతమైన లాంగ్వేజ్‌ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ఓపెన్‌సోర్స్‌ ఏఐ మోడల్‌. మరో టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో కలిసి తీసుకొచ్చింది. ‘ఓపెన్ సోర్స్ అనేది ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కువ సంఖ్యలో డెవలపర్లకు కొత్త టెక్నాలజీతో మమేకం అవ్వటానికి వీలు కల్పిస్తుంది. భద్రత విషయంలో కూడా మెరుగ్గా పనిచేస్తుంది’ అని మెటా సీఈఓ తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో తెలిపారు.

రికార్డు గరిష్ఠానికి రిలయన్స్‌ షేరు

సత్య నాదెళ్లతో ఏఐ ఒప్పందం

న్యూ జనరేషన్‌ ఏఐ మోడల్‌ను తీసుకురావటానికి మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మార్క్‌ జుకర్‌బర్గ్‌ మంగళవారం ప్రకటించారు. పరిశోధనల కోసం సహాయపడే Llama2ను తీసుకువచ్చినట్లు ఆయన అన్నారు. ఏఐలో ప్రధాన భాగస్వామిగా ఉన్న మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదెళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ మార్క్‌ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్టు పెట్టారు. కాగా.. ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐలో భారీ పెట్టుబడులు పెట్టింది. ఈ క్రమంలో ఏఐ రంగంలో తన సేవలను మరింత విస్తరించుకునేందుకు తాజాగా మెటాతోనూ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని