Adani Ports: అదానీ చేతికి మరో పోర్టు.. కొనుగోలు విలువ రూ.3,350 కోట్లు

Adani Ports: అదానీ పోర్ట్స్‌ మరో పోర్టును కొనుగోలు చేసింది. ఎస్‌పీ గ్రూప్‌ నుంచి గోపాల్‌పూర్‌ నౌకాశ్రయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.3,350 కోట్లు.

Updated : 26 Mar 2024 11:46 IST

దిల్లీ: గోపాల్‌పూర్‌ పోర్టును అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ లిమిటెడ్‌కు విక్రయించినట్లు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ మంగళవారం ప్రకటించింది. తమ ఆస్తుల నగదీకరణ ప్రణాళికలో భాగంగా రూ.3,350 కోట్ల విలువ వద్ద దీన్ని అమ్మినట్లు చెప్పింది. ఒడిశాలో నిర్మాణ దశలో ఉన్న ఈ నౌకాశ్రయాన్ని ఎస్‌పీ గ్రూప్‌ 2017లో కొనుగోలు చేసింది.

గోపాల్‌పూర్‌ పోర్టు వార్షిక సామర్థ్యం 20 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు. గ్రీన్‌ఫీల్డ్‌ ఎల్‌ఎన్‌జీ రీగ్యాసిఫికేషన్‌ టెర్మినల్‌ ఏర్పాటుకు ఇటీవలే పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీతో ఈ రేవు ఒప్పందం కుదుర్చుకుంది. దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నగదు ప్రవాహాన్ని సమకూరుస్తుందనే అంచనాలు ఉన్నాయి. గత కొన్ని నెలల్లో నౌకాశ్రయాల నుంచి ఎస్‌పీ గ్రూప్‌ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ఇది రెండోసారి. గతంలో మహారాష్ట్రలోని ధరమ్‌తర్‌ పోర్టును రూ.710 కోట్లకు జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌కు విక్రయించింది. దీన్ని 2015లో కొనుగోలు చేసి వార్షిక సామర్థ్యాన్ని 1 మిలియన్‌ టన్నుల నుంచి ఐదు మిలియన్‌ టన్నులకు పెంచింది.

పీపీఎఫ్‌, వీపీఎఫ్‌లో ఏది బెటర్‌..?

రుణాలను తగ్గించుకొని కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడంలో ఈ పెట్టుబడుల ఉపసంహరణలు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నామని ఎస్‌పీ గ్రూప్‌ అధికార ప్రతినిధి తెలిపారు. తద్వారా భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా తమ కీలక వ్యాపారాలపై దృష్టి సారించే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఈ గ్రూప్‌పై దాదాపు రూ.20 వేల కోట్ల రుణభారం ఉందని అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు