PPF vs VPF: పీపీఎఫ్‌, వీపీఎఫ్‌లో ఏది బెటర్‌..?

PPF or VPF: వాలంటరీ ప్రావిడెండ్‌ ఫండ్‌, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌లో ఏది బెటర్‌ అని ఆలోచిస్తున్నారా? ఈ విషయాల్ని పరిశీలించాక మీ నిర్ణయం తీసుకోండి..

Published : 26 Mar 2024 10:33 IST

PPF or VPF | ఇంటర్నెట్‌డెస్క్‌: ఉద్యోగం చేసే వారైనా.. వ్యాపారంలో ఉన్న వారైనా..  కష్టపడి సంపాదించిన సొమ్మును భవిష్యత్‌ కోసం దాచుకుంటారు. దానికోసం వివిధ దీర్ఘకాలిక పెట్టుబడి పథకాలను ఎంచుకుంటూ ఉంటారు. అధిక రాబడి ఇచ్చే పెట్టుబడి సాధనాలు ఎన్ని ఉన్నా.. ఇప్పటికీ చాలామంది పొదుపు కోసం ప్రభుత్వ హామీనిచ్చే ప‌థ‌కాల‌పైనే మక్కువ చూపుతున్నారు. ఆ కోవకే చెందుతాయి వాలంటరీ ప్రావిడెండ్‌ ఫండ్‌ (VPF), పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF). ఇందులో ఉద్యోగం చేస్తున్న వారికి ఏది మంచిది? వ్యాపారులకైతే ఏది సరిపోతుంది? అలాగే, వడ్డీ, పన్ను ప్రయోజనాలు.. వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలను అందించే పథకం ఎంప్లాయిస్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ (EPF)కు అదనంగా కంట్రిబ్యూట్‌ చేసేందుకు తీసుకొచ్చిన సదుపాయమే VPF. సాధారణంగా ఉద్యోగులు తమ వేతనం నుంచి 12శాతం మొత్తాన్ని ఈపీఎఫ్‌కు జమ చేస్తారు. దీనికి సమానమైన మొత్తాన్ని సంస్థ యజమాని కూడా ఉద్యోగి ఈపీఎఫ్‌ ఖాతాకు జమచేస్తారు. ఒకవేళ ఉద్యోగులు అదనంగా పొదుపు చేయాలనుకుంటే ఈ వీపీఎఫ్‌ (VPF) ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. ఈ మొత్తం ఈపీఎఫ్‌ ఖాతాలో జమ అవుతుంది. యాక్టివ్‌ ఈపీఎఫ్‌ ఖాతా ఉన్న వాళ్లు మాత్రమే ఈ అకౌంట్‌ తెరిచే సదుపాయం ఉంటుంది. అంటే వీపీఎఫ్‌ అనేది ఉద్యోగులకు మాత్రమే. ఇక భారతీయ పౌరులెవరైనా PPF ఖాతా తెరవొచ్చు.

చెల్లింపు

కేవలం రూ.100తోనే పీపీఎఫ్‌ ఖాతాను తెరవొచ్చు. ఏడాదిలో కనీసం రూ.500 ఖాతాకు జమ చేయాలి. ఏడాదిలో గరిష్ఠంగా రూ.1,50,000 వరకు జమ చేయొచ్చు. ఇక వీపీఎఫ్‌లో కనీస మొత్తంపై ఎటువంటి పరిమితీ లేదు. వీపీఎఫ్‌లో గరిష్ఠంగా ఉద్యోగి బేసిక్‌+డీఏకు 100% సమానమైన మొత్తాన్ని డిపాజిట్‌ చేయొచ్చు.

విత్‌డ్రా

పీపీఎఫ్‌కు 15 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. కాలపరిమితి ముగిశాక మొత్తం నగదును విత్‌ డ్రా చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఐదేసి సంవత్సరాల చొప్పున ఖాతాను పొడిగించుకోవచ్చు. ఖాతా తెరిచిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి 5 సంవత్సరాల తర్వాత పాక్షిక విత్‌డ్రాలను అనుమతిస్తారు. మూడేళ్ల నుంచి ఆరు సంవత్సరాల మధ్య పీపీఎఫ్‌ బ్యాలెన్స్‌పై రుణం పొందొచ్చు.

ఇక వీపీఎఫ్‌లో ఉద్యోగం నుంచి విరమణ పొందేవరకు పెట్టుబడులు పెట్టొచ్చు. రిటైర్మెంట్‌ తర్వాత ఈపీఎఫ్‌ మొత్తాన్ని విత్‌డ్రాలను అనుమతిస్తారు. రెండు నెలలకు పైగా నిరుద్యోగిగా ఉన్నట్లయితే పూర్తి వీపీఎఫ్‌ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. వైద్యపరమైన ఖర్చులు, సొంతింటి నిర్మాణం లేదా కొనుగోలు, పునర్నిర్మాణం వంటి ప్రయోజనాల కోసం పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తారు.

వడ్డీ

వడ్డీ విషయానికొస్తే ప్రస్తుతం పీపీఎఫ్‌ ద్వారా 7.1 శాతం వడ్డీ పొందొచ్చు. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికం వరకు ఇదే వడ్డీనే ఉంటుంది. 2021-22 నుంచి ఇప్పటివరకు పీపీఎఫ్‌ వడ్డీ రేటు స్థిరంగానే ఉంది. వీపీఎఫ్‌కు మాత్రం ఈపీఎఫ్‌కు అందించే వడ్డీనే వర్తిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో 8.15 శాతంగా ఉన్న వడ్డీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.25 శాతంగా ఉంది. అంటే పీపీఎఫ్‌ కంటే వీపీఎఫ్‌లోనే వడ్డీ కొంచెం ఎక్కువగా ఉంటుంది.

పన్ను మినహాయింపు

ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌.. ఈ రెండు పథకాల్లోనూ జమ చేసిన మొత్తాలకు సెక్షన్‌ 80సి వర్తిస్తుంది. అంటే ఏడాదిలో రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌లో జమ అయిన మొత్తం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలు దాటితే పన్ను భారం పడుతుంది. అదనంగా జమ చేసిన మొత్తంపై వచ్చిన వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక పీపీఎఫ్‌ ఖాతాలో చేసే పెట్టుబడిపై 1961 సెక్షన్‌ 80సి కింద ఏడాదిలో రూ.1.5 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. దీనిపై పొందే వడ్డీపై కూడా పన్ను ఉండదు. పన్ను మినహాయింపు మార్గాల కోసం అన్వేషించే ఉద్యోగులు దీన్ని పరిశీలించొచ్చు.

ఖాతా తెరవడం

పీపీఎఫ్‌ ఖాతాను పోస్టాఫీసులు, బ్యాంకుల్లో తెరవొచ్చు. చాలా బ్యాంకులు ఆన్‌లైన్‌లోనే పీపీఎఫ్ ఖాతా తెరిచే సదుపాయాన్ని అందిస్తున్నాయి. వీపీఎఫ్‌ కోసం మీరు పని చేస్తున్న సంస్థ హెచ్‌ఆర్‌ని సంప్రదించి మీరు జమ చేయాలనుకున్న మొత్తం తెలియజేస్తే సరిపోతుంది.

చివరగా.. 

మీ అర్హత, వ్యక్తిగత ప్రాధాన్యాలు, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు.. వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకొని పీపీఎఫ్‌, వీపీఎఫ్‌ ఆప్షన్లు ఎంచుకోండి. అధిక వడ్డీ మూలంగా ఉద్యోగులు వీపీఎఫ్‌ను ఎంచుకోవడం సరైన నిర్ణయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని