Google Pay: గూగుల్‌పేలో బై నౌ పే లేటర్‌.. కార్డు వివరాలు మరింత సేఫ్‌

Google Pay: ఆన్‌లైన్‌ కొనుగోళ్లను మరింత సులభతరం చేయడానికి యూపీఐ పేమెంట్‌ యాప్‌ గూగుల్‌పే మూడు సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.

Published : 23 May 2024 15:22 IST

Google Pay | ఇంటర్నెట్‌డెస్క్‌: ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ను మరింత సులభతరం చేయడం కోసం గూగుల్‌కు చెందిన పేమెంట్‌ యాప్ గూగుల్‌పే (Google pay) సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. డిజిటల్‌ పేమెంట్లు పెరుగుతున్న తరుణంలో వినియోగదారుల కోసం మూడు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. చెల్లింపులు చేసే ముందు కార్డ్‌ ప్రయోజనాలు చూపడం, బై నౌ పే లేటర్‌, కార్డ్‌ వివరాలపై భద్రత కల్పించడం వంటి సదుపాయాలను తాజాగా తీసుకొచ్చింది.

ప్రత్యేకమైన రివార్డులు, క్యాష్‌బ్యాక్‌లంటూ అనేక ప్రయోజనాలతో క్రెడిట్‌ కార్డులు వస్తాయి. ఆన్‌లైన్‌ కొనుగోళ్ల దగ్గర నుంచి విమాన ప్రయాణాలు, హోటళ్లలో బస వరకు ప్రతీ కార్డు ఏదో ఒక ఆఫర్‌ను అందిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉపయోగిస్తున్న వాళ్లకు నిర్దిష్ట కొనుగోళ్లపై ఏ కార్డు అధిక రివార్డు పాయింట్లు అందిస్తుందో గుర్తుంచుకోవడం కష్టం. ఉదాహరణకు ఒక క్రెడిట్‌ కార్డు కిరాణా కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌ అందిస్తుంటే.. మరొకటి ట్రావెల్‌కి మాత్రమే డిస్కౌంట్‌ ఇస్తుంటుంది. ఇలాంటి సమయంలో గూగుల్‌పే తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌ మీకు సాయపడుతుంది. ప్రతీ కార్డ్‌ ప్రయోజనాలను మ్యానువల్‌గా చెక్‌ చేసే పని తప్పుతుందన్నమాట. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉపయోగించే వారికి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. డెస్క్‌టాప్‌లో క్రోమ్‌ బ్రౌజర్‌లో గూగుల్‌ పేతో కొనుగోళ్లు జరుపుతున్నప్పుడు ఈ ఆప్షన్స్‌ కనిపిస్తాయి.  

డ్రైవింగ్‌ లైసెన్స్‌ కొత్త రూల్స్‌.. టెస్ట్‌ కోసం ఆర్‌టీవో ఆఫీసుకు వెళ్లక్కర్లేదు!

బై నౌ పే లేటర్‌..

ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి (బై నౌ పే లేటర్‌ - BNPL) బాగా ప్రాచుర్యం పొందిన పేమెంట్‌ ఆప్షన్‌. అత్యవసరంగా వస్తువును కొనుగోలు చేయాలనుకుంటే పూర్తి మొత్తాన్ని అప్పుడే చెల్లించకుండా తర్వాత పూర్తి మొత్తం లేదా వాయిదాల రూపంలో చెల్లించే సదుపాయమే ఇది. ప్రస్తుతం ఈ సేవల్ని అమెరికా అంతటా విస్తరించింది. కొనుగోలు సమయంలో ఈ ఆప్షన్‌ ఎంచుకోవచ్చు.

ఆ వివరాలు మరింత భద్రం..

ఆన్‌లైన్‌ షాపింగ్‌ సమయంలో కార్డు వివరాలు ప్రతిసారీ ఎంటర్‌ చేయాలంటే చిరాకు వస్తుంది. దీనికోసం ఆటోఫిల్‌ను తీసుకొచ్చారు. ఆటోఫిల్‌ అనేది ఆన్‌లైన్‌ చెక్‌అవుట్‌ సమయంలో మీ బిల్లింగ్‌, చెల్లింపు వివరాలను ఆటోమెటిక్‌గా నమోదు చేసే ఫీచర్‌. చెక్‌అవుట్‌ సమయంలో సమయాన్ని ఆదా చేసేందుకు ఇది సాయపడుతుంది. గూగుల్‌పే ఈ ఫీచర్‌ని మరింత సురక్షితం చేసింది. క్రోమ్‌ లేదా ఆండ్రాయిడ్‌లో గూగుల్‌పేని ఉపయోగించి చెక్‌అవుట్‌ చేసే సమయంలో కార్డు వివరాలు ఆటోఫిల్‌ అవ్వాలంటే ఫింగర్‌ ప్రిట్‌, ఫేస్‌ స్కాన్‌ లేదా లాక్‌ పిన్‌ ద్వారానే సాధ్యమవుతుంది. కార్డు వివరాలకు మరింత భద్రత అందించేందుకు దీన్ని తీసుకొచ్చినట్లు గూగుల్‌పే తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు