iPhone: ఏటా కొత్త ఐఫోన్‌.. ఎందుకో చెప్పిన టిమ్‌ కుక్‌

యాపిల్‌ కంపెనీ ఏటా కొత్త ఐఫోన్ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. దీనిపై పలువురు యూజర్లు ప్రశ్నలు లేవనెత్తారు. దానికి యాపిల్ సీఈవో టిమ్‌ కుక్‌ బదులిచ్చారు. 

Updated : 10 Oct 2023 16:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌లలో లగ్జరీ బ్రాండ్ అనగానే చాలా మంది యాపిల్‌ (Apple) పేరు చెబుతారు. ఇతర కంపెనీలతో పోలిస్తే.. ఐఫోన్‌ (iPhone)లో యాపిల్‌ ఉపయోగించే సాంకేతికత, వాటి డిజైన్‌, ఫీచర్స్ అత్యున్నతంగా ఉంటాయి. అందుకే, ఖరీదు ఎక్కువైనా.. చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. యాపిల్‌ కూడా యూజర్లను ఆకట్టుకునేందుకు ఏటా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌తో కొత్త మోడల్‌ ఐఫోన్‌ను విడుదల చేస్తుంది. గత కొన్నేళ్లుగా ఈ ట్రెండ్ ఇలా కొనసాగుతోంది. అయితే, దీనిపై పలువురు యూజర్లు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నలు లేవనెత్తున్నారు. నిజంగా ఏటా కొత్త ఐఫోన్ అవసరం ఉందా? అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు యాపిల్ సీఈవో టిమ్‌ కుక్‌ (Tim Cook) ఓ ఇంటర్వ్యూలో సమాధానం చెప్పారు. 

‘‘ఐఫోన్ ఉపయోగించాలనుకునే యూజర్లు ఏటా కొత్త మోడల్‌ను పొందడం గొప్ప విషయంగా భావిస్తున్నాను. వారి కోసమే సరికొత్త ఫీచర్లతో ఫోన్‌లను విడుదల చేస్తున్నాం’’ అని టిమ్‌ కుక్‌ తెలిపారు. దాంతోపాటు కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లకు ట్రేడ్‌ ఇన్‌ (పాత ఐఫోన్‌ ఎక్స్‌ఛేంజ్‌ చేయడం) అవకాశం కల్పించడంపై కూడా స్పందించారు. ‘‘ట్రేడ్‌ ఇన్‌ ద్వారా మేం సేకరించిన పాత ఐఫోన్లలో పనిచేస్తున్న వాటిని అమ్మకానికి పెడతాం. దానివల్ల ఇతరులు వాటిని ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఒక వేళ ట్రేడ్‌ ఇన్‌లో మా వద్దకు వచ్చిన ఫోన్లు పనిచేయకపోతే.. అందులో పనిచేస్తున్న విడి భాగాలను సేకరించి.. మిగిలిన వాటిని కంపెనీ నిబంధనల ప్రకారం తుక్కుగా మారుస్తాం’’ అని టిమ్‌ కుక్‌ తెలిపారు.

వాట్సాప్‌లో త్వరలో ‘సీక్రెట్‌ కోడ్‌’.. ఇంతకీ ఎలా పనిచేస్తుందంటే?

మరోవైపు యాపిల్ కంపెనీ ఏటా కొత్త ఐఫోన్ మోడల్‌ను తీసుకురావడం వల్ల ఈ-వేస్ట్‌ పెరిగి పర్యావరణానికి హాని కలిగే ప్రమాదం ఉందని పలువురు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారంగా తమ వంతు బాధ్యతగా యాపిల్ ట్రేడ్‌ ఇన్‌ పాలసీని తీసుకొచ్చినట్లు టిమ్ కుక్‌ తెలిపారు. ఇందులో భాగంగా పర్యావరణానికి హాని కలగకుండా పాత ఫోన్లలోని విడిభాగాలను రీసైక్లింగ్ చేస్తున్నట్లు వివరించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని