Truecaller: ట్రూకాలర్‌లో వెబ్‌ వెర్షన్‌.. పీసీలోనూ ఇక నంబర్లు వెతకొచ్చు

ట్రూకాలర్‌ కొత్త సదుపాయం తీసుకొచ్చింది. వెబ్‌ వెర్షన్‌ను లాంచ్‌ చేసింది. తద్వారా కొత్త నంబర్లను వెబ్‌లోనూ వెతకొచ్చు.

Updated : 10 Apr 2024 15:32 IST

Truecaller web | ఇంటర్నెట్‌ డెస్క్‌: కాంటాక్టుల్లో లేని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను గుర్తించేందుకు ఉపయోగించే ట్రూకాలర్ (Truecaller).. మరో కొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది. వాట్సప్‌, టెలిగ్రామ్‌ తరహాలో ‘ట్రూ కాలర్‌ వెబ్‌’ను తీసుకొచ్చింది. దీనిద్వారా మీ మొబైల్‌ను డెస్క్‌టాప్‌/ ల్యాప్‌టాప్‌లోనూ సెర్చ్‌ చేసి గుర్తుతెలియని నంబర్ల వివరాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

ట్రూ కాలర్‌ వెబ్‌ (Truecaller web) సాయంతో ఆండ్రాయిడ్‌ యూజర్లు తమ డివైజ్‌ను ల్యాప్‌టాప్‌/ పీసీకి కనెక్ట్‌ చేయొచ్చు. ఫోన్‌లో వచ్చే ఎస్సెమ్మెస్‌ ఇన్‌బాక్స్‌ను రీడ్‌ చేయొచ్చు. కావాలంటే అక్కడి నుంచే రిప్లై కూడా ఇవ్వొచ్చు. ఏదైనా కాల్‌/ మెసేజ్‌ వచ్చినప్పుడు ఫోన్‌ చూడాల్సిన అవసరం లేకుండానే ఇన్‌కమింగ్ కాల్‌/మెసేజ్‌ అలర్ట్‌లను డెస్క్‌టాప్‌లో పొందొచ్చు. వెబ్‌కు కనెక్ట్‌ చేయగానే మొబైల్‌లో ఇప్పటివరకు ఉన్న సందేశాలను ట్రూకాలర్‌ సెకన్లలో చూపిస్తుంది. ఈ ఫీచర్‌ ద్వారా కాంటాక్టు వివరాలు తెలుసుకోవడంతో పాటు కంప్యూటర్‌ కీబోర్డు ద్వారా వేగంగా సందేశాలను పంపించడానికి వీలవుతుందని ట్రూకాలర్‌ పేర్కొంది. మొబైల్‌ తరహాలోనే డెస్క్‌టాప్‌లోనూ సందేశాలు   ఎన్‌క్ట్రిప్ట్‌ చేసి ఉంచుతామని పేర్కొంది.

వేసవిలో ఊటీ అందాలు చూసొస్తారా? ₹13 వేల నుంచే ప్యాకేజీ ధరలు

ఎలా కనెక్ట్‌ చేయాలి?

వాట్సప్‌ వెబ్‌ తరహాలోనే ట్రూకాలర్‌ వెబ్‌ను సులువుగా డెస్క్‌టాప్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆండ్రాయడ్‌ యూజర్లు తమ ట్రూకాలర్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. అందులో దిగువన ఉండే మెసేజెస్‌ ట్యాబ్‌లో పైన ఉండే త్రీ డాట్స్‌ మెనూ ఓపెన్‌ చేయాలి. అక్కడ మెసేజింగ్‌ ఫర్‌ వెబ్‌ అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి. డెస్క్‌టాప్‌/ ల్యాప్‌టాప్‌ బ్రౌజర్లో web.truecaller.com అని సెర్చ్‌ చేసి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయడం ద్వారా డివైజ్‌ను లింక్‌ చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని