TweetDeck: ఎక్స్‌లో మరో మార్పు.. బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ ఉంటేనే ట్వీట్‌ డెక్‌

Tweetdeck: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్‌ ఎక్స్‌లో మరో మార్పు చోటుచేసుకుంది. బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవారికే ట్వీట్‌ డెక్‌ సేవలను అందించనుంది.

Published : 16 Aug 2023 15:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎలాన్‌ మస్క్‌కు చెందిన మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ఎక్స్‌ (X) (ట్విటర్‌)లో మరో మార్పు చోటుచేసుకుంది. ఆదాయం పెంచుకునేందుకు బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునేలా యూజర్లను ప్రోత్సహిస్తున్న ఆ కంపెనీ.. ఇన్నాళ్లూ ఉచితంగా లభించిన ట్వీట్‌ డెక్‌ (TweetDeck) సర్వీసులను పెయిడ్‌ సర్వీసులుగా మార్చేసింది. ఇకపై బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ ఉన్న వారికే ట్వీట్‌డెక్‌ సర్వీసులు లభిస్తాయి. అంతేకాదు ట్వీట్‌డెక్‌ పేరును కూడా ఇకపై ‘ఎక్స్‌ప్రో’గా (XPro) వ్యవహరించనున్నారు.

ట్వీట్‌ డెక్‌ అనేది ఓ థర్డ్‌పార్టీ సర్వీసుగా ఉండేది. దీన్ని ట్విటర్‌ 2011లో కొనుగోలు చేసింది. ఒకేసారి వివిధ ట్విటర్‌ అకౌంట్లను చూడడంతో పాటు సింగిల్‌ పేజీలో వివిధ ట్విటర్‌ హ్యాండిళ్లను ఆర్గనైజ్‌ చేయడానికి ట్వీట్‌ డెక్‌ ఉపయోగపడుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఓ డ్యాష్‌బోర్డును పోలి ఉంటుంది. బ్లూ సర్వీసులు ఉన్న వారికే ఇకపై ట్వీట్‌ డెక్‌ సేవలు అందిస్తామని జులైలోనే ఎక్స్‌ వెల్లడించింది. అందులో బాగంగా తాజాగా మార్పులు చేసింది. బుధవారం (ఆగస్టు 16) నుంచి ట్వీట్‌ డెక్‌ను ఉపయోగించడానికి ప్రయత్నించే వారికి బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ (Blue subscribers) తీసుకోవాలని ఎక్స్‌ సూచిస్తోంది. ట్వీట్‌ డెక్‌ ఓపెన్‌ చేస్తుంటే బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ పేజీ ఓపెన్‌ అవుతోంది.

‘ట్విటర్‌ బ్లూతో పైసా వసూల్‌..’.. మస్క్‌పై ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రశంసలు!

బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలంటే నెలకు రూ.650 చెల్లించాల్సి ఉంటుంది. అదే ఏడాదికైతే రూ.6800 చెల్లించాలి. బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారు 25వేల అక్షరాల కలిగిన సుదీర్ఘ పోస్టులు చేయొచ్చు. అలాగే ఫుల్‌ హెచ్‌డీ వీడియోలను అప్‌లోడ్‌ చేయొచ్చు. సెర్చ్‌ చేసేటప్పుడు మీ పోస్టులను టాప్‌లో చూపిస్తారని ఎక్స్‌ పేర్కొంది. దీంతో పాటు ట్వీట్లను ఎడిట్ చేసుకునే సదుపాయం కూడా లభిస్తుందని తెలిపింది. వీలైనంత ఎక్కువ మందిని బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఎక్స్‌ వేస్తున్న ఎత్తుగడ ఇది అని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. తాజాగా తీసుకొచ్చిన రెవెన్యూ షేరింగ్‌ పాలసీ కూడా ఇందులో భాగమేనని చర్చించుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని