WhatsApp: వాట్సప్‌లో పంపే టెక్ట్స్‌ మరింత ఆకర్షణీయంగా..

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సప్‌ తన యూజర్ల కోసం టెక్ట్స్‌ ఫార్మాటింగ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈవిషయాన్ని జుకర్‌ బర్గ్‌ స్వయంగా వెల్లడించారు.

Published : 23 Feb 2024 02:18 IST

WhatsApp | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (WhatsApp) మరో కొత్త అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. గ్రూపులు, ఇతరులకు పంపే టెక్ట్స్‌ను ఆకర్షణీయంగా మార్చేందుకు తాజాగా ఫార్మాటింగ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తన వాట్సప్‌ ఛానెల్ ద్వారా వెల్లడించారు. అధికారిక సమాచారం పంపిచాలనుకొనే వారికి ఈ ఆప్షన్లు ఉపయోగపడనున్నాయి.

వాట్సప్‌లో ఎలాంటి సమాచారం పంపించాలన్నా సాధారణ టెక్ట్స్‌ రూపంలోనే పంపించాలి. వాటికి మెరుగులు దిద్దాలంటే కొన్ని ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. అదనపు హంగులు కావాలంటే మరో యాప్‌పై ఆధారపడాల్సి వచ్చేది. ఇకపై అలాంటి సమస్య ఉండదు. అధికారిక సమాచారం పంపించాలన్నా, సుదీర్ఘ టెక్ట్స్‌ని పంపే సమయంలో ముఖ్యమైన అంశాలను నంబరింగ్‌, ఇన్‌లైన్‌ కోడ్‌, బ్లాక్‌ కోట్‌, బుల్లెట్స్‌ రూపంలో మార్చడం ఇక సులువు.

ఫోన్‌, పీసీ వాడుతున్నారా? ప్రభుత్వం అందిస్తున్న ఈ టూల్స్‌ గురించి తెలుసా?

మీరు పంపించాలనుకున్న టెక్ట్స్‌లో ఏవైనా ముఖ్యమైన విషయాలను బుల్లెట్స్‌ రూపంలో అందించాలనుకుంటే ఆ వాక్యం ముందు ‘-’ టైప్‌ చేయాలి. కంప్యూటర్‌లో Shift+Enter టైప్‌ చేస్తే తర్వాత వాక్యానికి కూడా బుల్లెట్‌ వచ్చేస్తుంది. నంబర్డ్‌ లిస్ట్‌ కోసం టెక్ట్స్‌ ముందు ‘1. 2.’ ఇలా సంఖ్యలను టైప్‌ చేయాలి. బుల్లెట్‌ మాదిరిగానే ఇదీ పని చేస్తుంది. సుదీర్ఘమైన టెక్ట్స్‌లో ముఖ్యమైన పాయింట్లను హైలైట్‌ చేయడానికి ఆ వాక్యాల ముందు ‘>’ ని టైప్‌ చేయాలి. ఇదే బ్లాక్‌ కోట్‌. బ్యాక్‌గ్రౌండ్‌తో సహా వాక్యాన్ని హైలైట్‌ చేయడానికి ఇన్‌లైన్‌ కోడ్‌ చిహ్నాల `` మధ్యన పదాలు ఉంచాలి. వాట్సప్‌ తీసుకొచ్చిన ఈ నాలుగు ఆప్షన్లను ఆండ్రాయిడ్‌, ఐఫోన్, వెబ్‌తో పాటు మ్యాక్‌ డెస్క్‌టాప్‌ యూజర్లు వినియోగించుకోవచ్చు. వ్యక్తిగత, గ్రూప్‌ చాట్‌లకే కాకుండా ఛానెల్‌ అడ్మిన్‌లకూ ఈ ఫార్మాటింగ్‌ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని