WhatsApp: వాట్సప్‌ పిన్‌ ఫీచర్‌ మరింత మెరుగ్గా.. ఇకపై 3 మెసేజ్‌ల వరకు

WhatsApp: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందించే వాట్సప్‌ తాజాగా మరో అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. పిన్‌ ఫీచర్‌ను మరింత మెరుగుపర్చినట్లు వెల్లడించింది.

Updated : 22 Mar 2024 12:56 IST

WhatsApp | ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సప్‌ను ఎప్పటికప్పుడు చూసుకోకపోతే.. చదవని మెసేజ్‌లు చాలా ఉండిపోతుంటాయి. అలాంటప్పుడు అందులో ముఖ్యమైనదేదో తెలుసుకోవాలంటే ప్రతిదాన్ని తెరిచి చూడాల్సిందే. దీనికి పరిష్కారంగా గత డిసెంబర్‌లో ఈ మెసేజింగ్‌ యాప్‌ (WhatsApp) పిన్ చాట్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే, ఒకటి కంటే ఎక్కువ మెసేజ్‌లను పిన్‌ చేసుకునే వీలుండేది కాదు. దీంతో ఈ ఫీచర్‌ను మరింత మెరుగుపర్చింది. ఇప్పుడు గరిష్ఠంగా మూడు మెసేజ్‌ల వరకు పిన్‌ చేసుకునే వీలు కల్పించింది. ఈ విషయాన్ని మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ స్వయంగా తన వాట్సప్‌ ఛానల్‌ ద్వారా వెల్లడించారు.

వ్యక్తిగత చాట్‌లు, గ్రూపుల్లో జరిగే సంభాషణలను వ్యక్తులు మిస్‌ అవ్వకుండా ఉండేందుకు వాట్సప్‌ (WhatsApp) తీసుకొచ్చిన పిన్‌ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. గ్రూప్‌లోని సభ్యులు ముఖ్యమైన సమాచారాన్ని మిస్‌ అవ్వకుండా ఉండేందుకు ఈ ఫీచర్‌ను గ్రూప్‌ అడ్మిన్లు వినియోగించొచ్చు. కేవలం టెక్ట్స్‌ మెసేజ్‌లే కాకుండా, వాట్సప్‌ పోల్స్‌, ఫొటోలు, ఎమోజీలు ఇలా అన్నింటినీ పిన్‌ చేయొచ్చు. ఇలా పిన్‌ చేసిన మెసేజ్‌లు వాట్సప్‌ చాట్‌లోని పై భాగంలో కనిపిస్తాయి. మెసేజ్‌పై లాంగ్‌ ప్రెస్‌ చేసి మెన్యూలో పిన్‌ ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది.

వాట్సప్‌ కొత్త ఫీచర్‌..త్వరలో టెక్ట్స్‌ రూపంలోకి వాయిస్‌ మెసేజ్‌!

ఇలా పిన్‌ చేసినవి డిఫాల్ట్‌గా ఏడు రోజులు ఉంటాయి. కావాలనుకుంటే 24 గంటలు, 30 రోజులు ఉండేలా సెట్‌ చేయొచ్చు. టైమ్‌ లిమిట్ అయిపోగానే పిన్‌ చేసిన మెసేజ్‌ అన్‌పిన్ అవుతుంది. గ్రూప్‌లోని సభ్యులకు పిన్‌ చేసే నియంత్రణ అందించడం అడ్మిన్‌ చేతిలోనే ఉంటుంది. ఈ ఫీచర్‌ మొబైల్‌, డెస్క్‌టాప్‌ యూజర్లకు అందుబాటులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని